Praja Shanti Party: ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఏది మాట్లాడిన వైరల్ కావడం ఒక అంశమైతే.. అందులోనూ ఆయన కాన్ఫిడెన్స్ గురించి జరిగే చర్చ మరో అంశం. ఆయన నమ్మింది అంతే విశ్వాసంగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఏం చేసిన సంచలనంగా మారుతుంటుంది. మరోసారి ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ గురించి చర్చ జరుగుతున్నది. కేఏ పాల్‌కు ఉన్న కాన్ఫిడెన్స్ ఆ నేతకు ఉండి ఉంటేనే వేరే లెవెల్ ఉండేదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
కొంతకాలంగా కేఏ పాల్ రాజకీయ పార్టీ పెట్టి సీరియస్‌గా పని చేస్తున్నారు. వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అచంచల విశ్వాసంతో తాను ఎంపీగా కాబోతున్నానని ప్రకటించారు. వంద రోజుల్లో అభివృద్ధిని ప్రజలకు చూపించాల్సి ఉన్నదని, తన వద్ద సమయం లేదన్నట్టుగా మాట్లాడుతూ రేపటి నుంచే ఎంపీగా పని చేయడానికి ప్లాన్స్ వేసుకుంటున్నానని వివరించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Also Read: పాలనపై ఫోకస్
వైజాగ్‌లో 14 లక్షల ఓట్లు పోలైతే.. అందులో పది లక్షల ఓట్లు తనకే పడ్డాయని కేఏ పాల్ అన్నారు. ఈ నియోజకవర్గంలోని 4 లక్షల క్రైస్తవులు, రెండు లక్షల యువత, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రెండు లక్షలు, బడుగు వర్గాల నుంచి ఒకట్రెండు లక్షల ఓట్లు తనకు వస్తాయని వివరించారు. మొత్తంగా తనకు 9 నుంచి 10 లక్షల ఓట్లు పడతాయని, కాబట్టి, ఎంపీగా తాను గెలవడం తథ్యం అని తెలిపారు. తమ ఇంటర్నల్ సర్వేలో ఇదే తేలిందని, కాబట్టి, ఎంపీగా ఏం పనులు చేయాలనేది ఇప్పుడే ప్లాన్ చేసుకున్నానని వివరించారు. వంద రోజుల్లో అభివృద్ధి చేసి విశాఖ ప్రజలకు చూపించాలని, సెప్టెంబర్ 25న తన జన్మదినం కంటే ముందే తన చేపడుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు షాక్ అవుతారని అన్నారు.
కేఏ పాల్ కామెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. కేఏ పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి ముచ్చటపడుతున్నారు. ఆయన గెలవడం, ఓడిపోవడం పక్కనపెడితే ప్రజలకు సేవ చేయాలనే ఆతృత కూడా ఆయనలో కనిపిస్తున్నదని కామెంట్లు చేస్తున్నారు.