Radhakishan Rao: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన వాంగ్మూలం ద్వారా ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఆశ్చర్యకర విషయాలు బయటకు వచ్చాయి. రాధాకిషన్ రావు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రాధాకిషన్ రావు చెప్పిన కారణాన్ని కోర్టు మన్నించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు చంచల్‌గూడ జైలులో ఉన్నారు. రాధాకిషన్ రావు తల్లి అనారోగ్యం బారినపడింది. కరీంనగర్‌లో ఓ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. గత మూడు రోజులుగా ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నది. ఇదే కారణాన్ని రాధాకిషన్ రావు కోర్టుకు తెలియజేశారు. తన తల్లి అనారోగ్యంగా ఉన్నదని, ఆమె ఆరోగ్యం విషమించిందని చెప్పారు. తన తల్లిని చూడటానికి అనుమతించాలని కోర్టును కోరారు.
Also Read: మొన్న కేసీఆర్‌ను గద్దె దింపాం.. ఇక మోడీ వంతు
రాధాకిషన్ రావు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో గత నెల 10వ తేదీన చేరారు. కోర్టు రాధాకిషన్ రావు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంది. తన తల్లిని చూడటానికి రాధాకిషన్ రావుకు అనుమతి ఇచ్చింది. నాలుగు గంటలపాటు రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆయనకు ఈ అవకాశాన్ని ఇచ్చింది.
రాధాకిషన్ రావు మీడియా కంట పడకుండా.. పోలీసు ఎస్కార్టు వాహనాల్లో రాధాకిషన్ రావును కరీంనగర్ తీసుకెళ్లారు. మళ్లీ సాయంత్రం ఆయనను తిరిగి జైలుకు తీసుకువస్తారు. ఈ ప్రయాణానికి, పోలీసు సిబ్బంది జీతం, భోజన ఖర్చులు అన్నీ రాధాకిషన్ రావే చెల్లించాల్సి ఉంటుందని తెలిసింది.