– పదేళ్లలో జరిగిన తప్పులకు కేసీఆర్‌దే బాధ్యత
– మాజీ బాస్‌పై కడియం సీరియస్ కామెంట్స్
Kadiyam Srihari comments on KCR(Telangana politics): బీఆర్ఎస్ పార్టీ వదిలి కూతురు కడియం కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి తొలిసారిగా మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నాయకులను తూర్పారపట్టారు. కేసీఆర్ పదేళ్లపాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలకు ఆయనే బాధ్యత వహించాలని, ప్రజలకు ఆయనే జవాబుదారి అని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేశారని కడియం మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ కామన్ అని అన్నారని గుర్తు చేశారు. కానీ, ఆయన అధికారులను బలి చేశారని పేర్కొన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన వారిని అందులో ఇరికించారని చెప్పారు. కేసీఆర్ ప్రమేయం లేకుండానే వాళ్లు ఫోన్లు ట్యాప్ చేశారా? అని అడిగారు. డొంక తిరుగుడు మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు. కాళేశ్వరం బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడానికి కేసీఆర్ బాధ్యత వహించాల్సిందేనని కడియం శ్రీహరి అన్నారు. అద్భుతమని ఆయన పొగిడిన ప్రాజెక్టు అంతలోనే పిల్లర్లు కుంగిపోయాయని పేర్కొన్నారు. అది పట్టించుకోకుండా నీళ్లు వదలాలని అసంబద్ధ వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అక్కడ కుర్చీ వేసుకుని నీళ్లు వదిలితే ఆయన కూడా అందులో కొట్టుకుపోతారని అన్నారు. అందుకే ఇలాంటి తెలివితక్కువ మాటలు మాట్లాడకుంటే బెటర్ అని సూచించారు.
Also Read: Manifesto: కొత్త జారులో పాత చింతకాయ పచ్చడి!
హరీశ్ రావు రాజీనామా ఎపిసోడ్ పైనా కడియం స్పందించారు. అదంతా డ్రామా అని కొట్టిపారేశారు. ఆయన పక్కా డ్రామా మాస్టర్ అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన చేసిన సవాల్‌కు కట్టుబడి ఉన్నారని చెప్పారు. కానీ, హరీశ్ రావు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తన కూతురు ఎస్సీ కాదని మాట్లాడిన వారికి ఈసీ పరోక్షంగా బుద్ధి చెప్పిందని అన్నారు. కడియం కావ్య ఎస్సీ కాబట్టే స్క్రుటినీలో రిటర్నింగ్ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు తెలుపలేదని, బయట మాట్లాడే సన్నాసులు స్క్రుటినీలో ఎందుకు అభ్యంతరాలు చూపలేదని నిలదీశారు. ఎందుకు ఆధారాలు చూపలేదని, నిన్న మొన్నటి వరకు మొరిగిన వాళ్లంతా ఎక్కడకు పోయారని ఫైర్ అయ్యారు. తన తర్వాత 20 ఏళ్లకు పుట్టిన మూర్ఖులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు కడియం శ్రీహరి.