– రిజర్వేషన్ల అంశంపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న రేవంత్
– సైలెంట్‌గా ఉండిపోయిన కేసీఆర్
– అధినేత దారిలోనే గులాబీ గ్యాంగ్
– బీఆర్ఎస్‌కు ముస్లింలు ఓట్లు వేసే యంత్రాలేనా?
– కేసీఆర్ మౌనం దేనికి సంకేతం?
– బిడ్డ బెయిల్ కోసం కాంప్రమైజ్ అయ్యారా?
– బీజేపీతో దోస్తీకి తహతహలాడుతున్నారా?
– పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర చర్చ
KCR silience on Muslim reservation tie up with bjp: దేశం మొత్తం రిజర్వేషన్లతో రగిలిపోతోంది. ఈ అంశంలో ఇప్పటికే నాలుక మడతపెట్టిన బీజేపీ తాము వ్యతిరేకం కాదని వాదిస్తోంది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం బాగానే జరిగింది. రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని నోటికొచ్చినట్లు మాట్లాడిన కాషాయ దళానికి ఇప్పటిదాకా జరిగిన రెండు దశల పోలింగ్ ఓటింగ్ సరళితో భయం పట్టుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దలు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి బీజేపీని ఇరుకున పెట్టారు. మరి, దేశమంతా రిజర్వేషన్ల గురించి రాద్దాంతం జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదు? తన బిడ్డ బెయిల్ కోసమే మౌనంగా ఉండిపోయారా? నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించుతామంటున్న కేసీఆర్, కేటీఆర్ బీజేపీపై ఎందుకు మాట్లాడరు? ఈటలను కేటీఆర్ ఎందుకు ప్రశ్నించరు? బీజేపీ బలంగా ఉన్న చోట్ల ఎందుకు బస్సు యాత్ర జరగడం లేదు? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు కావాలని తెలంగాణ సమాజం కోరుకుంటోంది.
కేసీఆర్‌ను నిలదీయని ఈటల.. ఎందుకు?
కేసీఆర్ హయాంలో భూములు తెగనమ్ముకుంటే అప్పట్లో ఈటల రాజేందర్ ఒక్కమాటైనా అనలేదనే అపవాదు ఉంది. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి, ఈటలను స్నేహపూర్వకంగా కలిసినా దానిపై క్లారిటీ లేదు. బీజేపీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం మల్లారెడ్డి వ్యాఖ్యలతో తేలిపోయింది. అందుకే, ఆయనకి కనీసం షోకాజ్ నోటీసు సైతం ఇవ్వలేదని గర్తు చేస్తున్నారు. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ రెండూ కూడా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాయి. కేసీఆర్ అయితే తన ప్రసంగాలలో ఎక్కడా రిజర్వేషన్ల అంశం లేకుండా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన హయాంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల అంశం కేవలం నోటి మాటకే పరిమితం అయింది. ఫలితంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓట్లకు గండి పడింది. అయినా, కేసీఆర్ మౌనంగా ఉండిపోవడం చూస్తుంటే బిడ్డ బెయిల్ కాంప్రమైజ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ అంతే!
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రచారానికి వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అన్నారు. అప్పుడు ముస్లింలకు కేసీఆర్ అమలు చేస్తున్న 4 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని షా చెప్పటమే విచిత్రంగా అనిపించింది. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా రిజర్వేషన్లను అమలు చేస్తుంటే, మరి కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా ఏం చేస్తున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ విషయం తెలియదా? ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ విరుద్ధమైన పాలన చేస్తుంటే మిగిలిన వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి? అమిత్ షా ఏ ఉద్దేశంతో చెప్పినా అది అసెంబ్లీ ఎన్నికలలో తీవ్ర ప్రభావమే చూపింది.
ఓట్లే ప్రధానం
తెలంగాణలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంంటుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓల్డ్ సిటీతో పాటు రంగారెడ్డి జిల్లాలో కీలక ఓటర్లుగా ఉన్నారు. అలాగే నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే జీవిస్తున్నారు. వీళ్ళంతా పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఎలాగూ ముస్లిం ఓట్లు బీజేపీకి రావటం లేదని అమిత్ షా లెక్కేసుకున్నారో ఏమో కానీ, పదేపదే రిజర్వేషన్ల రద్దు ప్రస్తావన తెస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ దీనిపై వాడేస్తున్నారు. ముస్లిం ఓట్లు కావాలంటే ఏవైనా పథకాలు ప్రకటిస్తే వారిలో కొందరైనా బీజేపీ వైపు ఆకర్షితులయ్యే అవకాశాలున్నాయి. అంతేకానీ, ఉన్న రిజర్వేషన్లను కూడా లాగేసుకుంటామంటే ముస్లింలు మరింతగా రెచ్చిపోయి బీజేపీకి వ్యతిరేకంగా వేయరా? ఇన్నీ తెలిసి కేసీఆర్ రిజర్వేషన్లపై మౌనంగా ఎందుకు ఉంటున్నారనే ప్రశ్న ఎదురవుతోంది. బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికేనా? లిక్కర్ కేసు నుంచి కవితను తప్పించడానికేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.