Is This Predatory Party Necessary For Telangana : చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లు 1996 నుండి ప్రారంభమైన తెలంగాణ మలిదశ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేరారు. కానీ, తానొక్కడే పులి నోట్లో తలపెట్టి చావును తప్పించుకొని తెలంగాణ పట్టుకొచ్చినట్లుగా ప్రచారం చేసుకున్నారు. ప్రజలను నమ్మించి, మభ్యపెట్టి 10 సంవత్సరాల పాటు రాష్ట్ర సీఎంగా ఎన్నికై తెలంగాణ వనరులు, భూములు, ఇసుక, గ్రానైటు, ఖనిజ సంపద, నీళ్లు, నిధులు అన్నింటినీ కొల్లగొట్టారు. ఇందులో ఆయన కుటుంబసభ్యులు కేటీఆర్, హరీష్ రావు, జోగినిపల్లి సంతోష్ రావు, కల్వకుంట్ల కవిత ఇంకా వారి దగ్గరి బంధువులు, కొంతమంది కుల బాంధవులు కలిసి రాష్ట్ర వనరులను నిస్సిగ్గుగా, నిర్భయంగా దోచుకొని ప్రజలపై పెత్తనం చేస్తూ దుర్మార్గమైన పాలన కొనసాగించారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు వారి తాబేదారి వర్గం నాయకులు, భాగస్వాములైన కార్పొరేట్ దిగ్గజాలు ఒక్కొక్కరు వేల కోట్ల బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గానీ, కేంద్ర నియంత్రణ సంస్థలైన ఆదాయ పన్నుశాఖ, సీబీఐ, ఈడీ తగిన రీతిలో స్పందించకపోవడం తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇన్నాళ్లూ నేను ఇట్లా కొట్టినట్టు చేస్తా నువ్వు అట్లా ఏడ్చినట్లు చెయ్యి అన్నట్లు బీజేపీ, బీఆర్ఎస్ తీరు నడిచింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించిన కవితను చిట్ట చివరకు నిర్బంధంలోకి తీసుకున్నారు. కల్వకుంట్ల పాలనలో దోపిడీని, అవినీతిని అంచనా వేసినట్లయితే రాష్ట్రంలో లక్ష కోట్లకు తక్కువ కాకుండా ప్రజాధనం దోచుకోబడిందని ఆర్థిక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పేద వర్గాల అభివృద్ధికి ఉపయోగపడే విద్య, వైద్య, ఉపాధిరంగాలను ఉద్దేశపూర్వకంగానే, కక్షతో సర్వనాశనం చేసి ఈ రంగాలను కార్పొరేట్ శక్తులకు గంప గుత్త ఆస్తిగా అప్పగించారు. విద్య, వైద్య రంగాలను దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.రాష్ట్రంలో అన్నిరకాల ఎన్నికలలో (పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలు) పోటీ చేయడానికి ప్రజా నాయకత్వాన్ని అణిచివేశారు.
Read Also : వసూల్ రాజా.. సైలెంట్ దందాలు, బినామీల పేరుతో కోట్లు..!!
ఆ స్థానంలో కాంట్రాక్టర్లు, వ్యాపారులు, భూ ఆక్రమణదారులు, ధనవంతులను ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలోని ఉన్నత పదవులు ఎలాంటి రాజ్యాంగ నిబంధనలను పాటించకుండా ఉన్నత పదవులు, ప్రాజెక్టులు, ప్రైవేటు యూనివర్సిటీలు, షాపింగ్ మాల్స్ ఇలా అన్ని రకాల బడా కాంట్రాక్టు వ్యాపారాలు పంచి పెట్టి వేల కోట్ల రూపాయల ధనవంతులను చేసారు. దీనికి నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కుంభకోణాలు. వీరి పాలన పుణ్యాన ధనవంతులు, దోపిడీదారులు మాత్రమే అన్ని పార్టీలలో టిక్కెట్లు పొందుతున్నారు. పదవులు తీసుకుంటున్నారు. ఇదే దోపిడీదారులు మళ్లీ పేదలకు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుక్కుంటారు. అధికారాన్ని నిలబెట్టుకుంటారు. ఇలాంటి విష పూరిత ఆర్థిక దోపిడీ కుటిల ప్రజా వ్యతిరేక రాజకీయ వ్యవస్థను పెంచి పోషించిన కల్వకుంట్ల కుటుంబం మళ్లీ రాజకీయాల్లో బతికి బట్టకట్టకుండా చూడవలసిన కనీస బాధ్యత అందరిపైనా ఉంది.
కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఔటర్ రింగ్ రోడ్డు, జిల్లా కలెక్టరేట్ ఆఫీసులు, సెక్రటేరియట్, ప్రగతి భవన్, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణం, రంగరాయ సాగరం, మల్లన్న సాగరం, విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోళ్ల అగ్రిమెంట్ల ద్వారా కల్వకుంట్ల కుటుంబ సభ్యులు దగ్గరి బంధువులు కార్పొరేట్ సంస్థల నాయకులు వేలకోట్ల రూపాయలు దండుకున్నట్లు ఇటీవల విడుదల చేసిన శ్వేత పత్రాలు, ఇతర విచారణ నివేదికలు తెలియ చేస్తున్నాయి. చివరికి కేసీఆర్ అవినీతి, అక్రమాలకు సహకరించిన అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు అవినీతిపరులుగా మారి, ఒక్కొక్కరు వందల కోట్ల రూపాయల ఆస్తులు దండుకునేలా పరిస్థితులు కల్పించింది కల్వకుంట్ల పాలనే. ఇలాంటి దుర్మార్గపు అవినీతి, దోపిడీ పార్టీకి ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి గద్దె దించారు.
ఉద్యమంలో కష్టపడి, నష్టపడి దెబ్బలు తిని జైల్లోకి పోయి తెలంగాణ తెచ్చుకున్న ఉద్యమకారులను అవమానపరిచి, కేవలం అవకాశవాదులను, కార్పొరేట్ దోపిడీ నాయకులను, బంధుమిత్రులను చేరదీసి రాష్ట్రాన్ని మరింత దోచుకోవడానికి కేసీఆర్ మార్గం వేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనలో ఏ తప్పు చేయని ఉద్యమకారులను, ప్రశ్నించే గొంతుకలను నిర్బంధాలకు, చిత్రహింసలకు గురిచేసి కోర్టుకు హాజరు పరచకుండానే నెలల తరబడి బెయిల్ రాకుండా అడ్డుకొన్న ఉదంతాలు ఎన్నెన్నో. ప్రతిపక్ష నాయకులు, స్వపక్ష నాయకులు, ఉద్యమకారుల ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి తన రచరికాన్ని కొన్ని దశాబ్దాల పాటు కొనసాగించాలని కుట్ర పన్నారు కేసీఆర్. ప్రజలారా ఇప్పటికైనా కల్వకుంట్ల కుటుంబానికి వారి ఏజెంట్లకు కీలెరిగి వాత పెట్టండి. ఎన్నికల్లో డిపాజిట్లు దక్కకుండా అడ్రస్ లేకుండా చేయండి.
Read Also : అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తోంది..!
మే 13న జరగబోయే లోక్ సభ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేయమని ప్రజలను మళ్లీ రోడ్ షోల ద్వారా కల్లబొల్లి కథలు, టక్కుటమార విద్యలతో ప్రజలను మరోసారి మభ్యపెట్టి ఓట్లను దండుకొని తిరిగి తమ కుటుంబ సభ్యులు సంపాదించుకున్న సంపదను కాపాడుకోవడం కోసం అవినీతిపరులు జైలుకుపోకుండా, శిక్ష పడకుండా చేసుకోవడం కొరకే ఇప్పుడు లోక్ సభ ఎన్నికలలో ఓట్లు కొనుగోలు చేసుకోవడానికి ఎంపీలను గెలిపించుకోవడానికి కేసీఆర్ వస్తున్నారనేది గ్రహించండి. బీఆర్ఎస్ ప్రభుత్వం అటు ఢిల్లీలో లేదు ఇక్కడ గల్లీలో లేదు. మరి వారికి ఎందుకు ఓటు వేయాలో ప్రశ్నించండి? గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 119 సీట్లలో బీఆర్ఎస్‌కు 39 సీట్లు ఇవ్వడమే ఒక పొరపాటు జరిగినట్లుగా ఓటు వేసిన ప్రజలు ప్రస్తుతం మదనపడుతున్నారు. అందునా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఓటర్లు మాత్రమే ఈ దోపిడీ పార్టీకి ఎక్కువగా ఓట్లు వేశారు.
గత పది సంవత్సరాల నుండి ఈ పార్టీ ద్వారా గెలిచిన ఎంపీలు లోక్ సభకు పోయి చేసింది ఏమీ లేదు. కల్వకుంట్ల కుటుంబ ఊడిగం మాత్రమే చేసిండ్రు. పది సంవత్సరాల పాటు కేంద్రం నుండి ఒక చిల్లి గవ్వ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు మళ్లీ ఇదే పార్టీ నిలబెట్టిన లోక్ సభ సభ్యులను గెలిపిస్తే వారు చేసే పని ఏంటో ప్రజలకు చెప్పాలి. కేవలం దోపిడీ నాయకులకు రక్షణ కల్పించడానికి జైలుకుపోయిన వారిని విడిపించడానికి బీఆర్ఎస్ ఎంపీలు ఉపయోగపడతారని ప్రజలు గమనించాలి. రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీకి మళ్లీ ఓటు వేస్తే దొంగలకు సద్ది కట్టినట్లుగా ఉంటుంది. మళ్లీ వారికే ఓటు వేస్తే మనకు మనమే ద్రోహం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈసారి దోపిడీ పార్టీకి, దోపిడీ నాయకులకు ఓటు వేయడం ఏమాత్రం సబబు కాదని ఉద్యమకారులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మిక, రైతులు, మహిళలు నినాదం ఇస్తున్నారు.
Read Also : నడుస్తున్న చరిత్ర, వేడెక్కిన తెలుగు రాజకీయం.!
ప్రముఖ ప్రజాకవి కాలోజీ నారాయణరావు చెప్పినట్లుగా అవినీతి, దోపిడీ, అస్తవ్యస్త పాలన, నిరంకుశ కుటుంబ పాలన చేసిన రాజకీయ వ్యవస్థను పాతాళ లోకంలో పాతి పెట్టాల్సిన బాధ్యత ప్రజలదే. ప్రజలు గత పది సంవత్సరాల పాలన పీడకలగా భావించి ఎన్నో కష్టనష్టాలకు ఒత్తిడిలకు నిర్బంధాలను ఓర్చుకొని రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పజెప్పి గత వంద రోజులుగా ప్రస్తుతం ప్రజలు స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తున్నారు. ప్రగతి భవన్ కంచెలను బద్దలు కొట్టడం ప్రజలు హర్షించారు. ప్రభుత్వ కార్యాలయాలు తమ విధులను నిర్వర్తించే పనిలో ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం ప్రారంభించింది. ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడుతున్నది.
చిన్నాభిన్నమైన ప్రభుత్వ వ్యవస్థలు ఇప్పుడిప్పుడే కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నవి. ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ మంత్రులు వారి శాఖల గురించి ప్రజల సమస్యల గురించి స్వతంత్రంగా ప్రజలతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వ అధికార వ్యవస్థ వికీంద్రీకరణ జరుగుతున్నది. సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు తిరుగుతున్నారు. జరిగిన విధ్వంసం అంతా కేవలం 100 రోజులలోనే పునర్నిర్మాణం చేయలేం కదా, అందుకే 5 సంవత్సరాల కాలం కొరకు ఎన్నికైన ఈ రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలి. దానిని భంగ పరచాలన్న రాజకీయ దుష్ట శక్తులకు సరియైన గుణపాఠం చెప్పాల్సిన పౌరులుగా మనకుంది. ఇలాంటి దుష్ట శక్తులు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేసినప్పుడు ప్రజలు అండగా నిలబడి రక్షిస్తారు. మళ్ళీ ఈ దుష్ట శక్తులను, దోపిడీ చేసే, చేస్తున్న పార్టీలను, నాయకులను ఓటు ద్వారా తిరస్కరించాలి.
– రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ (కాకతీయ యూనివర్సిటీ)