– ఐదు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం
– ప్రతీ ఒక్కరూ లబ్ది పొందేలా ప్రభుత్వ విధానాలు
– హరిత భవనాలతో ఎంతో మేలు
– ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్
Investments to Telangana: పెట్టుబడిదారులకు, నిర్మాణ సంస్థలు, స్థిరాస్తి రంగానికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో జరిగింది. దీనికి మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఇందులో 70 స్టాల్ల్స్‌తో గ్రీన్ ప్రాపర్టీస్ ప్రదర్శన చేశారు. మూడు రోజులపాటు ఇది జరగనుంది. ఎకో ఫ్రెండ్లీ, హరిత భవనాల నమూనాలను ప్రదర్శించాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షో నిర్వహకులకు అభినందనలు తెలిపారు. 40 శాతం విద్యుత్ నిర్మాణ రంగం ఉపయోగిస్తోందని, కర్భన ఉద్గారాలు సైతం వెళువడుతున్నాయని చెప్పారు.
నిర్మాణ రంగంలో హరిత భవనాలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. హరిత భవనాల గురించి కొనుగోలుదారులకు నిర్మాణ సంస్థలు అవగాహన కల్పించాలని, 2003లోనే ఈ భవనాల నిర్మాణం ప్రారంభమైందని వివరించారు. ప్లాస్టిక్ వినియోగంపై మన్మోహన్ సర్కార్ కఠిన చట్టాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు.
Also Read: నేడే రాష్ట్ర కేబినెట్ భేటీ..! వీటిపైనే చర్చ
రానున్న 4ఏళ్లలో ఐటీ రంగంలో విస్తృత అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెట్టుబడులు తెచ్చేనందుకు కృషి చేస్తున్నామన్న ఆయన, కొత్త పాలిసీలు తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు చెప్పారు. దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ, ప్రజలకు, పెట్టుబడి దారులకు క్లియర్ మెసేజ్ ఇస్తున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం త్వరలోనే రాష్ట్ర అభివృద్ధి కోసం సరికొత్త ప్రణాళికలు చేయబోతున్నట్టు వివరించారు. హైదరాబాద్ కచ్చితంగా గ్లోబల్ సిటీ అని, ఎవరూ ఊహించని విధంగా పెట్టుబడులు, అభివృద్ధి చేస్తామన్నారు. మూసీని గ్లోబల్ లెవల్‌లో డెవలప్ చేయబోతున్నామని చెప్పారు. కుటుంబ పాలనలాగా తమ ప్రభుత్వం ఉండదని స్పష్టం చేశారు.