Congress: రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. అధికారం తమకు దక్కుతున్నదా? లేదా? తమ పార్టీ ప్రయోజనం పొందుతున్నదా? లేదా? తమ శ్రేయోభిలాషులకు లాభిస్తుందా? లేదా? ఇలా ఉంటుంది వ్యవహారం. సమీప గతాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇందుకు భిన్నమైందని తేటతెల్లం అవుతుంది. ఇందుకు ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ సజీవ సాక్ష్యం.
ప్రత్యేక తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది. ఇందులో ఎందరో యోధులు అసువులు బాసారు. మలిదశ ఉద్యమంలో యువత ఎక్కువగా త్యాగాలకు పూనుకుంది. ఈ యువత బలిదానాలను ఆపాలని, రాజకీయంగా తమకు నష్టమే జరుగుతుందని తెలిసినా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణకు మొగ్గింది. యువత బలిదానాలను అడ్డుకుని ఇక్కడి ప్రజల చిరకాల కలను సాకారం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలోనూ న్యాయబద్ధమైన నిర్ణయాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కంటే కూడా తెలంగాణలో ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుందని తేలింది. ఇక్కడ హైదరాబాద్ పెద్ద నగరం, పరిశ్రమలు ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో విద్యుత్ ఖర్చు ఎక్కువ. ఈ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి పదేళ్లు విద్యుత్ కేటాయింపుల్లో తెలంగాణకు కొంత ఎక్కువ వాటా ఉండాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఎవరి విద్యుత్ వారిదే. ఇందుకోసం కొత్తగా ఏర్పడిన తెలంగాణకు 53.89 శాతం విద్యుత్‌ను కేటాయించాలని, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ అందించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొత్తగా రాష్ట్రం విడిపోవడం మూలంగా వెంటనే సర్దుకోలేం. కాబట్టి, పదేళ్ల గడువును పెట్టింది.
Also Read: ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగింపు.. బెయిల్ పరిస్థితేంటీ?
కానీ, 2014 లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు తెలంగాణ దక్కాల్సిన వాటా దక్కకుండా చేసింది. అన్యాయంగా ఏడు మండలాలను, అందులోనూ మనకు దక్కాల్సిన సీలేరు పవర్ ప్లాంట్‌ను అప్పటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అప్పజెప్పిందని కేసీఆర్ వివరించారు. దీనికి కారణాన్ని కూడా ఆయన తెలిపారు. అప్పటి ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో టీడీపీ భాగంగానే ఉన్నది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కొత్త రాష్ట్రానికి దన్నుగా నిలుద్దామని కాకుండా తెలంగాణకే కేంద్ర ప్రభుత్వం నష్టం చేసిందని కేసీఆర్ వివరించారు.
ఈ ఎపిసోడ్‌ను కొంచెం అర్థం చేసుకున్నా.. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలను కాకుండా ప్రజల అవసరాలను, సమస్యలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంది. ఏపీలో నష్టపోతామని తెలిసినా ప్రత్యేక తెలంగాణను యువత బలిదానాలను అడ్డుకోవడానికి ఇచ్చింది. ఆ తర్వాత తెలంగాణలోనూ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఉభయ రాష్ట్రాల్లో నష్టపోయినా రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలనే సంకల్పం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నదని కేసీఆర్ మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు.