Bachupally PS: కన్ను పడితే కబ్జా చేయాల్సిందే. ఎవరిది? ఎక్కడ ఉన్నది? అనేది అనవసరం. నచ్చితే నాకు దక్కాల్సిందే అన్న తీరుగా కన్నారావు వ్యవహారం సాగింది. మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారావు ఇలాగే నడుచుకున్నట్టు తెలుస్తున్నది. బాబాయి సీఎంగా దిగిపోగానే ఆయన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇది వరకే కబ్జా, బెదిరింపుల కేసులు ఆయన మీద నమోయ్యాయి. తాజాగా మరో కేసు నమోదైంది.
కల్వకుంట్ల కన్నారావుపై బాచుపల్లి పోలీసు స్టేషన్‌లో తాజాగా మరో కేసు నమోదైంది. నిజాంపేట్‌లో 600 గజాల ఖరీదైన భూమిని ఆయన కబ్జా చేసినట్టు ఫిర్యాదు అందింది. కన్నారావు గ్యాంగ్ 2021లో ఈ అక్రమానికి ఒడిగట్టిందని తెలిసింది. బాచుపల్లి పోలీసులకు బాధితులు ఫిర్యాదు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 2021లో కన్నారావు గ్యాంగ్ 600 గజాల భూమిలో అక్రమంగా చొరబడ్డారని బాధితులు ఆరోపించారు. ఆ తర్వాత తమనే తమ భూమిలోకి రానివ్వలేదని ఫిర్యాదు చేశారు. ఈ భూమి ఖరీదైనదని తెలిపారు. బాధితుడి ఫిర్యాదును బాచుపల్లి పోలీసులు స్వీకరించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read: కబ్జాల కన్నారావు
హైదరాబాద్ శివార్లలోని మన్నెగూడ ల్యాండ్ కబ్జా కేసులో కన్నారావును ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ల్యాండ్ కబ్జా ఆరోపణలతో ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇవ్వగా.. అరెస్ట్ కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా దాన్ని న్యాయస్థానం కొట్టేసింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కన్నారావుపై ఐపీసీ సెక్షన్లు 307, 447, 427, 436, 148, 149 కింద ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
కన్నారావుతో సహా మరో ఐదుగురి మీద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయం కోసం కన్నారావు వద్దకు వెళ్లిన సాప్ట్‌వేర్ ఉద్యోగి విజయ వర్ధన్ రావును నిర్బంధించి కొట్టి 60 లక్షల రూపాయల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నారు. బిందు మాధవి అలియాస్ నందిని చౌదరి అనే మహిళతో కలిసి కన్నారావు ఈ అరాచకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.