Chevella: వికారాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి, స్పీకర్ పదవి దక్కిందని సీఎం రేవంత్ రెడ్డి తాండూరులో నిర్వహించిన సభలో అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తీసుకువచ్చారని గుర్తు చేశారు. కానీ, కేసీఆర్ వికారబాద్ ప్రాంతానికి రావాల్సిన గోదావరి జలాలను రద్దు చేసి ఎడారిగా మార్చాడని మండిపడ్డారు. తాండూరు సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు. వికారాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి ప్రియాంక గాంధీ వచ్చారని సీఎం ఈ సందర్భంగా అన్నారు. చేవెళ్లలో రంజిత్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ లోక్ సభ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌ను తీర్చిదిద్దబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ చేసిన అన్యాయం వల్ల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రాలేదని, కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కూడా కేంద్రం ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. కందులకు సరైన మద్దతు ధర రాకపోవడానికి కూడా ఈ రెండు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే కారణం విరుచుకుపడ్డారు.
వికారాబాద్‌కు ఎంఎంటీఎస్ రైలు రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని సీఎం స్పష్టం చేశారు. వికారాబాద్ శాటిలైట్ సిటీ ఆగిపోయిందని అన్నారు. మురికి కూపంగా మారిన మూసీ నది బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం రావాలని తెలిపారు. రైతు బంధు నిధులపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేసిందని రేవంత్ గుర్తు చేశారు. రైతు బంధు నిధులు ఇస్తే అమరవీరుల స్థూపం దగ్గర కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని సవాల్ చేశానని చెప్పారు. 7వ తేదీన రైతు బంధు నిధులు విడుదల చేశానని, మరి కేసీఆర్‌కు ఏమాత్రం సోయి ఉన్నా ముక్కు నేలకు రాయాలని అన్నారు. అనంతగిరి కొండల్లోని పద్మనాభుని సాక్షిగా ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని పునరుద్ఘాటించారు. రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. రైతు రుణం తీర్చుకోకపోతే ఈ ముఖ్యమంత్రి పదవే నిష్ప్రయోజనం అని పేర్కొన్నారు.
Also Read: Phone Tapping: ప్రభాకర్ రావా? హూ ఈజ్ హీ?
సంక్రాంతి పండుగకు వచ్చే గంగిరెద్దులా మోదీ, అమిత్ షాలు తెలంగాణకు రోజూ వస్తున్నారని, కానీ, రాష్ట్రానికి వారు ఇచ్చిందేమీ లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కారిడార్, మెట్రో రైలు, ఐటీ కంపెనీలపై సోనియమ్మ రాష్ట్రానికి హామీ ఇచ్చిందని, కానీ, తెలంగాణకు బీజేపీ ఇచ్చింది, మోదీ తెలంగాణకు తెచ్చింది గాడిద గుడ్డేనని అన్నారు. మతం పిచ్చి రేపి ఘర్షణలు పెట్టి ఓట్లు దండుకోవాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. దేవుడు గుడిలో ఉంటే.. భక్తి గుండెల్లో ఉండాలని, వారే అసలైన హిందువులు అని స్పష్టం చేశారు. దేవుడి పేరు మీద ఓట్లు భిక్షమెత్తుకునేవారు హిందూ ద్రోహి అని మండిపడ్డారు.