International Mothers day Anna Maria Jarvis:
సృష్టి కర్త ఓ బ్రహ్మ..అతనిని సృష్టించిందొక అమ్మ అవధులు లేని ప్రేమను పంచేది..కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకునేది..కన్నబిడ్డల కోసం కష్టాలు సహియించేది..వారిని ఉత్నత స్థాయిలో చూడాలని పరితపించేది కేవలం అమ్మ మాత్రమే. విలువైన బహుమతులు ఇచ్చి తీర్చుకునే రుణం కాదు…అమ్మపై ఆప్యాయతానురాగాలను చూపించడం కన్నబిడ్డల కర్తవ్యం. సంవత్సరానికి ఒక్కసారి గుర్తుచేసుకునేది తల్లుల దినోత్సవం కాదు…ఆ ప్రేమ ప్రతి నిత్యం కురిపించడమే అసలైన మదర్స్ డే. ఆ కుటుంబంలో ప్రతి నిత్యం ఉత్సవమే.. ఈ ప్రపంచంలో నిస్వార్థ జీవి ఎవరైనా ఉన్నారా అంటే అది అమ్మ మాత్రమే. ప్రతిఫలం ఆశించకుండా తమ బిడ్డల నడవడిని, మంచి చెడ్డలను తీర్చిదిద్దే మహోపాధ్యాయురాలు అమ్మ. మన తొలి గురువు ఆమే. కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతల పునాదుల మీద నిర్మించిన భారత నాగరికత సమాజంలో తల్లి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. నేడు ప్రపంచ తల్లుల దినోత్సవం.
అన్నా మరియా జార్వీస్ చొరవ
నేటి సమాజంలో తల్లికి ఉన్న ప్రత్యేకత, ఆమె సేవలను గుర్తుచేసుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారం మదర్స్ డేని జరుపుకుంటారు. అమెరికన్ ఆదర్శ మహిళ అన్నా మరియా జార్వీస్ చొరవతో ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే ప్రాచుర్యం వెలుగులోకి వచ్చింది. తన ఆశయం నెరవేరకుండానే చనిపోయిన తన తల్లిని తలుచుకోవడం కోసం ఓ ప్రత్యేక రోజు ఏర్పాటు చేయాలని ఆమె అనుకుంది. తనలాగే ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా తమ కన్నతల్లులను గుర్తుచేసుకోవాలని, వారిపై ప్రేమను చూపించాలని అనుకుంది అన్నా మరియా జార్వీస్. దీంతో తన ఆలోచనకు విస్తృతంగా ప్రాచుర్యం కల్పించే దిశగా ఆమె అడుగులు వేసింది. తన ప్రయత్నంలో భాగంగా మదర్స్ డే’ని అంతర్జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని జార్వీస్ తీవ్రంగా ప్రయత్నించింది. తన ఆలోచనకు మద్దతు కూడగట్టేందుకు చాలామందిని తనతో పాటు నడిపించింది. ఈ కృషి ఫలితంగానే పశ్చిమ వర్జీనియా రాష్ట్రంలో 1910లో తొలిసారి మదర్స్ డే రోజు అధికారిక సెలవుదినాన్ని ప్రకటించారు. మే నెలలో రెండో ఆదివారం: పశ్చిమ వర్జీనియా తర్వాత అమెరికాలోని మిగతా రాష్ట్రాలు కూడా దీనిని అనుసరించాయి. మే8, 1914న అమెరికా కాంగ్రెస్, మే నెలలోని రెండో ఆదివారాన్ని మదర్స్ డే గా ప్రకటిస్తూ ఒక చట్టం చేసింది. ఇదే విషయాన్ని మే9,1914న అప్పటి అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మదర్స్ డే ను అధికారికంగా ప్రకటించారు. యుద్దంలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్ పౌరులకు నివాళులు అర్పించే రోజు గాను ఈ మదర్స్ డేను అక్కడివారు పరిగణిస్తున్నారు.
తల్లుల పేరిట ఓ స్టాంపు:
అమెరికన్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డీ రూజ్ వెల్డ్ 1934లొ ‘మదర్స్ డే’ మీద ఒక స్టాంపు విడుదల చేశారు. 2008సంవత్సరం, మే నెలలో యూఎస్ ప్రతినిధుల సభ మదర్స్ డే స్మారకోత్సవ తీర్మానం కోసం రెండుసార్లు ఓటింగ్ నిర్వహించింది. మొదటి సభలో అమెరికా కాంగ్రెస్ సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. అంతర్జాతీయ తల్లుల ఆలయం: మదర్స్ డే ప్రస్థానం ప్రారంభమైన తొలి వేదిక గ్రాప్టన్స్ చర్చి ప్రస్తుతం ప్రపంచ తల్లుల ఆలయంగా కొనియాడబడుతోంది. అంతేకాదు, జాతీయ చారిత్రక ప్రదేశంగాను ఇది చరిత్రకెక్కింది. మదర్స్ డే వెనుక ఉన్న ఇంత చరిత్ర ఉంది కాబట్టే.. ప్రస్తుతం ప్రతీ దేశంలో ప్రతీ ఇంట్లో ‘మదర్స్ డే’ను ఘనంగా నిర్వహించుకునే సాంప్రదాయం కొనసాగుతోంది.
తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే..
సృష్టిలో అత్యంత నిస్వార్థ జీవి ఎవరైనా ఉన్నారంటే.. అది కచ్చితంగా అమ్మనే. కుటుంబ బంధాల పునాదుల మీదే నిర్మితమైన భారత సమాజంలో తల్లి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ ప్రతిఫలం ఆశించకుండా ఆమె చేసే గొడ్డు చాకిరీని, ఆ ప్రేమామయి పంచే ప్రేమను దేనితోను వెలకట్టలేం. ఒకవిధంగా ప్రకృతి అంత స్వచ్చంగా ఇప్పటికీ ప్రేమను నిలుపుకున్న ప్రేమమూర్తి అమ్మ మాత్రమే. పిల్లలను, భర్తను, మొత్తంగా కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో ఆమె పోషించే పాత్ర పైనే సమాజ విలువలు ఆధారపడి ఉన్నాయి. అయినప్పటికీ ఆమె శ్రమకు తగిన గుర్తింపు మాత్రం ఇప్పటికీ దక్కడం లేదు. అయితే ‘మదర్స్ డే’ రూపంలో ఆ తల్లుల జీవితాలను తలుచుకోవడానికి ఓ రోజంటూ ఏర్పడటం కచ్చితంగా హర్షించదగ్గ విషయం.