– 5 లోక్‌సభ సీట్లు బీజేపీకి వదిలేసిన కేసీఆర్
– బీజేపీ- బీఆర్ఎస్ చీకటి ఒప్పందం
– కేటీఆర్ హస్తిన పర్యటన మర్మం ఇదేనా?
– ఓడేందుకే ఆ ఐదుగురూ బరిలో నిలిపారా?
KCR Betrayed The BC Leaders For The Daughter: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నాటి నుంచి బీఆర్ఎస్ అధినేతకు రోజుకో సవాలు ఎదురవుతోంది. ఆయన ఊహించని రీతిలో జనం కాంగ్రెస్‌కు పట్టం కట్టడం, ఆదినుంచి తనను రాజకీయంగా దీటుగా నిలువరించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఆయనకు మింగుడు పడని ముచ్చటగా మారింది. దీనికి తోడు తలనొప్పిగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజురోజుకూ బయటకొస్తున్న వాస్తవాలు, రోజురోజుకూ చేజారి పోతున్న పార్టీ నేతలు, టికెట్ ఇస్తామన్నా మొహం చాటేస్తున్న నేతల వ్యవహారశైలి, సహకరించని అనారోగ్యంతో సతమతమవుతున్న బీఆర్ఎస్ అధినేతకు ఊహించని రీతిలో మరోకష్టం వచ్చిపడింది. కాలం కలిసి రాకపోతే తాడే పామై కాటేస్తుందన్న చందాన, తన ముద్దుల కుమార్తె కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అరెస్టు చేసి తీహార్ జైల్లో పెట్టటం ఇప్పుడు ఆయనకు నిద్రపట్టనీయటం లేదు.
ఎలాగైనా ఈ సమస్యల పద్మవ్యూహం నుంచి బయటపడి తిరిగి చక్రం తిప్పాలంటే రాజీ పడక తప్పదనే క్లారిటీకి గులాబీ బాస్ వచ్చేశారు. ‘రాజ్యం నాది, రాష్ట్రం నా కుటుంబానిది’ అన్నట్టుగా వ్యవహరించి, నిన్నటి వరకు అప్రతిహత అధికారాన్ని అనుభవిస్తూ, కేంద్రపాలకులను ఎగతాళి చేసిన కేసీఆర్, నేడు ‘నమో నమో’ అంటూ ఢిల్లీ పాలకులకు పూర్తిగా పాదాక్రాంతమయ్యారనీ, ఈ సార్వత్రిక ఎన్నికల వేళ.. కేంద్ర పాలకుల పట్ల తన విధేయతను చాటుకునేందుకు తెలంగాణలోని 17 సీట్లలో 5 సీట్లను నజరానాగా చెల్లించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇండియా కూటమి వస్తే..అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేంద్రంలో ఒకవేళ ఇండియా కూటమి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఇక ఆపటం అసాధ్యమనే ఆందోళనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీటైనా దక్కదని అంచనాకు వచ్చిన గులాబీ బాస్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని శరణువేడటమే బెటర్ అని ఫిక్సయ్యారనీ, తన మనసులోని మాటను చెప్పేందుకే కుమారుడిని హస్తిన పంపారని సమాచారం.
కమలంతో దోస్తీకి పచ్చజెండా
తెలంగాణ ఉద్యమకాలంలో బీజేపీతో తెరవెనక రాజకీయం నడిపిన కేసీఆర్.. 2014లో సీఎం కాగానే వారికి బై బై చెప్పేశారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతికేక కూటమి కట్టేందుకు జాతీయ పార్టీని ఏర్పాటు చేసి హడావుడి చేశారు. అయితే, ఆ ప్లాన్ అట్టర్ ప్లాప్ కావటమే గాక, ఉన్న రాష్ట్రంలోనూ అధికారం పోవటంతో ఇప్పుడు మళ్లీ కమనాథులకు మిత్రుడిగా ఉంటానంటూ రాయబారాలు పంపినట్లు సమాచారం. ముఖ్యంగా కుమార్తె అరెస్టు తర్వాత కమలనాథులతో దోస్తీ లేకుండా తన బిడ్డ బయటికి రావటం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీకి తెర వెనుక మద్దతివ్వడం ద్వారా రాజకీయంగా తన ఉనికిని నిలుపుకోవటంతో బాటు తన కుమార్తెను కాపాడుకోవచ్చనే నిర్ణయానికొచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ ఢిల్లీ పెద్దల ముందు తండ్రి మనసులోని మాటను చర్చకు పెట్టినట్లు, దీనికి వారు కూడా అంగీకరించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, భువనగిరి, జహీరాబాద్ సీట్లలో బీఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థులను నిలిపి, అక్కడ బీజేపీ గెలుపుకు దోహదపడనుంది.
ఆ 5 సీట్లలో ఇదీ పరిస్థితి
మహబూబ్ నగర్‌లో సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డికే బీఆర్ఎస్ టికెట్ ఇవ్వగా, నేటి వరకు ఆయన ప్రచార పర్వంలోకి దిగలేదు. అసలు ఆ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నట్లుగా లేదని గులాబీ పార్టీ కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు. దీంతో ఇక్కడ డీకే అరుణ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలూ తెరవెనక రాజకీయం చేస్తున్నట్లు సమాచారం. నేటి వరకు కేసీఆర్ గానీ, కేటీఆర్, హరీష్ రావులు ఆ అటువైపు కూడా వెళ్లటం లేదు.
ఇక చేవెళ్లలో ఏనాడో రాజకీయం నుంచి తప్పుకుని ఇంటికే పరిమితమైన కాసాని జ్ఞానేశ్వర్‌కు టికెట్ ఇవ్వటం సొంతపార్టీ నేతలనే ఆశ్చర్యపరుస్తోంది. ముదిరాజ్ వర్గ నేతగా తప్ప కనీసం బీసీ సమాజంలోనూ పెద్దగా గుర్తింపులేని నేతను అంగబలం, అర్థబలం ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి లకు ప్రత్యర్థిగా దించటం రాజీ రాజకీయం నిజమేననే సందేశాన్ని అందిస్తోంది. శేరిలింగంపల్లి వంటి పెద్ద నియోజకవర్గాలున్న చేవెళ్ల సీటులో కనీసం సబితా ఇంద్రారెడ్డి కుమారుడిని బరిలో దింపితే పార్టీ అయినా నిలబడేదని స్థానిక నేతలు గొణుక్కుంటున్నారు.
ఈటెల రాజేందర్ రాజీకీయ జీవితాన్ని సమాధి చేయటమే లక్ష్యంగా రెండేళ్లనాడు రాజకీయం చేసిన కేసీఆర్ కుటుంబం ఆయన మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి కాగానే, ఆయన గెలుపుకు ఇష్టంలేకున్నా పనిచేయాల్సి వస్తోంది. కేసీఆర్‌తో వ్యవహారం చెడినా, నేటికీ రాజేందర్‌కు హరీశ్, కేటీఆర్‌తో మంచి సంబంధాలే ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఇక్కడ తొలుత ఇక్కడ మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డిని బరిలో దించాలని భావించిన కేసీఆర్.. ఢిల్లీ రాజీ తర్వాత ఉప్పల్ సెగ్మెంట్‌కు చెందిన మాజీ కాంగ్రెస్ నేత, రాగిడి లక్ష్మారెడ్డిని బరిలో నిలిపారు. ఇది నచ్చకే కుత్బుల్లాపూర్ బీజేపీ ఇన్‌ఛార్జ్ కూన శ్రీశైలం గౌడ్ వంటివారు కాంగ్రెస్‌లో చేరారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక భువనగిరి సీటు విషయంలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ సీటు పరిధిలోని మునుగోడు తన స్వగ్రామమనీ, కనుక తన కుమారుడు అమిత్ రెడ్డికి ఇక్కడ అవకాశం ఇవ్వాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గతంలో కేసీఆర్‌ను కోరారు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం మద్దతు లేకుండా గెలవటం అసాధ్యమని తెలిసీ, హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ నుంచి బీసీ నేత క్యామ మల్లేష్‌ను కేసీఆర్ బరిలోకి దింపారు. నిజంగా బీసీకే ఇవ్వాలంటే బలమైన బీసీ అభ్యర్థులు ఎందరో ఉన్నా, వారిని పక్కనబెట్టి అక్కడ బీజేపీ తరపున పోటీ చేస్తున్న బూర నర్సయ్య గౌడ్ గెలుపు కోసమే బీసీని బరిలో దింపారని గులాబీ కార్యకర్తలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు.
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి రెండు రోజుల్లోనే టికెట్ సాధించుకున్నారు. కానీ, ఆయనపై బీఆర్ఎస్ నేతలు ఎలాంటి విమర్శలకూ దిగకపోవటం, ఆ సీటును కోరిన పోచారం శ్రీనివాస రెడ్డి కుమారుడి పేరును పక్కనపెట్టటంపై అప్పట్లోనే బీజేపీ- కేసీఆర్ మధ్య దోస్తీ కుదిరిందనే వార్తలొచ్చాయి. దీనికి తోడు ఎన్నికల ముందు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్‌లో చేరిన స్థానికేతరుడైన గాలి అనిల్ కుమార్‌కు సీటివ్వటం ఈ అనుమానాలను మరింత పెంచుతోంది. ఇంత కీలకమైన సీటులో బలహీనమైన బీసీ అభ్యర్థిని బరిలో నిలపటంతో ఈ అనుమానాలు నిజమేననే ప్రచారం ఇప్పుడు అక్కడ జరుగుతోంది.
బీసీలే బలి
ఈ 5 సీట్లలో నేటి వరకు వారెవరూ ప్రచారం ప్రారంభించకపోవటం, పార్టీ అగ్రనేతలెవరూ ఆ నియోజక వర్గాల్లో పర్యటించటం గానీ, ఆ నియోజక వర్గాల గురించి మాట్లాడకపోవటంతో ఇది ఖచ్చితంగా బీజేపీకి సహకరించేందుకే అనే నిర్ధారణకు ఆ పార్టీ నేతలు వచ్చేశారు. దీంతో వాళ్లంతా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. అయితే, తమ బీసీ నేతలను తన స్వార్థరాజకీయానికి బలి చేయటం పట్ల బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్‌ను నమ్ముకుంటే నట్టేట మునగటం ఖాయమని, కనుక ఇకనైనా ఆ పార్టీ నుంచి బయటికి రావాలని రాష్ట్ర బీసీ నేతలు స్థానిక బీసీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అటు బీజేపీ కూడా కేసీఆర్‌కు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ అసలు లక్ష్యం అరవింద్ కేజ్రీవాల్ మాత్రమేనని, ఆయనను అరెస్టు చేయాలంటే కవిత అరెస్టు తప్పదని, ఎన్నికల తర్వాత కవిత విడుదల జరిగిపోతుందని, ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌ను ఎన్డీయేలో చేర్చుకుంటామనే హామీ కూడా కేసీఆర్ పొందినట్లు సమాచారం.