– కోర్టులో కవితకు మరోసారి చుక్కెదురు
– 23 దాకా జ్యుడీషియల్ కస్టడీ
– మూడు రోజుల విచారణపై సీబీఐ వివరణ
– సరైన సమాధానాలు ఇవ్వని కవిత
– తప్పుదోవ పట్టిస్తున్నారని అసహనం
– ఇది బీజేపీ కస్టడీగా పేర్కొన్న కవిత
– కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడడంపై జడ్జి ఆగ్రహం
Kavitha Judicial Custody Extended Till April 23(Breaking news in telangana) : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు భారీ షాక్ తగిలింది. ఆమె ఏం చేసినా అందుకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి. బెయిల్ విషయంలోనూ, దర్యాప్తు సంస్థల కస్టడీ అంశంలోనూ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. తాజాగా ఇంకోసారి జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
23 దాకా తీహార్ జైల్లోనే!
ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలుకు వెళ్లిన కవితను, ఈనెల 11న సీబీఐ అరెస్ట్ చేసింది. తమకు కొన్ని డౌట్స్ ఉన్నాయని, వాటిపై క్లారిటీ కావాలని కోర్టుకు వెళ్లింది. దీనికి గ్రీన్ సిగ్నల్ రావడంతో కవితను అరెస్ట్ చేసి మూడు రోజులపాటు విచారించారు అధికారులు. కస్టడీ ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపరిచారు. జ్యూడీషియల్ కస్టడీకి పంపాలని సీబీఐ కోరగా న్యాయమూర్తి అందుకు అంగీకరించారు. ఈనెల 23 వరకు కస్టడీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈడీ కేసులో ఆరోజు వరకు జ్యుడీషియల్ కస్టడీ ఉన్నందున సీబీఐ కేసులోనూ అప్పటిదాకా విధించారు.
కస్టడీ అప్లికేషన్‌లో సీబీఐ కీలక వ్యాఖ్యలు
మూడు రోజుల కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని సీబీఐ పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్ల వ్యవహారంపై ప్రశ్నించామని, లేని భూమి ఉన్నట్టుగా చూపి అమ్మకానికి పాల్పడిన విషయంపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు అధికారులు. ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు చెప్పారని, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్‌తో జరిగిన సమావేశాలపై ప్రశ్నించామని చెప్పారు. అడిగిన ప్రశ్నలకు సూటిగా సరైన సమాధానాలు చెప్పలేదని తెలిపారు. ఆమె విచారణను, సాక్షులను ప్రభావితం చేయగలిగిన పలుకుబడి కలిగిన వ్యక్తి అని, కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంతో పాటు, చెరిపేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించి డిజిటల్ పరికరాలను, డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందన్న సీబీఐ, ఈ పరిస్థితుల్లో ఆమెకు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించాలని కోరుతున్నట్టు కోర్టుకు విన్నవించింది. ఈ నేపథ్యంలో ఈనెల 23 దాకా కవితకు కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
మీడియాతో కవిత
కోర్టులో హాజరయ్యేందుకు వచ్చిన కవిత మీడియాతో మాట్లాడారు. బీజేపీపై మండిపడ్డారు. ఇది సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అంటూ మాట్లాడారు. బయట బీజేపీ వాళ్లు మాట్లాడేది లోపల సీబీఐ వాళ్ళు అడుగుతున్నారని, అడిగిందే రెండేళ్లుగా అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కవితపై కోర్టు సీరియస్
కవిత మీడియాతో మాట్లాడటంపై న్యాయమూర్తి కావేరి బవేజా తప్పుబట్టారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడటం సరైనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా మాట్లాడవద్దని హెచ్చరించారు. మీడియా ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారని జడ్జి ప్రశ్నించారు. సంతకాల కోసం న్యాయమూర్తి వద్దకు వెళ్ళిన సందర్భంలో కవిత న్యాయవాది మొహిత్ రావుతో ఈ విషయాన్ని చెప్పారు న్యాయమూర్తి కావేరి బవేజా.
బెయిల్ కోసం పిటిషన్
జ్యుడీషియల్ కస్టడీ నేపథ్యంలో బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు కవిత. ఈనెల 22న ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈ క్రమంలో సీబీఐకి నోటీసులు ఇచ్చారు న్యాయమూర్తి. 20వ తేదీ లోపు రిప్లై ఇవ్వాలని ఆదేశించారు. లిక్కర్ కేసులో కవితను ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది సీబీఐ. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు.