Lok Sabha Elections: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి రెండు దశల్లో 191 స్థానాలకు ఎన్నికలు జరగగా, మూడు, నాలుగో దశల్లో మరో 190 స్థానాలకు మే నెల 7, 13న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నాలుగో దశలోనే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాలలో తెలుగునేల మీద పోలింగ్ ముగిసే మే 13 సాయంత్రానికి 381 సీట్లకు.. అంటే 70 శాతం సీట్లకు ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగునేలపై చైతన్యవంతమైన వర్గాల్లో పలు రకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రసంగాల ధోరణి, ఆ పార్టీ నేతలు చేస్తున్న నినాదాలు ప్రగతిశీల, ఉదారవాద, లౌకిక భావాలను ఇష్టపడేవారిలో కొంత ఆందోళనను కలిగిస్తుండగా, విపక్ష పార్టీల అనైక్యత, ఆ పార్టీల్లోని గందరగోళం, ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు మార్పుకోరుకునే వర్గాలను కలవరపెడుతున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల పనితీరు మరోసారి సార్వత్రిక సమరంలో పునరావృతమవుతుందా లేక ప్రాంతీయ ఆకాంక్షలు, స్థానిక సమస్యలు, సాంస్కృతిక, అస్తిత్వ అంశాలదే పైచేయి అవుతుందా అనే కుతూహలం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు సోషల్ మీడియా ప్రముఖులు చేస్తున్న విశ్లేషణలు, విమర్శలు, వ్యక్తీకరిస్తున్న అభిప్రాయాలు, అంచనాలు.. ఈ కుతూహలాన్ని రోజురోజుకూ పెంచుతున్నాయి.
ఈ ఎన్నికలు జరుగుతున్న తీరును నిశితంగా గమనిస్తే మన ఎన్నికల వ్యవస్థకున్న అనేక పరిమితులు బోధపడతాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఎక్కడా సైద్దాంతిక రాజకీయం అనేది మచ్చుకైనా కనిపించటం లేదు. కులం, మతం, వర్గం అనే అంశాల చుట్టూనే ఈ ఎన్నికల ప్రచారం అంతా సాగుతోంది. దీనికి ఏ పార్టీ కూడా పూర్తిగా అతీతం అని చెప్పలేని పరిస్థితి. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకుల ప్రసంగాలు, వాటిలో వ్యక్తీకరిస్తున్న భావాలు కొందరికి అభ్యంతరకరంగా, మరికొందరికి సత్యవాక్కుల్లా వినిపిస్తున్నాయి. అధికారమే పరమావధిగా సాగుతున్న ఇలాంటి ప్రసంగాల పట్ల ప్రజలకు కొంత నిరాశ, అసహనం కలుగుతున్నప్పటికీ, ‘మనదేశంలో ఎన్నికలు ఇలాగే ఉంటాయి’ అనే సర్దుబాటు ధోరణికీ మన జనం అలవాటైపోతున్నారని అనిపిస్తోంది. ఇదే సమయంలో మన రాజ్యాంగం బలంగా ఉందనీ, ఎంతటి నియంతలైనా దానిని ఏమీ చేయలేరనీ, రాజ్యాంగం ఈ దేశప్రజలకు పూచీ పడిన హక్కులను, భద్రతలను ఏ ప్రభుత్వాధినేతా తొలగించలేడని నమ్మేవారి సంఖ్య కూడా మన సమాజంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంది. అయితే, వీరికి నేటి పాలకుల వ్యూహాలు, ఎత్తుగడలు పూర్తిగా అర్థం కాలేదనీ, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు చరిత్ర మెరుపుల మాయలో పడి క్షేత్రస్ధాయి వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారనే అనుమానమూ వస్తోంది.
Also Read: నోటీసులే రాలేదన్న కేటీఆర్‌కు కాంగ్రెస్ షాక్
‘ఒకడేమో.. దేవుని ప్రతినిధిగా వచ్చి దయ్యమై పీడిస్తాడు. మరొకడు తాను దయ్యాన్నే అని ప్రకటించుకొని మరీ జనం ముందుకొస్తాడు’ అంటూ ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికలు, దానిని తమకు అనుకూలంగా మలచుకునే నేతల గురించి ప్రముఖ అమెరికన్ ముస్లిం నేత, మానవహక్కుల నాయకుడైన మాల్కం ఎక్స్ గతంలో వ్యాఖ్యానించారు. తీవ్రమైన జాతీయవాదాన్ని అమెరికా ముందు చర్చకు పెట్టిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ పడినప్పుడు.. అమెరికాలోని ప్రగతి శీల వాదులు మాల్కం మాటలను పదేపదే గుర్తుచేసుకుని, తమ రెండు పార్టీల వ్యవస్థ బలహీనతకు ఆవేదనను, అసక్తతను వ్యక్తం చేశారు. అయితే, నేటి మన ఎన్నికల ప్రచారం చూస్తే.. మాల్కం మాటలు గుర్తొస్తున్నాయి. ఓటు కోరుతున్న పార్టీలన్నీ ప్రజలకు మేలు కలిగించే కొన్ని అంశాలను తమ మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ, రూపాలు వేరైనా, సారంలో అందరూ ఒకటేననే నిరాశక్తత, కనిపించని భయం నేడు జనం మనసులో ఉన్నాయి. రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పే పార్టీలను రాజ్యాంగాలను భక్షించి తీరుతుందనే ముద్ర ఉన్న పార్టీ జయించి తీరుతుందనే బలమైన అనుమానమూ ఈ ఎన్నికల వేళ చాలామంది మాటల్లో కనిపిస్తోంది.
ప్రపంచ చరిత్రలో ప్రజాస్వామిక దేశాల్లోనూ ఎందరో నియంతృత్వ ధోరణులున్న పాలకులు ప్రజలచేత గొప్ప మెజారిటీతో ఎన్నికయ్యారు. దేశాలు వేరైనా వీరి ధోరణులు, అణచివేత మార్గాల్లో కొన్ని తేడాలున్నా.. తమ దేశానికి పాలకులుగా మారటానికి ఎన్నికలను తమకు అనుకూలంగా వీరు మలచుకున్న విధానాల్లో మాత్రం సారూప్యత ఉంది. తొలిదశలో వీరు దేశంలోని చైతన్యవంతమైన పౌర సమాజాన్ని, ఎంతో శ్రమించి, అది ఏర్పరచిన రాజకీయ విలువలను, అమలు చేసే సంప్రదాయాలను క్రమంగా నిర్వీర్యం చేస్తూ వస్తారు. ఈ ప్రక్రియ ఎంత పకడ్బందీగా జరగుతుందంటే.. ఈ పరిణామం అంతా దానికదే జరిగింది తప్ప అందులో పాలకుల ప్రమేయమే లేదనేంత సహజంగా జరిగిపోతుంది. అదే సమయంలో దీనిని ప్రశ్నించే వారి నోళ్లు మూయించేందుకు సంస్కృతి, మతం, విశ్వాసాలు, భాష, ప్రాంతం వంటి అంశాలను దూకుడుగా జనంలోకి తీసుకుపోయి, దేశంలోని అన్ని ప్రాంతాల్లో తమ అజెండాకు ఒక ఆమోదనీయతను కలిగించగల ఆయా రంగాల ప్రతినిధులను ఈ నియంత పాలకులు తయారుచేస్తారు. చూసేందుకు వీరంతా తమతమ రంగాల్లోని అన్యాయాలను ఎత్తి చూపేవారిగా కనిపించినా, అంతర్గతంగా ఇదంతా నాయకుడి అజెండాలో భాగమే. అంతిమంగా సామాన్యుడికి అర్థంకాని, ఏ తర్కానికీ అందని ఒక భావోద్వేగాన్ని, దూకుడును, అర్థంలేని భయాలను, అపోహలను ఈ వందిమాగధులు సమాజంలో కలిగిస్తారు.
Also Read: బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్టు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
ఈ గందరగోళ పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడటానికి ఒక బలమైన రాజకీయ యోధుడు కావాలనేంతగా ఈ ప్రచారం సాగుతుంది. సరిగ్గా ఈ సమయంలోనే సదరు నాయకుడు అడుగుపెట్టి, ప్రజల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలకు జవాబు చెబుతాడు. అతని సమాధానాలు ప్రజలకు మొదట్లో కాస్త ఊరటగా, తర్వాత కాస్త ధైర్యాన్నిచ్చేవిగా, అంతిమంగా ఆ వ్యక్తి తప్ప దేశాన్ని కాపాడగల వాడెవడూ లేడనే అభిప్రాయం స్థిరపడిపోతుంది. ఇది సాధ్యమయ్యేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలనూ నాయకుడు తన మద్దతుదారుల చేత చేయిస్తాడు. దేశంలో పెరుగుతూ వస్తున్న దిగువ, ఎగువ మధ్యతరగతిని లక్ష్యంగా సాగుతున్న ఈ వ్యూహం వేగంగా అమలయ్యేందుకు ప్రపంచీకరణ పరిణామాలనూ చక్కగా వాడుకుంటారు. తాము చెబుతున్న మార్గంలో నడిచేవారే నిజమైన దేశభక్తులని, మిగిలిన వారంతా దేశద్రోహులనే స్థాయికి ఇది మారేకొద్దీ నాయకుడి ఎజెండా సులభమవుతూ పోతుంది.
ఈ మొత్తం పరిణామంలో కొందరు తెలిసి, మరొకొందరు తెలియకుండానే నిరంకుశ పాలకుడి వ్యూహంలో భాగస్వాములవుతుంటారు. తెలిసి పనిచేసిన వారికి రాజ్యాధికారంలో వాటా, తెలియకుండా ఈ వ్యూహంలో భాగమైన వారికి అసంతృప్తి మిగులుతాయి. సాధారణంగా ఈ రెండో వర్గం మౌనాన్ని ఆశ్రయించటం లేదా తమకు ఆలంబనగా నిలుస్తుందనే ప్రత్యామ్నాయ వర్గంవైపు చేరటమో జరుగుతుంటుంది. మరొకొందరికి ఈ చేదు అనుభవం అవసాన దశలో పుస్తకాలు రాయటానికే ముడిసరుకుగా పనికొస్తుంది. మొత్తంగా.. మనదేశంలో జరుగుతున్న పరిణామాలను కనీస స్థాయిలో అర్థం చేసుకోగల ఏ వ్యక్తికైనా పైన చెప్పుకున్న ఇలాంటి వ్యూహం చాలా చురుగ్గా అమలవుతోందని అంగీకరిస్తున్నారు. అయితే, ఆ వ్యూహం తీవ్రత, విస్తృతి, పరిణామాల విషయంలో వారి అంచనాల్లో మాత్రం తేడాలున్నాయి.
Also Read: తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచిన ఈసీ
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పైన చెప్పుకున్న ధోరణులన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా, ఏదో తెలియని భరోసా, ఇదంతా నిజం కాదేమోననే భావనా ప్రజల్లో బలంగా గూడుకట్టుకునే ఉంది. అయితే, తామే ప్రత్యామ్నాయం అంటున్న విపక్ష కూటమి, కొన్ని ప్రాంతీయ పార్టీల్లో పైన మాట్లాడుకున్న వ్యూహాలకు తగిన విరుగుడు వ్యూహాలున్నప్పటికీ వాటి అమలులో తడబాటు కనిపిస్తోంది. కొన్నిచోట్ల విరుగుడు వ్యూహాలను ఆయా పార్టీలు కావాలనే అమలు చేయటం లేదనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో మిగిలిన 5 దశల పోలింగ్ నాటికైనా ప్రత్యామ్నాయ శక్తులుగా అవతరించాలనుకుంటున్న పార్టీలు ఈ వ్యూహాన్ని జనం ముందు ధైర్యంగా చర్చకు తీసుకురాగలిగితేనే రాబోయే రోజుల్లో ఈ దేశ ప్రజలు నిర్మించుకున్న రాజ్యాంగపరమైన వ్యవస్థలు మనగలుగుతాయి. ఈ విషయంలో చిన్న రాష్ట్రమైన తెలంగాణకు పాలకుడు ఉన్న వ్యక్తి చేస్తున్న శక్తికి మించిన ప్రయత్నంలో కొంతైనా మిగిలిన పార్టీల నేతలు చేయగలిగితే జూన్ 4 మధ్యాహ్నానికి వచ్చే లోక్‌సభ ఫలితాలు దేశానికి కొత్త దారిని చూపగలుగుతాయి.
గోరంట్ల శివరామకృష్ణ
సీనియర్ జర్నలిస్ట్