– రచ్చకెక్కుతున్న అంతర్గత విభేదాలు
– ధర్మపురి అరవింద్‌ను ఓడించడానికి బీజేపీ రెబల్ నామినేషన్
– పెద్దపల్లిలో నామినేషన్ ర్యాలీలో ఘర్షణలు
కమలంలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. గ్రూపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఒక వర్గానికి మరో వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత కోపాలతో రగులుతున్నాయి. తాజాగా, మన రాష్ట్రంలో బీజేపీలో ఈ విభేదాలు బయటపడ్డాయి.
తెలంగాణలో సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు తన వెంట ఉండి గెలిపించడం కాదు కదా.. ఎదురు నిలబడి కలబడటానికి రెడీ అవుతున్నారు. అరవింద్ నిజామాబాద్ నుంచి బీజేపీ టికెట్ పై లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ వేశారు. అయితే, ఆయన ఓటమే లక్ష్యంగా అదే పార్టీ నుంచి మరో నేత రెబల్ క్యాండిడేట్‌గా నామినేషన్ వేశారు. మీసాల ఫౌండేషన్ చైర్మన్ మీసాల శ్రీనివాస్ బీజేపీ రెబల్ అభ్యర్థిగా నిజామాబాద్‌లో నామినేషన్ వేశారు.
Also Read: Kaleshwaram: అవసరమైతే కేసీఆర్‌కు నోటీసులు!
19వ డివిజన్ కార్పొరేషన సవిత భర్తనే మీసాల శ్రీనివాస్. ఈయన బీజేపీ నాయకుడు. ధర్మపురి అరవింద్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేంద్రంలో మోడీ గెలవాలి గానీ.. నిజామాబాద్‌లో ఈ కేడీ ఓడిపోవాలని అంటున్నారు. ధర్మపురి అవరింద్ ఓటమి కోసమే తాను నామినేషన్ వేసినట్టు వివరించారు. అరవింద్ పసుపు రైతులను మోసం చేశారని ఫైర్ అయ్యారు. తాను బీజేపీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటానని, అరవింద్ ఓటమి కోసం ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. ఇదే రోజు పెద్దపల్లిలో బీజేపీ నేత గోమాస శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలోనూ గ్రూపుల మధ్య ఘర్షణలు జరిగాయి. బీజేపీ టికెట్ పై ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన దుగ్యాల ప్రదీప్ రావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. గోమాస శ్రీనివాస్ నామినేషన్ కోసం పెద్దపల్లి కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ నుంచి ర్యాలీ తీశారు. ఈ సందర్భంలో దుగ్యాల ప్రదీప్ రావు, గుజ్జుల రామకృష్ణా రెడ్డి తమ బలప్రదర్శన చూపించేలా ర్యాలీలు తీశారు. ఈ ర్యాలీలోనే ఇరు వర్గీయుల మధ్య ఘర్షణలు జరిగాయి. పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.