Indian National Congress Pledges To Reset Economic Policy In Its Manifesto Success Mantra: కేంద్రంలో దశాబ్దకాలంగా విపక్ష పాత్రకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ రానున్న 18వ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఒక దశాబ్దకాలం పాటు కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండటం ఇదే తొలిసారి కాగా, ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ తీవ్రంగానే శ్రమిస్తోంది. ఇప్పటికే పలు పార్టీలను కూటమిలో భాగస్వాములుగా మార్చుకుని కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఇండియా కూటమి వైపు మళ్లించటం ద్వారా 2004 నాటి యూపీయే తరహా మరో విజయానికి వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం కాంగ్రెస్ తన జాతీయ మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘న్యాయ పత్ర’ పేరుతో 5 కీలక అంశాలను ఎంచుకుని, ఆయా వర్గాల వారికి తాము గెలిస్తే ఏమి చేయనున్నామో స్పష్టంగా ప్రకటించింది. రైతు, మహిళ, శ్రామిక, యువ వర్గాలకు న్యాయం చేయటంతో బాటు అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం(హిస్సేదారీ న్యా్య్) అనేవి కాంగ్రెస్ మేనిఫెస్టోలో హైలెట్‌గా నిలిచాయి.
మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు జరిగిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రజలకు ఇచ్చిన హమీలను ‘న్యాయ్ పాత్ర’ పేరుతో కాంగ్రెస్ తన మేనిఫెస్టో ను విడుదల చేసింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇచ్చిన హమీలకు సైతం ఇందులో చోటు కల్పించారు. మొత్తం 25 హమీలు ఎన్నికల చోదకశక్తిగా పని చేస్తాయని పార్టీ విశ్వసిస్తోంది. ఈ హామీలు, ఐదు “న్యాయ స్తంభాల” కింద సమానంగా విభజించబడ్డాయి అవి.. మహిళలు (నారీ), యువత (యువ), రైతులు (కిసాన్), శ్రామిక శక్తి (శ్రామిక్) ఇలా సమాజంలోని అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రణాళికను పార్టీ రూపొందించింది.ఈ మేనిఫెస్టోలోని 5 విభాగాల్లో ఒక్కో దాంట్లో 5 చొప్పున మొత్తం పాతిక హామీలున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న వాస్తవిక గ్రామీణ పరిస్థితిని ప్రాతిపదికగా ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు కనిపిస్తోంది. దేశ జనాభాలో సగంగా ఉన్న మహిళల మనసు గెలిచేందుకు గానూ ఏటా పేద కుటుంబాల మహిళకు రూ. లక్ష ఆసరా అందిస్తామని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సగం మహిళలకే కేటాయిస్తామనీ కాంగ్రెస్ వాగ్దానం చేసింది. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలతో అసంతృప్తితో ఉన్న ఉత్తర, మధ్య, దక్షిణ భారత రైతుల మనసు గెలిచేందుకు దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, నెలలోపే నష్టపోయిన పంటకు బీమా సాయం, వ్యవసాయ పరికరాల మీద జీఎస్టీ రద్దు వంటి హామీలనిచ్చింది. కొవిడ్ సంక్షోభం తర్వాత ఉపాధి కోల్పోయి, కష్టనష్టాల పాలైన యువతే లక్ష్యంగా 30 లక్షల ఉద్యోగాల భర్తీ, స్టార్టప్‌లకు కార్పస్ ఫండ్ ఏర్పాటు, అగ్నివీర్ పథకం రద్దు, ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష ఫీజు రద్దు వంటి వాగ్దానాలను మేనిఫెస్టోలో పొందుపరచారు. కార్మిక సంక్షేమంలో భాగంగా పట్టణ ప్రాంత కూలీలకు రూ.400 రోజువారీ వేతనంతో ఉపాధి హామీ పథకం ప్రకటించారు. ఇక, దేశ వనరులు కొందరి చేతుల్లోనే బందీ కాకుండా వాటిపై దళిత, వెనకబడిన వర్గాల హక్కును పునరుద్ధరిస్తామని, దేశవ్యాప్త కులగణనతో రిజర్వేషన్ల మీద ఉన్న 50 శాతం పరిధిని ఎత్తివేస్తామని, జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పూచీపడింది.
Also Read: పరాకాష్టకు చేరిన పన్ను తీవ్రవాదం..!
కేంద్రం తెచ్చిన సీఏఏ చట్టాన్ని రద్దు చేస్తామని లేదా సవరిస్తామని చెప్పకుండా కాంగ్రెస్ మేనిఫెస్టో మౌనం వహించింది. ఇప్పటికే చాలా మంది దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం, ఆ అంశం కోర్టుల పరిధిలో ఉండడంతో దీని గురించి చర్చించలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా, సీఏఏ గురించి మాట్లాడినా, బీజేపీ దానిని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందనీ, దీనివల్ల హిందూ ఓటర్లు దూరమవుతారనే ఎరుక కాంగ్రెస్ నేతల మాటలను బట్టి అంతర్లీనంగా తెలుస్తోంది. అదేవిధంగా, ఈవీఎంలలో అవకతవకలను నివారించి, పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు పేపర్ బ్యాలెట్ తీసుకురావాలని కూడా కోరుతోంది. ‘ఈవీఎంల సామర్థ్యాన్ని, బ్యాలెట్ పేపర్ పారదర్శకతను కలపడానికి ఎన్నికల చట్టాలను సవరిస్తామని’ మేనిఫెస్టో పేర్కొంది. రాజ్యాంగ వ్యవస్థను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని, ఫెడరలిజం గురించి పట్టించుకోవట్లేదని ఆరోపణలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో తనదైన పరిష్కారాలను సూచించింది. సమాఖ్యవాదం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా, పాండిచ్చేరికి పూర్తి రాష్ట్ర హోదా, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం, లడఖ్‌లోని గిరిజన ప్రాంతాలను చేర్చడానికి రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌ను సవరించడం వంటి వాగ్దానాలు ఇచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పాలనాపరమైన అంశాలను సరి చేయడం, యూనియన్ సెస్, సర్‌చార్జ్‌లను స్థూల పన్ను ఆదాయంలో 5 శాతానికి పరిమితం చేసే కొత్త చట్టాన్ని తెచ్చి ఎన్‌డిఎ ప్రభుత్వపు ద్వంద్వ సెస్ రాజ్‌ను అంతం చేస్తామని మేనిఫెస్టో ప్రజలకు హామీ ఇచ్చింది.
సాక్షి మాలిక్ వంటి అనేక మహిళా అథ్లెట్ల లైంగిక వేధింపులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా వీటి నివారణకు ప్రత్యేక చర్యలు, ప్రస్తుత GST ని సమీక్షించి, వ్యవసాయ ఇన్‌పుట్‌లను మినహాయించటం, ప్రజల గోప్యత హక్కుకు అంతరాయం కలిగించే లేదా పరిమితం చేసే అన్ని చట్టాలను సమీక్షిస్తామంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు (ఫిరాయింపుల నిరోధక చట్టం)ని సవరించడం ద్వారా అనైతిక ఫిరాయింపులకు చెక్ పెడతామని కాంగ్రెస్ మేనిఫెస్టో వాగ్దానం చేసింది. అలాగే, కేంద్రం నిరుడు తెచ్చిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2029 కంటే ముందే అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పూచీ పడింది. మోదీ సర్కారు తెచ్చిన నీతీ ఆయోగ్ స్థానంలో తిరిగి ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరిస్తామని, విద్యలో వైవిధ్యాన్ని బేరీజు వేసేందుకు వైవిధ్య కమీషన్ ఏర్పాటు, న్యాయమూర్తులపై దుష్ప్రవర్తన ఫిర్యాదులను పరిశోధించడానికి, న్యాయ ఫిర్యాదుల కమిషన్, కలహాలతో దెబ్బతిన్న మణిపూర్‌లో సయోధ్య కమిషన్ ఏర్పాటుకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
Also Read:పెన్షన్ల రాజకీయం.. తప్పు ఎవరిది..?
ఈ మేనిఫెస్టోపై రాజకీయ విమర్శల సంగతి పక్కనబెడితే, బీజేపీ చెబుతున్న అభివృద్ధి స్థానంలో.. సంక్షేమ మంత్రాన్ని తన మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాగ్దానం చేసింది. అభివృద్ధి ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. కానీ, అభివృద్ధి పేరుతో వనరులను ఒక వర్గానికి లేదా కొందరు వ్యక్తులకు దక్కనీయమనే సందేశాన్ని ఈ విధానపత్రం ద్వారా కాంగ్రెస్ భరోసా ఇచ్చిందని చెప్పాలి. అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని గాలికొదిలేయబోమనే అంత:సూత్రాన్ని గుదిగుచ్చిన ఈ మేనిఫెస్టో బయటకి చూసేందుకు అంతగొప్పగా కనిపించకపోయినా, దేశపు నిరుపేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు ఒక ఆశారేఖగా మారే అవకాశం మాత్రం కనిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ చేసిన ఈ వాగ్దానాలకు దేశ ప్రజలు ఏ మేరకు ఆమోదముద్ర వేస్తారో తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.
-డాక్టర్ తిరునహరి శేషు (రాజకీయ విశ్లేషకులు) కాకతీయ విశ్వవిద్యాలయం