– పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ
– కేసీఆర్ పార్టీది మూడో స్థానమే
– ఒక్క సీటు కూడా రాదు
– వరంగల్ ప్రజలను మోసం చేసింది కేసీఆరే
– నాపై దుష్ప్రచారం తగదు
– మాజీ సీఎంపై కడియం ఆగ్రహం
KCR: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయిలో జరుగుతోంది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీనికి హస్తం శ్రేణులు ధీటుగా బదులిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, కేసీఆర్ రోడ్ షోలో తనను టార్గెట్ చేసి మాట్లాడడంపై ఫైరయ్యారు. వరంగల్, తెలంగాణ ప్రజలను మోసం చేసిందే కేసీఆర్ అని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా పని చేసిన ప్రతి ఒక్కరిపై భూకబ్జా, ఫోన్ ట్యాపింగ్, అవినీతి కేసులు ఉన్నాయని వివరించారు. వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేశారని, కాకతీయులు తమకు ఇచ్చిన వారసత్వాన్ని నాశనం చేశారని మండిపడ్డారు.
‘‘ఒకప్పుడు మాది వరంగల్ అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరు ఏ జిల్లాలో ఉన్నారో చెప్పుకునే పరిస్థితి లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆగం చేసింది కేసీఆరే. మూడు నెలల్లో ఏదో అద్భుతం జరుగుతుందని అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక్క సీటు కూడా గెలవకుండా కేసీఆర్ పార్టీ మూతపడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ. బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. కేసీఆర్ నాపై విమర్శలు చేయడం మానుకొని పార్టీని కాపాడుకునే పని చూసుకోవాలి. లిక్కర్ స్కామ్‌లో కవిత మీద ఆధారాలు ఉన్నాయి కాబట్టే జైల్లో పెట్టారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి కానీ, లిక్కర్‌కు దూరంగా ఉండాలి. కవిత వల్ల కేజ్రీవాల్ ఆగమయ్యారు. కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు సంబంధం లేని వ్యక్తిని తీసుకువచ్చి అభ్యర్థిగా పెట్టారు’’ అని ఫైర్ అయ్యారు.
Also Read: హరీశ్ రావు ఇక నీ దుకాణం బంద్
‘‘ప్రత్యేకంగా నన్ను తిట్టడానికి జీతానికి రాజయ్యను పెట్టుకున్నారు. ఆయన తిట్లు తిడుతున్నాడు, డాన్సులు చేస్తున్నాడు, డప్పులు కొడుతున్నాడు. రాజయ్యకు ఎంపీ టికెట్ ఇస్తే 10 ఓట్లు అన్నా పడేవి. నాకు శత్రువైన రాజయ్యకు టికెట్ ఇస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బతికేది. బీజేపీని గెలిపించేందుకు డమ్మీ అభ్యర్థిని పెట్టారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ కోసం పది సార్లు కేసీఆర్‌ను ప్రాధేయపడ్డాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు, రింగ్ రోడ్డు లేదు. వరంగల్ అంటే కేసీఆర్‌కు కోపం. ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎక్కువగా ఉంటారని భయం’’ అంటూ విమర్శలు గుప్పించారు కడియం శ్రీహరి.