Congress Party: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గురించి, పార్టీపై ప్రత్యర్థులు చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ వివరణలు ఇస్తున్నారు. గాంధీ కుటుంబం గురించి, దేశం కోసం ఆ కుటుంబం చేసిన త్యాగాలను ఏకరువు పెడుతున్నారు. పార్టీ అధిష్టానమే తనకు శిరోధార్యం అని చెబుతున్నారు. పార్టీ అధిష్టానం సూచనల మేరకు రెండు రోజులపాటు కాంగ్రెస్‌లోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీ మొదలు పెట్టామని ఆయన అన్నారు. రెండు రోజులు దీనికి గడువు అని, ఈ కాలంలో ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటామని వివరించారు.
చాలా మంది నాయకులు తిరిగి వెనక్కి వస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. తమ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పని చేసిన వారిని కూడా వస్తే పార్టీలోకి తీసుకోవాలని అధిష్టానం సూచించిందని, అందుకు తామంతా సుముఖంగానే ఉన్నామని చెప్పారు. ‘నాకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్లు వచ్చి చేరుతామన్నా.. చేర్చుకుంటాం. నా దగ్గర నాకు కూడా ఐదారుగురు వ్యతిరేకంగా పని చేశారు. అప్పుడు వారిని సస్పెండ్ చేశాను. ఒక వేళ మళ్లీ వారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే చేర్చుకుంటాం. సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటే.. నీ అభిప్రాయం ఏమిటని దామోదర రాజనర్సింహ నన్ను అడిగారు. అందుకు నేను ఒకటే సమాధానం చెప్పినా.. వాళ్లు ఎవరైనా సరే అడిగితే జాయిన్ చేసుకోండని చెప్పినా. ఒక వేళ వచ్చే ఎన్నికల్లో టికెట్ అడిగితే ఎలా మరీ? అని కూడా నన్ను అడిగారు. అందుకు మీ ఇష్టం.. ఇచ్చేయండి అని కూడా సమాధానం ఇచ్చాను.’ అని జగ్గా రెడ్డి వివరించారు.
Also Read: పసుపు నీళ్లతో అమరవీరుల స్థూపాన్ని శుద్ధి చేసిన ఎమ్మెల్సీ
అమిత్ షా మైనార్టీ రిజర్వేషన్లను తీసేస్తామని అంటున్నారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. మైనార్టీలు జాగ్రత్తగా ఉండాలని, రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగానూ మైనార్టీలు బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను జాగ్రత్తగా గమనించండని కోరారు. వారంతా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు.