– ఉద్యమ సమయంలో దొంగ దీక్ష చేసినట్టు..
– ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారు
– ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం దగ్గర పక్కా ఆధారాలున్నాయి
– కేసీఆర్ అండ్ కో జైలుకు వెళ్లడం ఖాయం
– దమ్ముంటే దొంగ దీక్షపై చర్చకు రావాలి
– కేసీఆర్‌కు గోనె ప్రకాష్ రావు సవాల్
Congress: కేసీఆర్ ఇంకెంతకాలం ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. పదే పదే చావు నోట్లో తల పెట్టానని దొంగ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్, హరీష్ రావు అమాయకులను మోసం చేశారని అన్నారు. ఉద్యమంలో 12 వందల మందికి చావుకు కారణమయ్యారని ఆరోపించారు. ఆనాడు హరీష్ రావుకు 60 లీటర్ల పెట్రోల్ దొరికింది కానీ, అద్ద రూపాయి అగ్గిపెట్టె దొరకలేదని సెటైర్లు వేశారు.
కేసీఆర్‌కి నీతి, నిజాయితీ ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని, దొంగ దీక్షపై చర్చకు రావాలన్నారు. ఇప్పటికైనా ఆయన ఓటమిని ఒప్పుకోవాలన్న ప్రకాష్ రావు, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క లోక్ సభ సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వంద శాతం కేసీఆర్ జైలుకు వెళ్తారని అన్నారు. రాధా కిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఆయన భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఓటుకు నోటు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఎందుకు బ్రీఫ్ ఇచ్చారని ప్రశ్నించారు. ఆయనకు తెలియదా అధికారులు కాకుండా ఎందుకు మాట్లాడారు అంటూ ఫైరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, అందుకే చర్లపల్లి జైల్లో కేసీఆర్‌కు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని చెబుతున్నారని అన్నారు గోనె ప్రకాష్ రావు. ఈ కేసులో చాలామంది ఉన్నారని, అందరూ బాధ్యులేనని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అధికారులు జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు.
Also Read: బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ సీరియస్.. క్రిమినల్ కేసు నమోదు
కేసీఆర్ తన తప్పులను తెలుసుకోవాలని, ప్రజలను మభ్య పెట్టడం మానుకోవాలని హితవు పలికారు. ఏనాడూ కార్నర్ సమావేశాలు పెట్టలేదని, సర్పంచ్ ఎన్నికలకు కూడా హెలికాప్టర్‌లో తిరిగారని గుర్తు చేశారు. ప్రజల్లో ఆదరణ తగ్గడంతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారని ఎద్దేవ చేశారు. కేసీఆర్ ప్రజల్లో నిరాదరణకు గురి అయ్యారని, మళ్లీ మోసం చేయడానికి బయటకు వచ్చారని విమర్శించారు. ఉద్యమకాలంలో ప్రజలను కేసీఆర్ ఏవిధంగా మోసం చేశారో ఇప్పుడు కూడా అలా తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆనాడు ఖమ్మంలో దొంగ దీక్ష చేసి జ్యూస్ తీసుకున్నారని, మల్టీ విటమిన్ తీసుకొని దీక్ష చేశారని అన్నారు.