issueing tickets to bc candidates in lok sabha polls : లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ, తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ దాదాపుగా తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఒకటీ రెండు రోజుల్లో ఇక ప్రచారహోరూ పెరగనుంది. మిగిలిన సమయాల్లో బీసీల కోసమే పనిచేస్తున్నామని చెబుతున్న రాజకీయ పార్టీలు ఎన్నికల సీజన్‌లో సీటు దగ్గరికి వచ్చేసరికి సవాలక్ష కొర్రీలు పెడుతున్నాయి. తెలంగాణ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ఈసారి జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మరోమారు అన్యాయం జరిగిందని ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితాలను చూస్తే అర్థమవుతోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలున్నాయి. వీటిలో వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ కాగా, ఆదిలాబాద్, మహబూబాబాద్ సీట్లు ఎస్టీలకు కేటాయించారు. హైదరాబాద్ సీటును మైనారిటీల సీటుగా పరిగణిస్తే, ఇక మిగిలింది 11 సీట్లు. ఈ మిగిలిన 11 సీట్లలో తమకు ఈసారైనా న్యాయమైన వాటా లభిస్తుందని బీసీ నాయకులు కన్న కలలు మరోసారి కల్లలుగానే మిగిలిపోయాయి.
రిజర్వ్ స్థానాలు, హైదరాబాద్ పోనూ మిగిలిన స్థానాల్లో జహీరాబాద్, మెదక్, సికింద్రాబాద్ స్థానాలను కాంగ్రెస్ బీసీలకు కేటాయించింది. తద్వారా లింగాయత్, ముదిరాజ్, మున్నూరుకాపు వర్గాలకు ఒక్కో సీటు దక్కినట్లయింది. మరోవైపు మహబూబ్‌నగర్, నల్లగొండ, భువనగిరి, నిజామాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించింది. ఖమ్మం స్థానమూ అదే వర్గానికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే 11 సీట్లలో 7 సీట్లు రెడ్లకు దక్కినట్లు అవుతుంది. ఇక కరీంనగర్ సీటునైనా బీసీలకు కేటాయిస్తామనే స్పష్టత ఆ పార్టీ నాయకుల నుంచి రావటం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతి పార్లమెంటు సీటు పరిధిలో 2 సీట్లు బీసీలకు కేటాయిస్తామని హామీ ఇచ్చి చివరకు 23 సీట్లతోనే సరిపెట్టిన కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లోనైనా న్యాయం చేస్తుందని ఆ పార్టీలోని బీసీ నేతలు ఎదురు చూస్తున్నారు. ఇక బీఆర్ఎస్ తాను ఎదుర్కొంటున్న కష్టకాలం కారణంగా జహీరాబాద్, చేవెళ్ల, నిజామాబాద్, భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్.. మొత్తం 6 సీట్లను బీసీలకు కేటాయించాల్సి వచ్చింది. మిగిలిన వాటిలో మెదక్, మహబూబ్ నగర్, మల్కాజ్‌గిరి, నల్గొండ స్థానాలను గులాబీ పార్టీ రెడ్లకు కేటాయించగా, ఖమ్మం సీటును కమ్మ సామాజిక వర్గానికి, కరీంనగర్ సీటును వెలమలకు కేటాయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ‘బీసీ సీఎం’ నినాదం ఇచ్చిన బీజేపీ కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్ గిరి, భువనగిరి, జహీరాబాద్ సీట్లను బీసీలకు కేటాయించింది. చేవెళ్ల, హైదరాబాద్, మహబూబ్ నగర్ సీట్లు రెడ్లకు, ఖమ్మం సీటు వెలమ వర్గానికి, హైదరాబాద్ సీటును బ్రాహ్మణ అభ్యర్థికి కేటాయించారు.
ఈసారి ఎన్నికల్లో మహబూబ్ నగర్, నల్గొండ స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులంతా రెడ్డి సామాజిక వర్గం వారే. ఈ సీట్ల పరిధిలో పెద్ద సంఖ్యలో బీసీ ఓట్లున్నప్పటికీ కనీసం ఒక్క పార్టీ కూడా బీసీకి సీటు ఇవ్వలేదు. ముఖ్యంగా మహబూబ్ నగర్‌ను అన్ని పార్టీలూ రెడ్డి సామాజిక వర్గానికి అనఫిషియల్‌గా రిజర్వ్ చేశాయి. నిజానికి ఇది బీసీ స్థానం. ఇక్కడి నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ్ నాలుగుసార్లు గెలవగా, డి. విఠల్ కూడా ఓసారి గెలుపొందారు. ఎస్సీ స్థానమైన నాగర్ కర్నూల్ ఎంపీ పరిధిలోని పరిధిలోని కల్వకుర్తి, గద్వాల సెగ్మెంట్లకు చెందిన వంశీచంద్ రెడ్డి, డీకే అరుణ లోక్‌సభ ఎన్నికల సమయానికి మహబూబ్ నగర్ బరిలో నిలవటం విచిత్రం. గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్‌లో అరుణ బలపరచిన బీజేపీ అభ్యర్థికి 7,558 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ, కల్వకుర్తిలో బీజేపీ తరపున బరిలో నిలిచిన తల్లోజు ఆచారికి 70,448 ఓట్లు వచ్చాయి. అయినా, మహబూబ్ నగర్‌లో డీకే అరుణకే ఎంపీ సీటు వస్తుంది తప్ప ఆచారి వంటివారి పేరును బీజేపీ పట్టించుకోలేదు. అలాగే, అదే గద్వాలలో కాంగ్రెస్ నుంచి 87 వేల ఓట్లు పొంది, 7 వేల ఓట్లతో ఓడిపోయిన సరిత వంటి అభ్యర్థుల పేరునూ కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకోలేదు. అటు నల్గొండలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. నిన్నటివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సైదిరెడ్డిని లాక్కొచ్చి మరీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీకి, స్థానికంగా ఉన్న ఒక్క బీసీ అభ్యర్థి లేకపోయాడు. బహుశా మూడు పార్టీలకూ ఈ స్థానం నుంచి రెండు సార్లు గెలిచిన ధర్మభిక్షం గురించి తెలియదేమో మరి..!
బీసీలకు సీట్ల విషయంలో పార్టీలు అనుసరించే మరో వ్యూహం.. గెలిచే సీటు ఇవ్వకపోవటం. సికింద్రాబాద్‌లో గులాబీ పార్టీ తరపున బలమైన ఇతర వర్గాల నేతలు ముందుకు రాకపోవటంతోనే ఈసారి ఆ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఇబ్రహీంపట్నం సీటును ఆశించిన క్యామ మల్లేష్‌ను పక్కనబెట్టి దానిని మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఇచ్చారు. కానీ, భువనగిరిలో అభ్యర్థులు దొరక్క తిరిగి మల్లేష్‌ను తీసుకొచ్చి బరిలో దింపటం చూస్తున్నాం. ఇక, బీసీలకు అనుకూల స్థానమైన మెదక్ సీటును బీఆర్ఎస్ రెడ్డి వర్గానికి కేటాయించగా, గతంలో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా 2. 79 లక్షల ఓట్లు సాధించి ఓడిన బీసీ నేత గాలి అనిల్ కుమార్‌కు జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సీటివ్వటం విచిత్రం. ఇక హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న యాదవ వర్గపు ఓట్లను చీల్చి, తన మిత్రపక్షమైన ఎంఐఎంకు మేలు చేసేందుకే బీఆర్ఎస్ అక్కడ యాదవ అభ్యర్థికి సీటిచ్చిందనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే గతంలో పార్టీ ఫామ్‌లో ఉన్నప్పుడు నిజామాబాద్, చేవెళ్ల సీట్లను కవిత, రంజిత్ రెడ్డికి కేటాయించిన కేసీఆర్.. కాలం కలిసి రాని కాలంలో ఈ రెండు సీట్లనూ బాజిరెడ్డి గోవర్థన్, కాసాని జ్ఞానేశ్వర్‌కు ఇవ్వటం వెనక మర్మాన్ని బీసీ నేతలు గమనిస్తూనే ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ ఇలాంటి ఉదాహరణలు బోలెడన్ని కనిపిస్తున్నాయి.
తెలంగాణలోని 17 స్థానాలుండగా, భారత రాజ్యాంగం వాటిలో 5 సీట్లను ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేయగా, మరో మూడు సీట్లను పెద్దకులాలు తమకు తాముగా రిజర్వ్ చేసుకున్నాయి. ఆ పార్టీలను నడిపేవారు వారే గనుక సీట్ల కేటాయింపు వారికి చేతిలో పనిగా మారిపోయింది. మరి ఈ పరిస్థితిలో తెలంగాణలోని బీసీలు ఎవరికి ఓటేయాలి? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. తెలంగాణలోని 1.39 కోట్ల బీసీ ఓటర్లంతా ఈ ఎన్నికల్లో తమ నియోజక వర్గంలోని బీసీ అభ్యర్థికే ఓటేస్తే.. రాబోయే రోజుల్లో వారు తమ పార్టీల్లో ప్రభావశీలమైన నేతలుగా ఎదగగలుగుతారు. అప్పుడే ఆయా పార్టీలు సదరు బీసీ నేతలకు సీట్లు ఇవ్వటానికి ముందుకు వస్తాయి. కనుక మే 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీసీలంతా పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులకే ఓటేసి వారిని గెలిపించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే బహుజనులకు రాజ్యాధికారంలో సరైన వాటా దక్కేందుకు మార్గం ఏర్పడుతుంది.
మారేపల్లి లక్ష్మణ్ నేత
(బీసీ రాజ్యాధికార సమితి అధికార ప్రతినిధి)