- భాగ్యనగరంలో ఎక్కడ చూసినా ఆకాశాన్నంటుతున్న భూముల ధరలు
- రోజురోజుకూ పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం
- ఎన్నికల కోడ్ లోనూ జోరుగా రిజిస్ట్రేషన్లు
- శివార్లలోనూ కోట్లు పలుకుతున్న విల్లాలు
- ఓఆర్ఆర్, మెట్రో రైలు, అండర్ పాస్ దారులు
- ఫ్లై ఓవర్లు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు
- సకల సదుపాయాలు కలిగిన సిటీ
- రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అండగా కాంగ్రెస్ సర్కార్
- ఎన్నికల తర్వాత ఫోకస్ పెంచనున్న కాంగ్రెస్
Hyderabad Real Estate Business Lands Appartments Growth:
ఏ వ్యాపారానికైనా ఓ సీజన్ ఉంటుంది. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కు సంవత్సరంలో దాదాపు అన్ని రోజులూ సీజనే. కరోనాకి ముందు తర్వాత కూడా రియల్ భూమ్ ఎంతమాత్రం తగ్గలేదు. ప్రభుత్వాలు మారినా కూడా ఆ ప్రభావం కూడా కనిపించడంలేదు రియల్ ఎస్టేట్ పై.. రిజిస్టేషన్లు ఎలా జరుగుతున్నాయో నిర్మాణ అనుమతులు కూడా అంతకుమించి జరుగుతున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని సౌకర్యాలు ఒక్క హైదరాబాద్ కే సొంతం. నగరం నాలుగు దిక్కులా రియల్ భూం కొనసాగుతోంది. ఒకప్పుడు ఒడిదుడుకుల్లో ఉన్న రియల్ మార్కెట్ ఇప్పుడు లాభాల దిశగా పరుగులు తీస్తూనే ఉంది. చిన్న, మధ్య, ఎగువ తరగతులు అనే తేడాలేకుండా అన్ని వర్గాలవారికీ అందుబాటులో దొరికడమే ఇందుకు ప్రధాన కారణం. అసలే ఇది ఎన్నికల సమయం ,ఎన్నికల కోడ్ ఉండటంతో జనం వద్ద డబ్బుల చెలామణి కూడా తగ్గిందనే కారణాలు కూడా లేకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారం యథాస్థాయిలో కొనసాగుతోంది.
బంగారు గనులుగా మారుతున్న భూములు
విశ్వనగరం దిశగా పరుగులు తీస్తున్న భాగ్యనగరంలో భూములు బంగారు గనులుగా మారుతున్నాయి. దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ప్రస్తుతం వివిధ కారణాలతో దేశంలోని ప్రధాన నగరాలలో రియల్ ఎస్టేట్ రంగం కొద్దిగా మందగమనంతో ఉన్నప్పటికీ హైదరాబాద్ లో దాని ప్రభావం ఎంత మాత్రం తగ్గకపోగా మరింతగా పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రభావం, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల ప్రభావం రియల్ ఎస్టేట్ పై ఎంత మాత్రం ప్రభావం చూపలేదు. కొత్త అపార్టమెంట్లే కాదు సెకండ్ హ్యాండ్ అపార్టుమెంట్లు కూడా గట్టిగానే ధర పలుకుతున్నాయి.
అంచనాలు రెట్టింపు
హైదరాబాద్ చుట్టూ ఏ ప్రాంతం నుంచి అయినా మరో ప్రాంతానికి కనెక్టివిటీ కల్పించిన ఔటర్ రింగ్ రోడ్డు ఆధారంగా అనేక కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలకు ఏమాత్రం తీసిపోని బహుళ అంతస్తుల భవనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది హైదరాబాద్. చిన్న చిన్న అనుమతులు మినహా మిగతా అన్ని అనుమతులు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సంస్థలు ఇస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ ఆన్‌లైన్‌లో టీఎస్‌బీపాస్ ద్వారా వస్తున్నాయి. గతేడాది ఇచ్చిన అనుమతులకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ ఏడాది ఇప్పటివరకు దరఖాస్తులు వచ్చాయి. గత ఆర్థిక ఏడాదిలో టీఎస్ బీపాస్ ద్వారా 90 వేల దరఖాస్తులు రాగా… ఈ ఏడాది జనవరి నాటికి 70 వేల దరఖాస్తులు వచ్చాయి. మరో 20వేల దరఖాస్తులు కూడా క్లియర్ అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఆటంకం కాని పార్లమెంట్ ఎన్నికలు
ఇప్పటికే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ రెండు నెలలు పూర్తిగా ఎన్నికల కాలం. అయినా రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు అవి ఏమాత్రం అడ్డంకిగా ఉండే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రియాల్టీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. మెట్రో విస్తరణ, ఇండస్ట్రియల్ క్లస్టర్, రీజనల్ రింగ్‌రోడ్, శాటిలైట్ నిర్మాణాలు వంటి వాటిపై చర్యలను వేగవంతం చేస్తోంది. దీంతో రాబోయే కాలంలో పెట్టుబడులకు మరింత అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడితే వాటి విలువ పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశమే లేదని అంటున్నారు. పెట్టుబడులకు ఇదే మంచి సమయమని సూచిస్తున్నారు.
అన్ని ప్రాంతాలకూ రోడ్డు కనెక్టివిటీ
ఇలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికలు ఉన్నా, లేకపోయినా నిర్మాణ రంగం మాత్రం జెట్‌స్పీడ్‌గా దూసుకెళ్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో రోడ్ నెట్‌వర్క్ అన్నిప్రాంతాలకు ఉంది. త్వరలో రెండో దశలో మెట్రో రైల్ విస్తరణ జరగనుంది. వివిధ కారణాలతో హైదరాబాద్ సిటీ విస్తరణతో పాటు రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా దూసుకెళ్తుంది. హైదరాబాద్ వాతావరణం కూడా నగరంలో పెట్టుబడులకు ప్రధానం కారణం. రియాల్టీ రంగంలో ప్రభుత్వ ఆలోచనలు అమలైతే… భవిష్యత్‌లో హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు వస్తాయని రియల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.