– అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆడిందే ఆట
– లిక్కర్ కేసుతో అంతా తారుమారు
– ఏం చేసినా, ఏం చేయాలనుకున్నా నిరాశే
– తీహార్ జైల్లోనే కవిత, కేజ్రీవాల్
– కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు
Kavitha and Kejriwal news today(Latest political news in India): రాజకీయాల్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలవ్వడం కామన్. ప్రజల వేలికి వేసే సిరాచుక్కే నాయకుల భవిష్యత్తు. వచ్చిందే ఛాన్స్ అని గెలిచాక, ఏదిబడితే అది చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దీనికి చక్కటి ఉదాహరణే లిక్కర్ స్కాం కేసు. కేంద్రంలోని బీజేపీని ఢీకొట్టి ఢిల్లీలో పాగా వేసిన ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్, తెలంగాణలో తొడగొట్టి సవాల్ చేసిన కేసీఆర్ కుమార్తె కవిత ఈ కేసులో ప్రధాన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. గత రెండేళ్లుగా దర్యాప్తు సంస్థలు ఈ స్కాంను తవ్వుతున్నాయి.
తాము అమాయకులమని కేజ్రీవాల్, కవిత చెప్తున్నా, దర్యాప్తు సంస్థల ఛార్జిషీట్లు, రిమాండ్ రిపోర్టుల్లో కీలక అభియోగాలు కనిపిస్తున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదంటారు. అలాగే, వీళ్ల ప్రమేయం లేకుండానే స్కాం జరిగిందా అంటే అందుకు దర్యాప్తు సంస్థలు ఒప్పుకోవడం లేదు. కచ్చితంగా వీళ్ల హస్తం ఉందని గట్టిగా వాదిస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన కవిత, కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. కొన్నాళ్లుగా బెయిల్ కోసం బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, కోర్టుల్లో వీరికి నిరాశే ఎదురవుతోంది. రిమాండ్ పొడిగింపు కొనసాగుతోంది.
తాజాగా, లిక్కర్ కేసులో కవితను సీబీఐ కూడా ప్రశ్నిస్తోంది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ వేయగా విచారణ జరిగింది. గత విచారణకు కొనసాగింపుగా వాదనలు కొనసాగాయి. కేసులో కవితను ప్రశ్నించడంపై రిప్లై ఫైల్ చేయమని కోర్టుకు తెలిపారు సబీఐ అధికారులు. శనివారమే ఆమెను ప్రశ్నించినట్లు స్పష్టం చేశారు. అయితే, సీబీఐ రిప్లై తమకు అందలేదని కోర్టుకు తెలిపారు ఆమె తరపు న్యాయవాది మోహిత్ రావు. దీంతో, భవిష్యత్‌లో జరిగే విచారణకు ముందస్తుగా అప్లికేషన్ ఇవ్వాలని అడగండంటూ న్యాయమూర్తి సూచించారు. సీబీఐ రిప్లై ఇవ్వకపోవడంపై వాదనలు వినిపిస్తామని కవిత తరఫు న్యాయవాది చెప్పగా, తదుపరి విచారణ ఈనెల 26కు వాయిదా వేసింది కోర్టు.
మరోవైపు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. జైల్లో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకునేందుకు సమయం పెంచాలంటూ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం వారంలో రెండుగా ఉన్న లీగల్ మీటింగ్‌ను ఐదుకి పెంచాచాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రిగా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వారానికి ఐదు సార్లు లాయర్‌ను కలిసేందుకు ఛాన్స్ ఇవ్వాలని పిటిషన్‌లో విన్నవించుకున్నారు. అయితే, ఈ పిటిషన్‌ను కొట్టివేసింది రౌస్ అవెన్యూ కోర్టు.
ఇటు, సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని స్పెషల్ మెన్షన్ చేశారు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ. దీనిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మెయిల్ చేయాలని సూచించారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. మరోవైపు, కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా లిక్కర్ కేసులో అడ్డంగా బుక్కయిన కవిత, కేజ్రీవాల్‌కు కాలం కలిసి రావడం లేదు. కోర్టుల్లోనూ నిరాశే ఎదురవుతోంది.