– ఫోన్ ట్యాపింగ్ ప్రధాన బాధ్యుడు కేసీఆరే
– కేంద్రం స్పందించాలి.. సీబీఐతో విచారణ చేయించాలి
– అధికారం శాశ్వతం అన్నట్టు కేసీఆర్ కుట్రలు చేశారు
– ఆయన స్వయంకృపరాధం వల్లే ఓడిపోయారు
– బీఆర్ఎస్ భస్మాసుర అస్త్రం అయింది
– ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు
KCR: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన నిజాలు వెలుగుచూస్తున్న వేళ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు. అప్పటి ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలను బెదిరించిన తీరుపై నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ చేయించాలని వ్యాఖ్యానించారు. ఈ కేసులో కేసీఆర్ వంద శాతం ఇరుక్కుంటారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రం స్పందించాలన్న ఆయన, కేసీఆర్ అధికారం శాశ్వతం అనుకుని కుట్రలకు తెరతీశారని మండిపడ్డారు. ఆయన చేసిన తప్పులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. ఆయన స్వయంకృపరాధం వల్లే అధికారానికి దూరమయ్యారని విమర్శించారు. ట్యాపింగ్‌కు బాధ్యుడు కేసీఆరేనని ఆరోపించారు.
కేసీఆర్‌కు బీఆర్ఎస్ అనే పేరు భస్మాసుర అస్త్రం అయిందని ఎద్దేవ చేశారు జీవన్ రెడ్డి. రాష్ట్ర గీతంపై జరుగుతున్న వివాదంపైనా స్పందించిన ఆయన, గతంలో ఆంధ్రా సినిమాలకు పన్ను మినహాయింపు ఇచ్చిన బీఆర్ఎస్, ఇప్పుడు రాష్ట్ర గీతాన్ని కీరవాణితో పాడించడాన్ని తప్పు పట్టడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపైనా విమర్శలు గుప్పించారు. బీజేపీ అంటేనే ఓటు బ్యాంకు రాజకీయాలకు కేంద్ర బిందువని, మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుతోందని మండిపడ్డారు. అన్ని వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మోదీ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్లలో హిందూ సమాజానికి మోదీ చేసిందేమీ లేదని విమర్శించిన జీవన్ రెడ్డి, వారి మెప్పు పొందేందుకే ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంటూ రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఈ డబ్ల్యూసీ రిజర్వేషన్లతో దళితులు, బలహీన వర్గాలు అన్యాయానికి గురి అవుతున్నాయని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.