– కరీంనగర్ జెడ్పీ సమావేశంలో రచ్చ
– డీఈవో తీరును తప్పుబట్టిన కౌశిక్ రెడ్డి
– కలెక్టర్‌ను అడ్డుకుని నిరసన
– డీఈవోను సస్పెండ్ చేయాలని డిమాండ్
ZP Meeting: కరీంనగర్ జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా కొనసాగింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ సమావేశం జరగాల్సి ఉంది. కానీ, గత ప్రభుత్వ హయాంలో కోరం లేనందున చాలా కాలం తర్వాత ఈ సమావేశం జరిగింది. చైర్ పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరై అనేక అంశాలను లేవనెత్తారు. ఆ తర్వాత డీఈవో తీరును తప్పుబడుతూ నిరసనకు దిగారు. హాల్‌లో కింద కూర్చుని నినాదాలు ఇస్తూ ఆందోళన చేశారు. దీంతో కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయితే, కలెక్టర్‌ను అడ్డుకుని నిరసన చేశారు. పోలీసుల జోక్యంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, జమ్మికుంట, హుజూరాబాద్ హాస్పిటల్స్ గురించి ప్రస్తావించారు. వంద పడకల హుజూరాబాద్ హాస్పిటల్‌లో అద్భుతమైన ఐసీయూను తామే నిర్మించామని, ఇప్పుడు దాన్ని ప్రారంభించాలని కోరారు. కేసీఆర్ కిట్లు పేరు మార్చి అయినా సరే అందించాలని చెప్పారు. జమ్మికుంట హాస్పిటల్ నుంచి డాక్టర్‌ను బదిలీ చేయడంతో ప్రసవాల సంఖ్య సున్నాకు పడిపోయిందని వివరించారు. అలాగే, దళిత బంధుకు సంబంధించి రావాల్సిన నిధులు రాలేవని అన్నారు. తన నియోజకవర్గంలో విద్యా వ్యవస్థపై సమావేశం నిర్వహిస్తే, ఆ సమావేశానికి హాజరుకావొద్దని ఎంఈవోలు, హెడ్‌మాస్టర్లకు డీఈవో జనార్ధన్ ఆదేశాలు జారీ చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. వెంటనే, డీఈవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. స్టేటస్ కో ఉన్నందున తాను సమావేశానికి రాలేకపోయానని కలెక్టర్ వివరించారు. అయినా ఆమెకు అడ్డు తొలగకపోవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.