కాళేశ్వరంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ గురువారం మొదలైంది. ఇరిగేషన్ అధికారులతో జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రత, పిల్లర్ల కుంగుబాటు, ఇతర సమస్యలపై ఆయన అధికారులతో చర్చ జరిపారు. ఈ సమావేశం తర్వాత కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ మీడియాతో మాట్లాడారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ), విజిలెన్స్ రిపోర్ట్, కాగ్ రిపోర్టులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చాలా విషయాలను తెలుసుకున్నామని వివరించారు. రెండో పర్యటనలో మేడిగడ్డను పరిశీలన చేస్తామని చెప్పారు.
నేను స్వతహాగా ఇంజినీర్‌ను కాదు కాబట్టి. అందరి సహాయ సహకారాలు తీసుకుంటానని జస్టిస్ చంద్రఘోష్ అన్నారు. త్వరలోనే ఇంజినీర్లతో భేటీ అవుతామని, ఎన్‌డీఎస్ఏ అధికారులతోనూ సమావేశం అవుతామని వివరించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అందరినీ కలుస్తామని, వివరాలు సేకరిస్తామని తెలిపారు. నిర్మాణ సంస్థలతోపాటు అవసరమైన రాజకీయ నాయకులకు నోటీసులు పంపుతామని పేర్కొన్నారు. అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా పిలిచి కావాల్సిన సమాచారాన్ని తీసుకుంటామని వివరించారు.
Also Read: కాంగ్రెస్ తగ్గేదేలే.. ఉత్తరప్రదేశ్ కంచుకోటలను వదిలేది లేదు
రెండు మూడు రోజుల్లో పేపర్ ప్రకటన ఇచ్చి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తామని తెలిపారు. విచారణలో నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటామని, టెక్నికల్ అంశాలనూ పరిగణనలోకి తీసుకుని విచారిస్తామని జస్టిస్ చంద్రఘోష్ చెప్పారు. తాను ముఖాలను చూసి విచారణ చేయరని, లీగల్ అంశాలే ప్రాతిపదికగా విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. లీగల్ సమస్యలు తలెత్తకుండా ఎంక్వైరీ సాగుతుందని, ఏదైనా ఇబ్బందైతే స్టే వచ్చే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు.
సహకారం అందించడానికి సిద్ధం: మంత్రి ఉత్తమ్
జస్టిస్ చంద్రఘోష్‌కు అపారమైన లీగల్ అనుభవం ఉన్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన కాళేశ్వరంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్‌గా నియామకం కావడం సంతోషంగా ఉన్నదని వివరించారు. జస్టిస్ పినాకి చంద్రఘోషన్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలిపారు. గురువారం నుంచే విచారణ మొదలు పెడతామని ఆయన చెప్పారని వివరించారు. రెండు మూడు రోజుల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు వస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరంపై విచారణలో జస్టిస్ ఘోష్‌కు ఎలాంటి సహాయ సహాకారాలైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.