PM Narendra Modi: కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడారు. దేశంలో మోదీ వేవ్ ఉన్నదని తెలిపారు. తెలంగాణలోనూ ఈ ఎఫెక్ట్ కనిపిస్తున్నదని చెప్పారు. అదే సమయంలో బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నదనీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో నరేంద్ర మోదీ మాటలు వింటే ఆయనకు ఓటమి భయం పట్టుకుందని అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అందుకే ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని కూల్చేస్తారని అంటున్నారని, అంత ధైర్యం ఎవరికైనా ఉన్నదా? అని ప్రశ్నించారు.
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని వినోద్ కుమార్ అన్నారు. ఇది నిజం, కావాలంటే కరీంనగర్ వచ్చి అడగండని చెప్పారు. 2019లో పొన్నం ప్రభాకర్‌కు డిపాజిట్ కూడా దక్కలేదని వివరించారు. ఈ సారి కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ పరిస్థితీ అంతేనని, డిపాజిట్ రాదని జోస్యం చెప్పారు. కరీంనగర్‌లోని కాంగ్రెస్ పార్టీ నాయకులే బీజేపీకి ఓటేయాలని చెప్పారని, తన దగ్గర ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని వివరించారు.
Also Read: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని అరెస్టు చేయాలి.. డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు
రైతులు పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. పది రోజుల్లో రోహిణి కార్తె వస్తున్నదని, జూన్‌లో వర్షాలు ఉన్నాయని వివరించారు. కాబట్టి, పంటకు పెట్టుబడిగా అందేలా రైతు భరోసా అందించాలని అన్నారు.