Leopard Shamshabad Airport : ఐదు రోజులుగా అటవీ శాఖ అధికారులను ముప్పతిప్పలు పెట్టి..శంషాబాద్ విమానాశ్రయం పరిధిలో హల్ చల్ చేసిన చిరుత ఎట్టకేలకు గురువారం బోనులో చిక్కింది. దానికి ఎరగా వేసిన మేక పిల్లను తినడానికి శుక్రవారం తెల్లవారు జామున బోను వద్దకు వచ్చిన చిరుత.. బోనులో మేక పిల్లను తినేందుకు ప్రయత్నించగా బోనులో చిక్కింది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు, అటవీశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుతను బోనులో బంధించేందుకు ఫారెస్ట్ సిబ్బంది ఐదు రోజులుగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. బోనులో చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టిన చిరుత.. శుక్రవారం తెల్లవారు జామున 2.15గంటల సమయంలో బోనులో చిక్కిందని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియల్ తెలిపారు. గత నెల 28న తెల్లవారు జామున గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి చిరుత శంషాబాద్ విమానాశ్రయం లోపలికి వచ్చింది. ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్షింగ్ వైర్లకు తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూంలో అలారం మోగింది. విమానాశ్రయ సిబ్బంది చిరుత సంచారాన్ని గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి అటవీశాఖ సిబ్బంది చిరుత కోసం గాలింపు చేస్తున్నారు. ఐదు రోజులుగా శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాతాల్లో తిరుగుతున్న చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. చిరుతను బంధించేందుకు ఐదు బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేశారు. బోనులో చిక్కిన చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. జూ లో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కు తరలించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఆకలేసి దొరికిపోయింది
గత నెల 28న ఆదివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు వెనకున్న గొల్లపల్లి అటవీ ప్రాంతం నుంచి రక్షణ గోడ దూకి చిరుత విమానాశ్రయం ఆవరణలోకి వచ్చింది. అయితే దూకుతున్న సమయంలో ప్రహరీ గోడకు అమర్చిన విద్యుత్ ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగింది. దీంతో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలు పరిశీలించగా అందులో చిరుత కనిపించడం, ఎయిర్ పోర్టు రన్ వేపై తిరుగుతుండటంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు చిరుతను బంధించేందుకు ఐదు బోన్లు, 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు కొన్ని మేకలను వాటి వద్ద ఎరగా వేశారు. కానీ చిరుత మాత్రం పలుసార్లు బోన్ల వద్దకు వచ్చినా మేకలను తినేందుకు లోనికి వెళ్లలేదు. చివరకు తినేందుకు ఏమీ దొరక్కపోవడంతో బోనులోని ఎరలను తినేందుకు వచ్చి చిక్కింది.