Is Politics Appropriate On Loan Waivers: దేశవ్యాప్తంగా 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే అన్ని పార్టీలూ ఒకటీ రెండు స్థానాలకు మినహా తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. కొందరు అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం బాట పట్టగా, క్రమంగా నామినేషన్ల పర్వమూ కొనసాగుతోంది. అన్ని పార్టీలూ తమ మేనిఫెస్టోలను ప్రజల ముందుంచి, వారి మనసు గెలిచే ప్రయత్నం చేయటంలో బిజీగా ఉన్నాయి. ఈ కీలక సమయంలో తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు రైతు రుణమాఫీ హామీ చుట్టూ తిరుగుతున్నాయి. 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించింది. అందులో భాగంగా తాను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కనీసం రూ. 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని హామీని ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టటంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 120 రోజులు దాటుతున్నా ఇంకా రుణమాఫీ చేయలేదంటూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు ఈ లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శల దాడి చేస్తున్నారు. తాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఇప్పటికే రుణమాఫీకి సంబంధించిన కార్యాచరణను ప్రారంభించామని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తాము ఈ ప్రక్రియను అమలు చేయలేకపోతున్నామని కాంగ్రెస్ పార్టీ బదులిచ్చింది. దీనికి కొనసాగింపుగా తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతులెవరూ కంగారు పడాల్సిన పనిలేదని, ఆగస్టు 15లోగా అన్నమాట ప్రకారం రుణమాఫీ చేసి తీరతామని స్పష్టం చేశారు.
రుణమాఫీ మీద విపక్షాల విమర్శలను కాసేపు పక్కనపెడితే, ప్రభుత్వం ఇప్పటికే దీనిపై ముందడుగు వేసింది. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చేసింది. దీనివల్ల ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల తలనొప్పి కూడా ఉండదని సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 30 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా, సగటున దీనికి రూ. 35 వేల కోట్లు అవసరం అవతాయని ఒక అంచనా. రుణమాఫీపై తమ ఆలోచనను ఇప్పటకే రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికీ తీసుకొచ్చారు. రైతులందరికీ ఒకే విడతలో రుణమాఫీ చేయాలని ప్రభుత్వం బ్యాంకులను కోరటం, ఈ రుణమాఫీకి అయ్యే మొత్తాన్ని ఒకేసారి చెల్లించటం సాధ్యం కాదు గనుక నెలవారీ వాయిదాల్లో బ్యాంకులకు చెల్లించేందుకు ప్రభుత్వం ఒక ప్రతిపాదనను బ్యాంకుల ముందుంచటం జరిగాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖల ద్వారా తనకొచ్చే ఆదాయంలో నిర్ణీత మొత్తాన్ని చెల్లించేందుకూ సర్కారు మానసికంగా సిద్ధమైంది.
Also Read: ఏప్రిల్ 18 ప్రపంచ వారసత్వ దినోత్సవం
ఇక రుణమాఫీ సాధ్యాసాధ్యాల విషయానికి వస్తే, ఏ ప్రభుత్వానికైనా రూ. 35 వేల కోట్ల మొత్తాన్ని ఒకేసారి మాఫీ చేయటం అంత సులభం కాదనే విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ, ఆర్థిక శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించి దీనిపై ఒక రూట్‌మ్యాప్‌ను రూపొందించారు. ఈ విషయంలో కేవలం ప్రభుత్వమే ఏకపక్షంగా నిర్ణయాన్ని తీసుకోవటం సాధ్యం కాదు. దీనికోసం ముందుగా బ్యాంకుల అనుమతితో రైతు పేరు మీద ఉన్న రుణాన్ని ముందుగా ప్రభుత్వం పేరుపై మార్చాలి. ఆ తరువాతే ప్రభుత్వం నెలవారీగా కొంత మొత్తాన్ని బ్యాంకులకు జమచేయగలుగుతుంది. ఈ మొత్తం వ్యవహారం పట్టాలెక్కటానికి సహజంగా కనీసం నాలుగు నెలలు పడుతుంది. ఈ వ్యవహారాలన్నీ తెలిసీ, విపక్ష పార్టీల నేతలు దీనిపై యాగీ చేయటాన్ని రాజకీయంగానే చూడాల్సి వస్తోంది. అయితే, ఎన్నికల వేళ రైతు సమస్యను, రాజకీయంతో కలిపి ముడిపెట్టటం మంచి పద్ధతి కాదని సాగురంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ అంశంపై రోజూ విమర్శలకు దిగుతున్న బీఆర్ఎస్ పార్టీ కూడా 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ రూ. 1 లక్ష రైతు రుణమాఫీని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా తొలి విడతలో రూ.25 వేలు లోపు, రెండో విడతలో రూ.50వేల లోపు, మూడో విడతలో రూ.75వేల లోపు, నాల్గో విడతలో లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయనున్నట్లు అప్పట్లో చెప్పారు. కానీ, దాని అమలుకు 2020 డిసెంబరులో శ్రీకారం చుట్టగా, 2023 శాసనసభ ఎన్నికల నాటికి కూడా ఈ ప్రక్రియను పూర్తిగా అమలు చేయలేకపోయింది. దీంతో కొందరు రైతుల మీద వడ్డీ భారం కూడా పడింది. దీనిమూలంగా వారికి మూడేళ్ల పాటు కొత్త రుణాలు లభించక, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడాల్సి వచ్చింది. అలాగే, ఆ ఎన్నికల్లో తాము గెలిచిన వెంటనే రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామనీ నాడు కేసీఆర్ ప్రకటించినా, దానినీ అమలు చేయలేకపోయారు. చివరికి పంటల బీమా పథకాన్ని కూడా విజయవంతంగా రైతులకు అందించలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన 3 సాగు చట్టాలను వెనుకకు తీసుకునే సందర్భంలో మోదీ ప్రభుత్వం కనీస మద్దతు ధరను కల్పించేందుకు హామీ ఇచ్చింది. కానీ, అది జరిగి మూడేళ్లవుతున్నా కేంద్ర ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకోలేకపోయింది. రైతు రుణమాఫీపై నేడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ గతంలో తాము రైతులకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాయి గనుక ఆ రెండు పార్టీలకూ రుణమాఫీ గురించి మాట్టాడే హక్కులేదని రైతు సంఘాలు, అధికార పక్షనేతలూ జవాబిస్తున్నారు.
Also Read:దోపిడీదారులకు ఓటుతో బుద్ధి చెబుదాం..
దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీతో బాటు క్వింటాల్ వరికి రూ. 500 బోనస్ ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ తన జాతీయ మేనిఫెస్టోలోనూ ప్రకటించింది. కిసాన్ న్యాయ్ పేరుతో వచ్చిన ఆ హామీల పత్రంలో కనీస మద్దతు ధరకూ ఆ పార్టీ పూచిపడిన సంగతి తెలిసిందే. కనుక ఈ విషయంలో తమ పార్టీకి జాతీయ స్థాయిలో ఒక విధానం ఉందనీ, విపక్షాల విమర్శలను పట్టించుకోవద్దని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. అటు రైతాంగానికీ ఎన్నికల నియమావళి, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుగనుక నేటికీ వారంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమకిచ్చిన మాటను తప్పక అమలు చేసి తీరుతుందని నమ్ముతున్నారు.
–డాక్టర్ తిరునహరి శేషు (రాజకీయ విశ్లేషకులు కాకతీయ విశ్వవిద్యాలయం)