– సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
– అప్రూవర్‌గా మారిపోతానని కోర్టుకు వెల్లడి
– మరో లేఖ విడుదల చేసి కేజ్రీవాల్‌పై ఆరోపణలు
– అసలు, ఎవరీ సుఖేష్ చంద్రశేఖర్?
– ఇంతకుముందు ఏం చేశాడు?
– ఆప్ నేతలతో పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి?
If Sukesh Chandrasekhar Becomes An Approver : ఆర్థిక నేరగాడిగా ముద్రపడిన సుఖేష్ చంద్రశేఖర్ వరుస లేఖలతో ఆప్, బీఆర్ఎస్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తాజాగా లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ కేసులో రౌజ్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరైన సుఖేష్, కేజ్రీవాల్, ఆయన అవినీతి భాగస్వాములకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి తాను అప్రూవర్‌గా మారతానని స్పష్టం చేశాడు. వారికి కఠిన శిక్షలు పడేలా ఆధారాలు సమర్పిస్తానని తెలిపాడు. ఇటు, కేజ్రీవాల్‌పై మరో లేఖ విడుదల చేశాడు సుఖేష్. ఎప్పటిలాగే సత్యం గెలుస్తుందని కేజ్రీవాల్ అరెస్టుతో నిరూపితమైందని తెలిపాడు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చూపించడానికి ఈ అరెస్ట్ నిదర్శనమని పేర్కొన్నాడు. ఈనెల 25న తన పుట్టినరోజు అని తెలిపిన సుఖేష్.. కేజ్రీవాల్ అరెస్టుతో రెండు రోజుల ముందు నుంచే సంబరాలు చేసుకుంటున్నట్టు చెప్పాడు.
తీహార్ క్లబ్ పోస్టులు నడపడానికి తన ముగ్గురు సోదరులు ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నట్టు చెప్పాడు. చైర్మన్ బిగ్ బాస్ కేజ్రీవాల్, సీఈవో మనీష్ సిసోడియా, సీఓఓ సత్యేంద్ర జైన్ అంటూ లేఖలో ప్రస్తావించాడు. ‘‘బ్రదర్ కేజ్రీవాల్ మీ అవినీతి అంతా బయటపడుతోంది. మీరు సీఎం హోదాలో పది రకాల స్కాములు చేశారు. ఈ పది స్కాంలలో ఢిల్లీలోని పేదలని లూటీ చేశారు. నాలుగు స్కాములు నేను స్వయంగా చూశాను. సాక్ష్యాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. మీరు చేసిన అవినీతి, అక్రమాలు అన్నీ నేను బహిర్గతం చేస్తాను. కేజ్రీవాల్ మీరు ఇంకెప్పుడు తీహార్ జైలు బయట వెలుతురుని చూడలేరు. మీరు మీ ఇద్దరి సోదరులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఢిల్లీలోని పేద రోగులకు నకిలీ మందులను అందించడం, పేద పిల్లల చదువుల డబ్బును స్వాహా చేయడం, సహజ నీటి వనరులకు సంబంధించిన డబ్బును కూడా దోచుకోవడం, మీరు చేసిన పనులే మీకు తిరిగి కర్మ ఫలితంగా మారుతున్నాయి’’ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు సుఖేష్. గతంలోనూ సుఖేష్ ఇలాంటి లేఖలే విడుదల చేశాడు. లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. బీఆర్ఎస్, బీజేపీ మధ్య వంద కోట్ల ముడుపుల డీల్ నేపథ్యంలో 2020లో కేజ్రీవాల్ తరఫున బీఆర్ఎస్ ఆఫీస్‌లో రూ.75 కోట్లు ఇచ్చినట్టు చెప్పాడు. ఈ ఆపరేషన్‌కు 15 కిలోల నెయ్యి అనే కోడ్ వాడినట్టు పేర్కొన్నాడు. కవిత, కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలోనూ పలు లేఖలు విడుదల చేశాడు సుఖేష్.
Read Also : అలహాబాద్ హైకోర్టు తీర్పు, సంక్షోభంలో మదర్సా పిల్లల చదువు
ఎవరీ సుఖేష్ చంద్రశేఖర్?
బెంగళూరులో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు సుఖేష్. తండ్రి ఓ చిన్న కాంట్రాక్టర్. చదువును మధ్యలోనే వదిలేసిన సుఖేష్, చిన్నప్పటి నుంచే లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని కలలు కనేవాడు. ఆ ఆశతోనే అడ్డదారులు తొక్కాడు. ఈజీ మనీ కోసం పరుగులు తీసి కటకటాల పాలయ్యాడు. తొలిసారి 18 ఏళ్ల వయసులో 2007లో అరెస్ట్ అయ్యాడు. అప్పటి సీఎం కుమారస్వామి కుమారుడి ఫ్రెండ్‌నంటూ రూ.1.5 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. ఓ ప్లాట్ విషయంలో వృద్ధుడి నుంచి ఈ డబ్బు తీసుకున్నాడు. 2009లో నటి లీనా పాల్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే, 2011లో సుఖేష్ మరోసారి అరెస్ట్ అయ్యాడు. అప్పుటి సీఎం యడియూరప్ప కార్యదర్శినంటూ వ్యాపారులకు టోపీ పెట్టాడు. ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ పేరుతో 2వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డాడు. 2012లో ఓ టెక్స్ టైల్ గ్రూప్ ఇతనిపై ఫిర్యాదు చేయడంతో బాగా ఫేమస్ అయ్యాడు. దానికి కారణం బాలీవుడ్ క్వీన్ కత్రినా కూఫ్ పేరును వాడుకోవడమే. ప్రమోషనల్ ఈవెంట్ కోసం కత్రినాను తీసుకొస్తానని రూ.20 లక్షలతో ఉడాయించాడు. 2013లో సుఖేష్‌తో లీనాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
రూ.132 కోట్ల కాంట్రాక్ట్ విషయంలో మోసం చేసిన కేసులో జైలుపాలయ్యారు. అలాగే, 2017లో శశికళ, దినకరన్ నేతృత్వంలోని ఏఐడీఎంకే వర్గానికి రెండు ఆకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్ కు రూ.50 కోట్ల లంచం ఇవ్వడానికి ప్రయత్నించి దొరికిపోయాడు సుఖేష్.అయితే, 2021లో ఫోర్టిస్ హెల్త్ కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ సింగ్ భార్యకు మాయమాటలు చెప్పి రూ.200 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. ఈ కేసుకు సంబంధించే ప్రస్తుతం జైలులో మగ్గుతున్నాడు. ఇదే కేసులో బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్, నోరా ఫతేహి చిక్కుల్లో పడ్డారు. సుఖేష్ నుంచి ఖరీదైన గిఫ్టులు పొంది విచారణను ఎదుర్కొన్నారు. అయితే, జైలులో ఉన్న సమయంలో ఆప్ నేతల నుంచి సుఖేష్‌కు బెదిరింపులు వచ్చాయని గతంలో సంచలన ఆరోపణలు చేశాడు. అప్పటి జైళ్ళశాక మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్ తనను కలవడానికి చాలాసార్లు వచ్చారని, తన రక్షణ కోసం నెలకు రూ.2 కోట్లు డిమాండ్ చేశారని రివీల్ చేశాడు. ఆ తర్వాత లిక్కర్ కేసుకు సంబంధించి కూడా డబ్బులు అందజేసినట్టు లేఖలు విడుదల చేశాడు.