– గులాబీ గూటి నుంచి చెరో పార్టీలోకి
– వరంగల్ ఎంపీ స్థానం కోసం మాటల తూటాలు
– కడియం కావ్య మతం మారిన గుంటూరు కోడలు
– స్థానికుడినైన నాకు ఓటేయండి: ఆరూరి
– బిడ్డకు తండ్రి కులమే.. కావ్య ఉద్యోగానికి ఎస్సీ రిజర్వేషన్
– సీఎం ఆశీర్వాదంతో జిల్లాను అభివృద్ధి చేస్తాం: కడియం శ్రీహరి
Kadiyam Srihari: వరంగల్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేశ్ బరిలో ఉన్నారు. వీరిద్దరూ బీఆర్ఎస్ నుంచే ఈ పార్టీల్లోకి వెళ్లారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉన్నది. పోటీలో ఉన్న ఆరూరి రమేశ్, కడియం కావ్య, కడియం శ్రీహరిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. మోసం చేశావని ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నారు. గురువారం ఆరూరి రమేశ్ చేసిన సంచలన ఆరోపణలకు కడియం శ్రీహరి విలేకరుల సమావేశంలో శుక్రవారం కౌంటర్ ఇచ్చారు.
కడియం శ్రీహరి తన సొంత సామాజిక వర్గాన్ని ఎదగనివ్వరని, ఎవరు ఎదిగినా తన మంత్రి పదవికి ముప్ప ఏర్పడుతుందని కుట్రలు చేస్తారని ఆరూరి రమేశ్ ఆరోపించారు. తాటికొండ రాజయ్య, తన వంటి నాయకులు కడియం శ్రీహరి కుట్రలకు బలయ్యామని చెప్పారు. కడియం శ్రీహరి తన అవకాశాలకు గండికొట్టారని, మూడోసారి తాను ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి రేసులో ఉండేవాడినని తెలిపారు. తనకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యపైనా విమర్శలు చేశారు. కడియం కావ్యకు గుంటూరుకు చెందిన నజీరుద్దీన్‌ను పెళ్లి చేసుకుందని గుర్తు చేశారు. ఆమె మతం మారిపోయిందని, ఆమె ఇప్పుడు దళితురాలు కాదని పేర్కొన్నారు. అసలు ఆమెకు గుంటూరుకు సంబంధమే లేదని చెప్పారు. ఆమె గుంటూరు కోడలు అని, కాబట్టి, ఆమె గుంటూరు వాస్తవ్యురాలవుతుందని అన్నారు. కాబట్టి, స్థానికుడినైన తనకు ఓటు వేస్తే ఎల్లవేళలా ప్రజల యోగక్షేమాలు చూసుకుంటానని చెప్పారు.
Also Read: మహిళా సంఘాల సభ్యుల ఫోన్లు ట్యాప్
ఈ ఆరోపణలను కడియం శ్రీహరి తాజాగా ఖండించారు. తాను ఎవరికీ వెన్నుపోటు పొడవలేదని, 30 ఏళ్ల తన రాజకీయ జీవితంలో నిజాయితీగా వ్యవహరిస్తున్నానని కడియం అన్నారు. తన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాంట్రాక్టర్ కావాలని, తాను మంత్రిగా ఉన్నప్పుడే ఆరూరి రమేశ్‌ను క్లాస్ వన్ కాంట్రాక్టర్‌ను చేశానని, అప్పుడేమైనా డబ్బులు తీసుకున్నాననా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కూడా ఆరూరికే అవకాశం ఇవ్వాలని తానే అందరిముందు పేర్కొన్నట్టు చెప్పారు.
తన బిడ్డ మతం మారిందనే ఆరోపణపై కడియం తీవ్రంగా మండిపడ్డారు. 2017లో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనంతో వెలువరించిన తీర్పులో వారసులకు తండ్రి కులమే వర్తిస్తుందని చెప్పిందని గుర్తు చేశారు. మతం మారినా కులం మారదని పేర్కొన్నట్టు వివరించారు. కాబట్టి, తన కులమే కడియం కావ్యకు వర్తిస్తుందని, కావ్య పిల్లలకు వారి తండ్రి మతం లేదా కులం వర్తిస్తుందని వివరించారు. ఇక తన బిడ్డ చదువులోనైనా, ఉద్యోగంలోనైనా ఎస్సీ రిజర్వేషన్‌ను ఉపయోగించుకుందని, దళితురాలు కాకుండా ఎలా ఉపయోగించుకోగలుగుతుందని అన్నారు. తన బిడ్డ స్పెషల్ మ్యారేజీ యాక్ట్ కింద పెళ్లి చేసుకుందని, రిజిస్ట్రేషన్ కూడా చేసుకుందని, దీని ప్రకారం ఎవరి మతాన్ని వారు అనుసరించవచ్చునని తెలిపారు. తాను పార్టీ మారేటప్పుడు డబ్బులు తీసుకున్నానని కొందరు ఆరోపిస్తున్నారని, అదంతా పచ్చి అబద్ధం అని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, మరెవరైనా తాను డబ్బు తీసుకున్నా అని చెబితే తక్షణమే అభ్యర్థిత్వాన్ని రద్దు చేసుకుంటామని సవాల్ చేశారు. అదే సందర్భంలో మందకృష్ణ మాదిగపైనా విరుచుకుపడ్డారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, ఎస్సీలకు రిజర్వేషన్ అవకాశాన్ని కల్పించిన రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పిందని, అలాంటి పార్టీకి మందకృష్ణ మద్దతు ఇస్తున్నారని, ఆయనలో మాదిగపట్ల సానుభూతి లేదా? అని నిలదీశారు. మందకృష్ణ కేవలం తననే టార్గెట్ చేయడం వెనుక లక్ష్యమేమిటో తనకు అర్థం కావడం లేదని అన్నారు.
Also Read: రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ఫోన్ ట్యాపింగ్? 25 మంది టీంతో నిఘా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో వరంగల్ జిల్లాను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇక్కడ పోటీ చేస్తున్నట్టు కడియం తెలిపారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం, ఔటర్ రింగ్ రోడ్డు కోసం చాలా కాలం ప్రయత్నించానని చెప్పారు. అది సాధ్యం కాలేదని పేర్కొన్నారు. ఎంపీగా గెలిచి కేంద్రం నుంచీ ఇందుకోసం డబ్బులు తెస్తామని పేర్కొన్నారు.