Iran attack on Israel update(Latest international news today): తమ దేశంపై అర్ధరాత్రి ఇరాన్ జరిపిన డ్రోన్, మిసైల్ దాడుల్లో ఒకే ఒక్కరు తీవ్రంగా గాయపడినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మిసైల్ దాడుల్లో తలకు తీవ్రగాయం కావడం వల్ల ఏడేళ్ల బాలిక విషమపరిస్థితిలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. నెగెవ్ ఎడారిలోని అరద్ ప్రాంతంలో బాలిక నివసిస్తోంది. బాలిక తలకు ఇరాన్ నుంచి దూసుకువచ్చిన మిసైళ్లలోని ఇనుప గుండు తగిలిందా లేక ఇజ్రాయెల్ మిసైల్ రక్షణ వ్యవస్థ వల్ల బాలిక గాయపడిందా అన్నదానిపై కచ్చితమైన సమాచారం లేదు. సర్జరీ చేసిన తరువాత కూడా బాలిక పరిస్థితి కుదుటపడలేదు.
ఇరాన్ ప్రయోగించిన డ్రోన్‌లు, మిసైళ్లన్నింటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ విజయవంతంగా కూల్చివేసింది. దీంతో మిసైళ్లు, డోన్‌లతో ఇజ్రాయెల్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కాగా… సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆ దేశానికి చెందిన 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది.
Also Read:నోబెల్ గ్రహిత కన్నుమూత
ఇక ఇదిలా ఉంటే.. గత శనివారం హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెలీ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్సీ ఏరీస్‌ను ఇరాన్‌కి చెందిన ఐఆర్‌జీసీ దళం హెలీకాప్టర్లతో వెంబడించి తమ ఆధీనంలోకి తీసుకుంది. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 17 మంది భారతీయులే. ఈ క్రమంలో వారిని రక్షించేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆదివారం ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్‌తో మాట్లాడారు. నౌకలోని భారతీయులను విడిచిపెట్టాలని కోరారు. పశ్చిమాసియాలోని ఘర్షణలను నివారించాలని, దౌత్య మార్గాల్లో పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు.