– ఎట్టకేలకు కేసీఆర్ అన్న కొడుకు అరెస్ట్
– కబ్జా కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
– కేసు నమోదయ్యాక సింగపూర్ పారిపోయిన కన్నారావు
– సుప్రీం న్యాయవాదిని కలిసేందుకు హైదరాబాద్ రాక
– పసిగట్టిన పోలీసులు.. వెంటనే అరెస్ట్
– కోర్టులో హాజరు.. 14 రోజుల రిమాండ్
KCR Brother Son Kalvakuntla Kannarao Arrest : కల్వకుంట్ల ఫ్యామిలీని కష్టాలు వెంటాడుతున్నాయి. ఓవైపు లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. కబ్జా కేసులో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదయ్యాక సింగపూర్ పారిపోయిన కన్నారావు, సుప్రీంకోర్టు లాయర్‌ను కలిసేందుకు నగరానికి వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు
కేసు నమోదైన తర్వాత బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు కన్నారావు. రెండు సార్లు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. హైకోర్టులో కేసు కొట్టేయాలని వేసిన పిటిషన్ కూడా తిరస్కరణకు గురయ్యింది. దీంతో సుప్రీంకోర్టులో పిటిషన్ విషయంపై చర్చించేందుకు హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి పోలీసులు కన్నారావును అదుపులోకి తీసుకున్నారు. ఈయనపై గతంలోనే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.
అసలేంటీ వివాదం
కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వర్ రావు ఆదిభట్ల ఓఎస్ఆర్ ప్రాజెక్స్ట్ కు చెందిన భూమిలో ఫెన్సింగ్ ధ్వంసం చేసి కబ్జా పెట్టినట్టు కొద్ది రోజుల క్రితం కేసు నమోదైంది. సదరు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ ఈ ఫిర్యాదు చేశారు. ఇందులో కన్నారావుతోపాటు 38 మంది బీఆర్ఎస్ నాయకుల ఇన్వాల్వ్ మెంట్ ఉండడంతో కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ఎకరాల భూమికి సంబంధించి ఈ వివాదం రాజుకుంది. ఆ భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు ప్రయత్నిస్తున్నారని బాధితుడు వాపోయాడు. ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించి హద్దు రాళ్లు పాతినట్టు తెలిపాడు. ఫెన్సింగ్‌కు ఉన్న షీట్స్ ను తగులబెట్టినట్టు చెప్పాడు. దీంతో పోలీసులు కన్నారావు సహా మిగిలిన వారిపై 307, 447, 427, 436, 148, 149 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు పెట్టారు.
గతంలో తలసానికి వార్నింగ్
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కన్నారావు ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసేవాడని, దీనికోసం అల్వాల్‌లో ఒక డెన్ ఏర్పాటు చేసుకున్నట్టు ప్రచారం ఉంది. మాజీ నక్సల్స్ తో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకొని సెటిల్మెంట్లకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను బెదిరించిన ఫోన్ కాల్ ఒకటి అప్పట్లో వైరలైంది. కన్నారావు ఆగడాలను గత ప్రభుత్వంలో పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిభట్ల పీఎస్‌లో కేసు ఫైల్ అయింది. అయితే, దీన్ని కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు బిగ్ షాక్ తగిలింది. పిటిషన్‌ను కొట్టేసింది న్యాయస్థానం. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీపట్నం కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి.
పోలీసులు ఏమంటున్నారంటే!
మార్చి 3న కన్నారావు అండ్ గ్యాంగ్ మన్నెగూడలోని ల్యాండ్ కబ్జా చేసే ప్రయత్నం చేశారని ఆదిభట్ల సీఐ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, తన అనుచరులతో కలిసి జేసీబీ సాయంతో కన్నారావు కాంపౌండ్ వాల్ కూల్చేశారని చెప్పారు. అంతేకాదు, ల్యాండ్ దగ్గర ఉన్న వారిపై దాడికి కూడా పాల్పడ్డారని, జెక్కిడి సురేందర్ రెడ్డి, జెక్కిడి చంద్రారెడ్డి దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకుని సెటిల్మెంట్ చేస్తానని కన్నారావు చెప్పినట్టు తెలిపారు. ఈ కేసులో ఇప్పటిదాకా 9 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. కన్నారావుపై గతంలోనూ కబ్జా కేసులు ఉన్నట్టు సమాచారం ఉందన్నారు. అయితే, తనకు అగ్రిమెంట్ ఉందని, ల్యాండ్ డెవలప్మెంట్ చేస్తానని తెలిపారు కన్నారావు. ల్యాండ్ వివాదంపై కోర్టు డిసైడ్ చేస్తుందని, ప్రస్తుతం తానేమీ మాట్లాడలేనని చెప్పారు.