– ప్రేమించానన్నాడు.. ఆరేళ్లు వెంటపడ్డాడు
– చివరకు ఓకే చెప్తే పెళ్లికి టైమ్ కావాలన్నాడు
– అందుకూ అంగీకరిస్తే రానురాను లైట్ తీసుకున్నాడు
– కట్నం ఇచ్చే సంబంధాలు వస్తున్నాయంటూ డ్రామాలు చేశాడు
– ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి
– కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ లెటర్
– పరారైన మోసగాడి ఫ్యామిలీ
Love Story: నువ్వంటే నాకిష్టం, నువ్వు లేక నేను లేను, నిన్నే పెళ్లి చేసుకుంటా అంటూ సినిమా కబుర్లు చెప్పాడు. ఆరేళ్లు వెంటపడి వేధించి తర్వాత ఆమెను తన ట్రాక్‌లోకి తెచ్చుకున్నాడు. ఇంకేముంది, టార్గెట్ రీచ్ అయ్యాడు. అమ్మాయి వలలో పడిపోయింది. ఇక పక్కచూపులు మొదలుపెట్టాడు. రూట్ మార్చి వేధించడం మొదలు పెట్టాడు. వేరే యువతికి దగ్గరయ్యాడు. ఇది తట్టుకోలేక సదరు యువతి ఆరు పేజీల సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది. కన్నవారికి శోకం మిగిల్చి వెళ్లిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని న్యూ ఎల్బీ నగర్‌లో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ ఎల్బీ నగర్‌లో బాలబోయిన అఖిల(22) ఓ ప్రైవేట్ ఉద్యోగం చేసేది. అదే ప్రాంతంలో ఉండే ఓరుగంటి అఖిల్ సాయిగౌడ్ ఆమె వెంటపడేవాడు. తన ప్రేమను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడు. ఇలా ఆరేళ్లపాటు ఆమెను పడేయడమే పనిగా పెట్టుకున్నాడు. తర్వాత అఖిల కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ అయింది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అఖిల్‌ను అఖిల గాఢంగా ప్రేమించింది.
పెళ్లికి గ్రీన్ సిగ్నల్
అఖిల్, అఖిల పేర్లు కలిసినట్టుగానే, జీవితంలో కూడా కలిసి మెలిసి ఉంటారని కుటుంబసభ్యులు భావించారు. కానీ, చివరకు విషాదంగా మిగిలింది. ఒక రోజు వీరిద్దరూ మాట్లాడుకోవడం అఖిల తల్లికి తెలిసింది. వెంటనే కుమార్తెను ఆరా తీయగా ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టు చెప్పింది. ముందు ఒప్పుకోకపోయినా, తర్వాత అఖిల తల్లిదండ్రులు వారి బంధువుల సమక్షంలో అఖిల్‌ను ఇంటికి పిలిచి అడిగారు. అతని తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. ఇరు కుటుంబాలు అఖిల్, అఖిల ప్రేమను అంగీకరించాయి. వివాహానికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అయితే, చెల్లి పెళ్లి అయ్యాక తాను మ్యారేజ్ చేసుకుంటానని అఖిల్ చెప్పడంతో అందుకు కూడా ఓకే చెప్పారు.
అఖిల్ తీరులో మార్పు
రోజులు గడుస్తున్న కొద్దీ అఖిల్ తీరులో మార్పు వచ్చింది. అఖిలను చులకన చేయడం మొదలుపెట్టాడు. వేధించడం మొదలుపెట్టారు. అంతేకాదు, మరో అమ్మాయితో చనువు పెంచుకుంటున్నట్టు అఖిలకు తెలిసింది. ఈ పరిణామాలను ఆమె జీర్ణించుకోలేకపోయింది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. నెల రోజులుగా డైరీగా సూసైడ్ లెటర్ రాసింది. ప్రేమించమని వెంటపడ్డాడని, నువ్వే నా ప్రాణమని, నువ్వు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రాధేయపడ్డాడని పేర్కొంది. ఇదంతా నిజమని నమ్మానని, కానీ, అఖిల్ తనను మోసం చేశాడని బాధపడింది. అమ్మానాన్న మాట విని ఉంటే సంతోషంగా ఉండేదానినని, ఐ లవ్ యూ అంటూ లేఖ ముగించి ఆత్మహత్య చేసుకుంది. అఖిల ఆత్మహత్య చేసుకోగానే అఖిల్ ఫ్యామిలీ పారిపోయింది. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
‘స్వేచ్ఛ’తో మాట్లాడిన అఖిల పేరెంట్స్
అఖిల తల్లిదండ్రులను ‘స్వేచ్ఛ’ సంప్రదించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ‘ఎనిమిదేళ్లుగా మా అమ్మాయి వెంటపడి మరీ ప్రేమించాడు. వారిద్దరి ప్రేమ విషయం తెలిసి ముందు వద్దన్నాం. కానీ, మా అమ్మాయి మీద ప్రేమతో అంగీకరించాం. ఇద్దరూ లైఫ్‌లో సెటిలైతే పెళ్లి చేస్తామని చెప్పాం. కానీ, కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోమంటే అఖిల్ అయిష్టంగా ఉన్నాడు. నాకు 70 లక్షల కట్నం ఇచ్చే సంబంధాలు వస్తున్నాయని మా పాపతో అన్నట్టు చెప్పింది. కట్నం అవసరం లేదని చెప్పిన అఖిల్‌కు వాస్తవానికి వరకట్నం ఆశ ఉన్నదని తెలుసుకున్నాం. అయినా మా స్తోమతలో రూ.15 లక్షల వరకు కట్నం ఇవ్వాలని అనుకున్నాం. ఏమైందో కానీ, మా పాప సూసైడ్ చేసుకుంది. గతంలో ఎప్పుడూ డైరీ రాయని అఖిల నెల రోజులుగా రాసింది. డైరీ చదివినప్పుడు మా పాపను అఖిల్ కొట్టాడని తెలిసింది. అఖిలను అల్లారుముద్దుగా పెంచుకున్నాం. వెంటపడి, ప్రేమించాక వదిలేసి ఇప్పుడు మా పాపను మాకు దూరం చేసిన అఖిల్ గౌడ్‌ను కఠినంగా శిక్షించాలి’ అని చెప్పారు.