- హైదరాబాద్ మధ్యతరగతి వర్గానికి అందుబాటులో అపార్టుమెంట్స్
- నగర శివార్ల వైపు మొగ్గు చూపుతున్న మధ్య ఆదాయ వర్గాలు
- అభివృద్ధి పథంలో మేడ్చెల్ జిల్లా
- మెరుగైన రవాణా వ్యవస్థ తో పెరిగిన డిమాండ్
- మేడ్చల్ పరిధిలో చదరపు అడుగు రూ.3,449
- ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేలకు శ్రీకారం చుట్టిన సర్కారు
- 39 శాతం నుంచి 43 శాతానికి పెరిగిన విక్రయాలు
- రాబోయే రోజుల్లో విక్రయాలు మరింత పెరిగే అవకాశం
Hyderabad Real boom in North direction increase:
మధ్యతరగతి కలల సౌధం ఇల్లు కట్టుకోవడం లేక కొనుక్కోవడం. అయితే ముందుగా తమ తాహతుకు తగ్గట్లుగా ఎక్కడ అందుబాటులో ఉన్నాయి స్థలాలు లేక అపార్టుమెంటులు అని ఆలోచిస్తుంటారు. ప్రస్తుతానికి వేగంగా ప్రగతి సాధిస్తున్న నగరాలలో హైదరాబాద్ ఒకటి. అయితే సిటీకి మధ్యలో ఇళ్లు కొనలేని పరిస్థితి. సెకండ్ హ్యాండ్ ఇళ్లే కోట్లలో పలుకుతున్నాయి. ఇక శివారు ప్రాంతాలలో కొద్దిగా అందుబాటులో ఉన్నాయి. అయితే మధ్యతరగతి వర్గానికి అందుబాటులో ఎక్కువగా గృహ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతం ఉత్తర హైదరాబాద్ గా చెప్పుకోవచ్చు. అల్వాల్, బొల్లారం, తూంకుంట, శామీర్‌పేట దాకా.. బాలానగర్, చింతల్, కుత్బల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ, మేడ్చల్ వరకు.. మరోవైపు గండిమైసమ్మ, గుడ్లపోచంపల్లి, బహుదూర్‌పల్లి, దుండిగల్, ఓఆర్‌ఆర్ దాకా బహుళ అంతస్తుల నివాసాలు, విల్లా ప్రాజెక్ట్‌లు ఎన్నో ఉన్నాయి ఉత్తర హైదరాబాద్ ప్రాంతంలో. సికింద్రాబాద్, కోఠి నుంచి సిటీ బస్సు సౌకర్యం ఉండటంతో ఈ ప్రాంతంలో అపార్ట్ మెంటులు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు గృహ కొనుగోలుదారులు.
అభివృద్ధి పథంలో నగర శివార్లు
సొంతింటి కోసం నగరవాసులు శివార్ల వైపే చూస్తున్నారు. అక్కడైతేనే ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయి. ఉత్తర హైదరాబాద్ ప్రాంతం మేడ్చల్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చదరపు అడుగు సగటు రూ.3,449గా ఉంది. సౌకర్యాలున్న గేటెడ్ కమ్యూనిటీల్లో చదరపు అడుగు ఐదారువేలల్లో చెబుతున్నారు. ఐటీ కారిడార్‌లో చదరపు అడుగు రూ.7-8వేల మధ్య నడుస్తోంది. ప్రధాన నగరంలోనూ ఇదే పరిస్థితి. ఇప్పుడిప్పుడే గృహ నిర్మాణాలు వస్తున్న దక్షిణ హైదరాబాద్‌లోనూ చ.అ. ఆరేడువేలు చెబుతున్నారు. వీటన్నింటితో పోలిస్తే ఉత్తరంలోనే ధరలు అందుకోగలిగే స్థాయిలో ఉన్నాయి.
త్వరలో ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే
ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేలకు సర్కారు శ్రీకారం చుట్టింది. మొదటగా ప్యారడైజ్ కూడలి నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్ వరకు 18.1 కి.మీ. ఎక్స్‌ప్రెస్‌వే పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. వెస్ట్ మారేడుపల్లి, కార్ఖాన, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట, తూంకుంట ప్రాంతాల మీదుగా వెళుతుంది. ఓఆర్‌ఆర్ దగ్గర ఈ ఫ్లైఓవర్ ఎక్కితే అరగంటలో సిటీలో ఉంటారు. సహజంగా ఓఆర్‌ఆర్ చుట్టుపక్కల నివాసాలకు డిమాండ్ పెరుగుతుంది. ఉత్తరాన రియల్ ఎస్టేట్‌కు ఊపు వస్తుందనే ఆశాభావంలో రియల్టర్లు ఉన్నారు.
విక్రయాలు పెరుగుతున్నాయ్..
43 శాతం పెరిగిన విక్రయాలు
ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా క్రయ విక్రయాలు పెరుగుతూ వస్తున్నాయి. సిటీలోని మొత్తం రిజిస్ట్రేషన్లలో ఈ ప్రాంతం వాటా గత ఫిబ్రవరి నుంచి ఈ ఫిబ్రవరి వరకు 39 శాతం నుంచి 43 శాతానికి పెరిగింది. రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందనే అంచనాల్లో పరిశ్రమ వర్గాలు ఉన్నాయి. ఇక్కడ సైతం ఆకాశహార్మ్యాల ప్రాజెక్ట్‌లు మొదలయ్యాయి. రిటైర్మెంట్ హోమ్స్, భిన్న థీమ్‌లతో విల్లాలు వస్తున్నాయి. ఓపెన్ ప్లాట్‌లు సైతం అందుబాటులో ఉన్నాయి.