Jaggareddy Fired At BJP For Promoting A Wrong Agenda
Politics

Jaggareddy Fire: బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్,చరిత్ర తెలుసా అంటూ..

– దేవుడి పేరుతో రాజకీయమేంటి?
– బీజేపీకి ఎప్పుడు బుద్ధి వస్తుంది?
– కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోండి
– దేశంలో ప్రాజెక్టులు, వ్యవసాయం కోసం నెహ్రూ ఎంతో చేశారు
– రాహుల్ గాంధీది త్యాగాల కుటుంబం
– ఆయనతో పోల్చుకుంటే మోడీది చిన్న చరిత్ర
– బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్

Jaggareddy fires on BJP party(Today news in telangana): కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ మాదిరిగా దొంగ వాగ్ధానాలు ఇవ్వదని స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ చరిత్ర చిన్నది, రాహుల్ గాంధీ చరిత్ర చాలా గొప్పదని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశానికి భద్రత ఉంటుందన్నారు. నెహ్రూ పుట్టినప్పుడు మోడీ, అమిత్ షా పుట్టి ఉంటే ఆయన గొప్పతనం తెలిసేదని చెప్పారు. శ్రీరాముడు ప్రజలు అన్నాడు తప్ప, కులాలు, మతాల గురించి మాట్లాడలేదని, ఆయన అందరివాడని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లను అడుక్కోవాలని, పదేపదే కాంగ్రెస్‌ని విమర్శించొద్దని హితవు పలికారు. ‘‘కాంగ్రెస్ గొప్పతనం గురించి తెలుసుకోకపోతే మీరు చరిత్ర హీనులవుతారు. చరిత్ర అంటే మహాత్మా గాంధీ, నెహ్రూ, రాహుల్ గాంధీలది. నెహ్రూ, ఇందిరా గాంధీల చరిత్ర గిరించి పాఠ్య పుస్తకాలలో చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరతా. అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి కల్పించారు. దేశానికి పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నవరత్న కంపెనీలు తీసుకొచ్చింది నెహ్రూ కాదా?. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు దీనిపై చర్చకు సిద్ధమా?’’ అని అడిగారు. రైతులు పండించిన పంటను ఆ రోజుల్లోనే 200 దేశాలకు నెహ్రూ సరఫరా చేశారని గుర్తు చేశారు. భారత దేశ ప్రజల కోసం తమ జీవితాలని త్యాగం చేశారని అన్నారు. దేశం కోసం శాంతి యుతంగా, ఎవరూ బలిదానాలు కాకుండా ఉద్యమాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. నెహ్రూ స్వాతంత్రం కోసం చిన్న వయసులోనే జైలు జీవితాన్ని గడిపారన్నారు జగ్గారెడ్డి. 18 ఏండ్లు ప్రధాన మంత్రిగా పనిచేశారని, ఎలక్షన్ కమిషన్‌ను తీసుకొచ్చింది ఆయనే అంటూ వివరించారు. ‘‘ఉక్కు కర్మాగారం, ఐడీపీఎల్, ఎన్టీపీసీ, విద్యుత్ రంగం, బీహెచ్ఈఎల్‌లను తెచ్చారు. బీజేపీ నాయకులు కాదంటారా?. దేశంలో ఆకలి చావులు ఉండొద్దని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేశారు నెహ్రూ. సాగర్, శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టులను కట్టారు. కాంగ్రెస్ ఏం చేసిందని హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు ఓట్ల కోసం శ్రీరాముడ్ని రాజకీయాలలోకి లాగుతున్నారు. రాహుల్ గాంధీది త్యాగాల కుటుంబం’’ అని జగ్గారెడ్డి వివరించారు.