- దొంగ ఓట్లపై ఫోకస్ పెట్టిన ఎన్నికల సంఘం
- ఓటర్ల జాబితా ప్రక్షాళనలో బయటపడ్డ వాస్తవాలు
- తెలంగాణ రాష్ట్రంలో 33 లక్షల దొంగ ఓట్లు తొలగింపు
- హైదరాబాద్ పరిధిలో 5 లక్షల డూప్లికేట్ ఓట్ల గుర్తింపు
- పాతబస్తీలో రికార్డు స్థాయిలో 2 లక్షల దొంగ ఓట్లు
- రెండేళ్లలో తొలగించిన 32.8 లక్లల ఓట్లు
- గత రెండేళ్లలో కొత్తగా నమోదైన ఓటర్లు 60.6 లక్షలు
- ఐదేళ్ల క్రితం చనిపోయిన వారి ఓట్లు సజీవం
- వారి ఫొటో స్థానంలో వేరే వాళ్ల ఫొటో
- తప్పుల తడక ఓటర్ల జాబితాకు ఈసీ ప్రక్షాళన
Hyderabad Fake Votes Remove Process : ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్య విలువలు కాపాడేది..పెంచేది ప్రజల చేతిలో ఉన్న ఏకైక వజ్రాయుధం ఓటు. అంతేకాదు నేతల రాతలు మార్చేదీ.. ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే. అటువంటి ఓట్లతో కొంతమంది నేతలు చెలగాటమాడుతున్నారు. అధికారులపై ఒత్తిడి తెస్తూ.. ఓట్ల జాబితాలను ఇష్టారీతిన మార్చేస్తున్నారు. పది, అయిదు సంవత్సరాల క్రితం మృతి చెందిన వారి పేర్లు కూడా ఓటర్ల లిస్టులో ఉన్నాయి. ఇలాంటి ఏ ఒక్క గ్రామానికో, కాలనీతో పరిమితం కాలేదు. చనిపోయిన వారి పేరుతో ఓటరు జాబితాను పరిశీలించగా.. వారి ఫొటో కాకుండా మరొకరి చిత్రాన్ని మార్ఫింగ్ చేసి పెడుతున్నారు. అందులో ఉన్న వ్యక్తులు ఎవరో కూడా అక్కడి వారికి తెలియడం లేదు. అందుకనే తెలంగాణ ఎన్నికల సంఘం దొంగ ఓట్ల ఏరివేతకు నడుం బిగించింది. ఈ ప్రక్రియలో విస్తుపోయే వాస్తవాలు బయటకొచ్చాయి.
ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 5 లక్షల దొంగ ఓట్లు
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈసీ దొంగ ఓట్లపై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ లోనే ఎక్కువగా దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించింది. దీనితో తెలంగాణలో ఉన్న 33 లక్షల డూప్లికేట్ ఓట్లను తొలిగించింది. ఒక్క హైదరాబాద్ లోనే 5 లక్షల డూప్లికేట్ ఓట్లను తొలగించడం విశేషం. జూబ్లీహిల్స్, చాంద్రాయణగుట్టలో అత్యధికంగా డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు ఈసీ గుర్తించింది. ఇక.. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండేళ్లలో 32.8 లక్షల మంది ఓటర్లను ఈసీ తొలగించింది . మరోవైపు.. గత రెండేళ్లలో దాదాపు 60.6 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. జూబ్లీహిల్స్, చంద్రయాన్‌గుట్ట-61వేలు, ముషీరాబాద్, మలక్ పేట్- నాంపల్లి, బహదూర్‌పూర్‌లో 41వేల డూప్లికేట్ ఓట్లు, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురాలో వరుసగా 59,289 ఓట్లు, 48,296 డూప్లికేట్ ఓట్లు గుర్తించారు.
పాతబస్తీలో రికార్డు స్థాయి బోగస్ ఓట్లు
హైదరాబాద్ పరిధిలోని పాతబస్తీలో బోగస్ ఓట్లు చాలా ఎక్కువ స్థాయిలోనే ఉన్నాయి. హైదరాబాద్ మొత్తం కలిపి 5 లక్షల బోగస్ ఓట్లు తొలగిస్తే అందులో పాత బస్తీ ఓట్లే 2 లక్షల దాకా ఉండటం గమనార్హం. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన చేపట్టినప్పుడు ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. పెద్ద సంఖ్యలో నకిలీ ఓట్లు ఉన్నట్టు తేలింది. హైదరాబాద్ మొత్తం మీద జ్ఞానవంతులు, సంపన్నులు, బడాబడా వ్యాపారులు, ప్రస్తుత ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, తలపండిన రాజకీయ నాయకులు ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 60 వేలకు పైగా డూప్లికేట్ ఓట్లు ఉండడం మరింత విస్తుగొలుపుతోంది. ఇందులో 3,101 మంది మరణించిన ఓటర్లు కాగా 53,012 మంది వివిధ పేర్లతో ఉన్నారు. ఇక, పాతబస్తీ పరిధిలోకి వచ్చే 5 నియోజకవర్గాలలో దొంగ ఓట్లు నమోదు అయ్యాయి. చాంద్రాయణగుట్టలో 59,289 యాకుత్‌పురాలో 48,296 డూప్లికేట్ ఓట్లు నమోదు అయ్యాయి.
7 నియోజకవర్గాలతో 5 ఓల్డ్ సిటీవే
నాంపల్లిలో 41,144 దొంగఓట్లు, బహదూర్ పురా 39,664, మలక్ పేటలో 40,892, ముషీరాబాద్ లో 41,842 దొంగఓట్లు ఉన్నట్టు తేలాయి. దొంగ ఓట్లు తొలగించిన ఓటర్ల జాబితాలోని మొదటి ఏడు నియోజకవర్గాలలో ఐదు పాతబస్తీకి చెందినవి. చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, నాంపల్లి, మలక్‌పేట్, బహదూర్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్‌లలోనే 2.29 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయి. . సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో అత్యధికంగా 6,503 మంది మరణించిన వారి పేరిట ఓట్లుండగా నాంపల్లిలో 5,886, కార్వాన్ లో 4,478 మంది మరణించిన వారి పేరు మీద ఓట్లున్నాయి. చాంద్రాయణగుట్టలో అత్యధికంగా 53,750 మంది ఇళ్లు మారారు. గత ఏడాది జనవరి నుంచి ఐదు లక్షలకు పైగా కొత్త ఓటర్లు హైదరాబాద్ జిల్లాలో నమోదు అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఈ విషయమై మాట్లాడుతూ.. 2023 జనవరి 1 నుంచి 2024 మార్చి 15 వరకు 4,500 మంది అధికారులు ఓటర్ల జాబితాల ప్రక్షాళనలో పాల్గొన్నారని చెప్పారు. “ఇంతకుముందు కొన్ని రాజకీయ పార్టీలు దొంగఓట్ల విషయాన్ని మా దృష్టికి తీసుకువచ్చాయి. ఒక నియోజకవర్గంలో 15,025 మంది చనిపోయిన ఓటర్లు ఉన్నారని ఆరోపించారు. మేము పరిశీలిస్తే చనిపోయిన ఓటర్లు 3,000 మంది మాత్రమే ఉన్నారు, వాటిని జాబితా నుండి తొలగించాం” అని ఆయన చెప్పారు.