– బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ సీరియస్
– బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం
– సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు
– హారిజన్-రైజ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీపై కేసు
Hyderabad Rain effect..seven persons died due to falldown appartment wall : అకాల వర్షం, కన్‌స్ట్రక్షన్ కంపెనీ నిర్లక్ష్యానికి హైదరాబాద్ బాచుపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడ కూలిపోయింది. రేణుక ఎల్లమ్మ కాలనీలో ఈ ఘటన జరిగింది. దీంతో ఏడుగురు కార్మికులు గోడ కింద చిక్కుకుని మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. మృతులు తిరుపతి (20), శంకర్ (22), రాజు (25), ఖుషి రామ్ యాదవ్ (34), గీత (32), హిమాన్షు(4)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను జేసీబీ సహాయంతో బయటకు తీసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
సీఎం దిగ్భ్రాంతి
కార్మికులు మృతి చెందిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షంతో ఒక్కసారిగా గోడ కూలినట్లు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
కన్‌స్ట్రక్షన్ కంపెనీపై కేసు నమోదు
కన్‌స్ట్రక్షన్ కంపెనీ హారిజన్-రైజ్ నిర్లక్ష్యం వల్లే గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి చెందారని బిల్డర్, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. సంస్థ ఎండీ అరవింద్ రెడ్డిపై బాచుపల్లి పోలీసులు కేసు ఫైల్ చేశారు. నిర్మాణంలో నాణ్యత లోపం, కార్మికుల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.
డీసీపీ కీలక వ్యాఖ్యలు
ఘటనపై బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ‘‘ భవన యజమాని అరవింద్ రెడ్డిపై కేసు నమోదు చేశాం. రిటర్నింగ్ వాల్ నిర్మాణంలో నాణ్యత లోపం ఉంది. వర్షానికి ప్రహరీ గోడ కూలింది. కార్మికుల మీద పడడంతో ఏడుగురు మరణించారు. వారిలో నలుగురు ఒడిశాకు చెందిన వారు కాగా, ముగ్గురు ఛత్తీస్‌గఢ్ వాసులు. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి, ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.