– ఓడే పార్టీ నుంచి పోటీ వద్దనుకున్నాం
– వరంగల్ బరిలో కుమార్తె ఉంటుందని వెల్లడి
-పార్టీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్ రెడ్డి
– నెక్ట్స్ చేరిక.. అంబర్ పేట ఎమ్మెల్యేదే అంటూ వార్తలు
Kadiyam Srihari, Kavya Joined Congress Party Hyderabad: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో చేరికల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటుండగా, మరికొందరు ఇదే బాటలో కొనసాగుతున్నారు. లిక్కర్ కేసులో కవిత అరెస్టు, వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత ఎంపీ టికెట్ ఇచ్చిన అభ్యర్థులు సైతం ‘మాకొద్దు బాబోయ్’ అంటూ ఓ దణ్ణం పెట్టి బీఆర్ఎస్‌ను వీడుతుండటం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఆదివారం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్సీ బి. మోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
పార్టీలో చేరిన అనంతరం కడియం మీడియాతో మాట్లాడారు. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్న తన కుమార్తె కావ్యను ఓడిపోయే పార్టీ తరపున పోటీ చేయించదలచుకోలేదని స్పష్టం చేశారు. వరంగల్ సీటు నుంచి బరిలో దిగాలని ఏఐసీసీ తనకు ఆహ్వానం పంపిన విషయాన్ని ఆయన వెల్లడించారు. వరంగల్ బరిలో తన కుమార్తె కావ్య నిలనుందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్‌లో ఉన్న పదేళ్ల కాలంలో విపక్షంలోనే ఉన్నట్లుగా తన అభిమానులు భావించారని, ఈ పదేళ్ల కాలంలో ఎక్కడా అవినీతి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తాను పార్టీని వీడకముందే విమర్శలు మొదలయ్యాయని, అయితే..తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, పసునూరి దయాకర్ పార్టీ మారినప్పుడు గులాబీ పార్టీ మౌనంగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. తనను విమర్శించే హక్కు వారికి లేదన్నారు. తనను ఆశీర్వదించినట్లే తన కుమార్తెనూ ఆశీర్వదించాలని నేతలను కడియం శ్రీహరి కోరారు. అయితే.. శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య భేటీ అయ్యారు. తామంతా కడియం వెంటే ఉంటామని ఈ సందర్భంగా ఆయన అభిమానులు హామీ ఇచ్చారు.
Read Also: ఫ్రస్ట్రేషన్ పీక్స్, కేటీఆర్‌కు ఏమైంది..?
ఇక.. ఇదే బాటలో హైదరాబాద్ నగరానికి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు పయనించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలోని కార్పొరేటర్లు, తన సన్నిహితులు, ఇతర నేతలతో సమావేశమై తన మనసులో మాటను వెల్లడించటమే గాక ఆయన కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారనే వార్తలు గత రెండు రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన గత నాలుగైదు రోజులుగా పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరయ్యారు. శనివారం రోజున అంబర్ పేట పర్యటన పెట్టుకున్న మాజీ మంత్రి కేటీఆర్, తాజా పరిణామాల వల్ల తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ చేరిక వార్తలను బలపరుస్తూ ఆదివారం కాలేరు వెంకటేశ్ కీసరగుట్టలోని ఓ ఫామ్‌హౌస్‌లో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో తన అభిప్రాయానికి సన్నిహితులు, అభిమానుల ఆమోదం పొంది, ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ చేరటానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.