Hyderabad public Highfigh Houses one crore : భాగ్యనగరంలో డ్రీమ్ హౌస్ ను సొంతం చేసుకునేందుకు జనం తహతహలాడుతున్నారు. అందుకు ఎంత ఖర్చయినా ఫర్వాలేదంటున్నారు. సరైన సదుపాయాలు ఉంటే చాలు కోట్లలో ఖరీదు చేసినా ఫ్లాట్లు సొంతం చేసుకుంటున్నారు. 2024 జవనరి నుంచి మూడు నెలలు తీసుకుంటే ఖరీదైన ఇళ్లు, అపార్టుమెంటులు కొనడానికే జనం మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. ఇళ్ల కొనుగోలులో 40 శాతం ఖరీదైన ఇళ్ళకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తోంది. రూ.50 లక్షల లోపు ఇళ్ల అమ్మకాల శాతం తగ్గింది.
మూడు నెలలలో 86,345 యూనిట్ల విక్రయాలు
జనవరి నుంచి మార్చి మధ్య దేశంలోని ప్రధాన నగరాల్లో 86,345 యూనిట్లు విక్రయమైనట్లు తెలుస్తోంది. రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ధర కలిగిన ఇళ్ల అమ్మకాలు 5 శాతం (28,424 యూనిట్లు) మేర తగ్గాయి. గతేడాది 38 శాతంగా ఉన్న వీటి విక్రయాలు 33 శాతానికి తగ్గాయి. ఇది బలమైన డిమాండ్‌ను సూచిస్తోందని తెలుస్తోంది. దీనిని బట్టి జనం దీర్ఘకాలిక పెట్టుబడులపై సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. . కోటి రూపాయలకు పైగా విలువ కలిగిన ఇళ్ల అమ్మకాలలో దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రాంతంలో జనవరి – మార్చి మధ్య 10,558 యూనిట్లు అమ్ముడయ్యాయి. తర్వాతి స్థానాల్లో ముంబయి (7,401), హైదరాబాద్ (6,112) ఉన్నాయి.
ఇంద్ర భవనాలపై క్రేజ్
అత్యంత విలాసవంతమైన ఇంద్రభవనాల వంటి నివాసాలపై మోజు పెరిగింది. వీటి విక్రయాలు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఊపందుకున్నాయి. అధిక ఆదాయం కల్గిన వ్యక్తులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. రూ.4 కోట్లు అంతకంటే అధిక విలువైన నివాసాలు 2022తో పోలిస్తే 2023లో 75 శాతం పెరిగినట్లు సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. విక్రయించిన ఇళ్లు 7,395 నుంచి 12,935కు చేరాయి.దేశ రాజధాని దిల్లీలో ప్రీమియం నివాసాల అమ్మకాలు ఏకంగా మూడు రెట్లు అధికమయ్యాయి. ఏడు నగరాల్లో అత్యధికంగా ఇక్కడే విలాసవంతమైన ఇళ్లు అమ్ముడుపోయాయి. 2022లో విక్రయించిన ఈ తరహా గృహాల సంఖ్య 1860 కాగా 2023లో 5530.హైదరాబాద్‌లో 2022లో రూ.4కోట్ల పైన విలువైన ఇళ్లు 1240 విక్రయిస్తే.. గతేడాదిలో 2030 అమ్మగలిగారు. ముంబయిలో 3390 యూనిట్ల నుంచి 4190 యూనిట్లకు పెరుగుదల ఉండగా.. పుణెలో 190 నుంచి 450కి ఎగబాకింది.
ఐదు శాతం ఎక్కువే
విలాసవంతమైన నివాసాల అమ్మకాలు బెంగళూరులో గత ఏడాది 310 జరిగాయి. ఇక్కడ విక్రయాలు నిలకడగా ఉన్నాయి. కోల్‌కతాలో 300 నుంచి 310 ఇళ్లకు… అంటే స్వల్పంగా మాత్రమే పెరుగుదల కనిపించింది. చెన్నైలోనూ 150 నుంచి 160 మాత్రమే పెరిగాయి. ఏడు ప్రధాన నగరాల్లోని అన్ని విభాగాల్లో కలిపి 2023లో 3.22 లక్షల ఇళ్లను విక్రయించినట్లు నివేదిక పేర్కొంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 9 శాతం వృద్ధి నమోదైంది. డిమాండ్ ఉండటంతో 2023లో కొత్త ప్రాజెక్టుల్లో 3.13 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. 2022తో పోలిస్తే 6 శాతం ఎక్కువ.