Income Tax extremism at its peak Stage: ప్రజాస్వామ్యానికి పునాది ప్రజాభిప్రాయం. అందుకే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన పాలించేది ప్రజాస్వామ్యం అన్నారు. ఈ ప్రక్రియ ఎన్నికల ద్వారా జరుగుతుంది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తాము చేసే పనుల ద్వారా, ఎన్నికల సమయంలో ప్రకటించే ప్రణాళికల ద్వారా ప్రజాభిప్రాయాన్ని తమవైపు ఆకర్షిస్తారు. అయితే.. ఈ ఆదర్శాలేవీ పట్టించుకోకుండా గత పదేళ్లుగా కేంద్రంలో పాలన సాగిస్తోన్న పాలకపక్షం ఈ దశాబ్ద కాలంలో ఎన్నికల బాండ్ల మొదలు ఈడీ దాడులు, విపక్ష ప్రజాప్రతినిధుల కొనుగోళ్ల వంటి అనేక కుటిల యత్నాలతో విపక్షాలను నిర్వీర్యం చేస్తూ వచ్చింది. తాజాగా ఆ పార్టీ ఇందుకు పన్నుల వసూళ్ల పేరిట మరో కుటిల యత్నానికి ప్రయత్నం చేసింది.
తమ ఆదాయపు లెక్కలు చెప్పటంతో దొర్లిన పొరబాట్లకు గానూ కాంగ్రెస్ పార్టీకి రూ.3,567 కోట్ల జరిమానా విధిస్తూ దానిని తక్షణం చెల్లించాలని వారం రోజుల నాడు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. మొత్తంమీద కాంగ్రెస్‌కు సంబంధించిన 11 బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. ఇదేంటని అడిగితే.. ఆదాయపు లెక్కలు చూపడంలో కాంగ్రెస్ నెల రోజులు అలస్యం చేసిందంటూనే, 2017-18 నాటి లెక్కలు చూపనందుకు కూడా బ్యాంకు ఖాతాలను జప్తు చేయాల్సివచ్చిందని ఐటీ శాఖ చెప్పుకొచ్చింది. ‘మాది లాభాలను ఆర్జించే కంపెనీ కాదు.. ప్రజాప్రయోజనాలకై పనిచేసే రాజకీయ పార్టీ’ అని కాంగ్రెస్ నేతలు ఎంత మొత్తుకున్నా, ఐటీ శాఖ అధికారులు వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా, ఆదాయపు పన్ను శాఖ అధికారులు కాంగ్రెస్ ఖాతాలున్న బ్యాంకులకు వెళ్లి అక్కడి సిబ్బందిని బెదిరించి కాంగ్రెస్ ఖాతాల నుంచి రూ.135 కోట్లు ఆదాయపు పన్ను శాఖకు బదిలీ చేయించుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. పాలకపక్షం పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని, ఐటీ విభాగాన్ని దుర్వినియోగం చేస్తూ, లోక్‌సభ ఎన్నికల వేళ తమను చీకాకు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆ పార్టీ న్యాయవాది కోర్టులో వాపోయారు. ఈ విషయంలో కోర్టు జోక్యంతో ప్రస్తుతానికి ఈ వ్యవహారంతలో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించింది.
Also Read : పెన్షన్ల రాజకీయం.. తప్పు ఎవరిది..?
ఇదే ఇబ్బంది వామపక్ష పార్టీతో బాటు తృణమూల్ కాంగ్రెస్‌తో సహా పలు ప్రాంతీయ పార్టీలకూ వచ్చింది. 2016-17 సంవత్సరపు పన్ను రిటర్న్ దాఖలు సమయంలో ఒక బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడించని కారణంగా, సీపీఐ(ఎం) పార్టీకి రూ.15.59 కోట్ల జరిమానా, ఆ ఏడాది పన్ను మినహాయింపు రద్దు చేస్తున్నట్లు పేర్కొంటూ ఐటీ శాఖ నోటీసులు పంపింది. ఈ నోటీసులకు స్పందిస్తూ సీపీఐ(ఎం) తాము ఎలాంటి తప్పు చేయలేదని, ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటున్నామని చెప్పినా ఐటీ శాఖ వెనక్కి తగ్గలేదు. సీపీఐకి కూడా ఇలాంటి నోటీసే వచ్చింది. కొన్నేళ్లుగా పన్ను రిటర్నుల దాఖలు సమయంలో పాత పాన్ కార్డు నంబరునే వాడారనీ, దీనిపై తాము ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలంటూ నోటీసు పంపింది. తమ పార్టీకి కూడా 72 గంటల వ్యవధిలో 11 ఐటీ నోటీసులు వచ్చాయని తృణమూల్ కాంగ్రెస్ నేత సాకేత్ గోఖలే తెలిపారు. ఆదాయాన్ని వెల్లడించే విషయంలో నిజంగానే ఈ మూడు పార్టీలు పొరపాట్లు చేశాయనే కాసేపు నమ్మినప్పటికీ, వాటి బ్యాంకు ఖాతాలు జప్తు చేయించడానికి ఐటీ శాఖ ఎన్నుకున్న సమయం మాత్రం.. ప్రభుత్వపు దురుద్దేశాలను స్పష్టంగా వెల్లడిచేస్తోంది. ఎన్నికల వేళ కేవలం 0.7 శాతం లెక్కల విషయంలో ఇంతగా ఐటీ శాఖ యాగీ చేయటం, లెక్కలు సరిగ్గా లేవంటున్న మొత్తం రూ.లక్షల్లో ఉంటే, కోట్లలో జరిమానాలు విధించటం పలు అనుమానాలకు తావిస్తోంది.
‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ పేరుతో వీరంగాలు వేస్తూ వచ్చిన బీజేపీ, తన ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కొంటే ఎవరికీ అభ్యంతరాలుండవు. కానీ, విపక్షమే లేని ప్రజాస్వామ్యాన్ని చూడాలనుకుంటున్న మోదీ గత గత దశాబ్దకాలంలో చేయని ప్రయత్నాలు లేవు. బ్యాంకుల్లో పేదలు, మధ్యతరగతి దాచుకున్న సొమ్ము కాజేసి దేశం దాటి పోయిన వారు వందల్లో ఉండగా, ఈ పదేళ్ల కాలంలో ఒక్కరంటే ఒక్కరి మీద విచారణ జరిపి, రూపాయి రికవరీ చేయలేకపోగా, కేంద్రంలోని పెద్దలు విపక్ష పార్టీల మీదికి ఐటీ శాఖను ఉసిగొల్పటం వెనక గెలుపుపై అనుమానాలున్నాయనే వాదనా వినిపిస్తోంది. జార్ఖండ్ (మాజీ) సీఎం సోరెన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మొదలు అనేక విపక్ష నేతలను టార్గెట్ చేయటం, నిన్నటిదాకా విపక్షాల ముఖమే చూడాల్సిన అవసరం లేదనుకున్న పెద్దన్న.. అతి తక్కువ సమయంలో ఒడిసాలో నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి కూటమితో పొత్తు పెట్టుకోవటం దీనినే సూచిస్తోంది.
Also Read: ప్రభుత్వాన్ని పడగొట్టటం అంత వీజీనా?
ఒకవైపు విపక్ష ప్రభుత్వాలను అక్రమ పద్ధతిలో కూలదోసి, గద్దెనెక్కిన పార్టీ, ప్రశ్నించే పార్టీలను అక్రమమార్గాల్లో అణచివేసి, ప్రజాస్వామ్యాన్ని క్రూరంగా అపహాస్యం చేస్తోంది. తాజాగా ఎన్నికల బాండ్ల విషయంలో ఆ పార్టీ డొల్లతనం బయటపడటంతో ఆ చర్చ జనంలోకి పోకముందే విపక్ష పార్టీలను చీకాకు పెడుతూ పెడబొబ్బలు పెట్టే ప్రయత్నం చేస్తోంది. కీలకమైన లోక్‌సభ ఎన్నికల వేళ విపక్ష పార్టీలను చీకాకు పెట్టటం, నచ్చినట్లుగా జరిమానాలు విధించి ఐటీ శాఖ నోటీసులు పంపటం ‘టాక్స్ టెర్రరరిజం’ అంటే అందులో అతిశయోక్తి కాదేమో.
-నెక్కంటి అంత్రివేది (సామాజిక కార్యకర్త)