Welfare Schemes: తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు విపక్షాలు ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచే ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం పోతూపోతూ ఖాళీ ఖజానా ఇచ్చి వెళ్లినప్పటికీ, నాలుగు నెలల నాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండు రోజుల వ్యవధిలోనే తన హామీల అమలు మీద దృష్టి సారించింది. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు వంటి నిర్ణయాలను తక్షణం అమలులోకి తెచ్చిన ప్రభుత్వం రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు కరెంటు, దశల వారీగా రైతుబంధు పథకాలకు నిధులు కేటాయించి ప్రజలకు తానిచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఇంతలోనే లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పెండింగ్‌లో పడినా, పంద్రాగస్టులోపు ఆరునూరైనా రుణమాఫీ చేసి తీరతామని ప్రకటించింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తికావటంతో ఆ దిశగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఉచిత పథకాల ప్రకటన సబబేనా? ఇలా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే రాబోయే భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి, ప్రాధాన్యతా రంగాలకు నిధుల కొరత రాదా? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు బదులివ్వాలంటే ఉచిత పథకాల మౌలిక లక్ష్యం ఏమిటి? ఈ ఉచిత పథకాలు ఎప్పుడు, ఎలా, ఎందుకు మొదలయ్యాయో తెలుసుకోవాల్సి ఉంది.
ప్రభుత్వాల ఉచిత హామీలన్నింటినీ అనుచితాలుగా పేర్కొనటం సాధ్యంకాదు. ఎందుకంటే మన సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన ప్రజల వాటా నేటికీ 60 శాతంగా ఉంది. దేశ వనరుల్లో ఈ వర్గాలకు దక్కుతున్న వాటా కనీసం పదిశాతం కూడా లేదు. మరోవైపు దేశంలోని శ్రమశక్తికి పేదలే ప్రధాన వనరుగా ఉన్నారు. మరి అలాంటి పేదలను అనుత్పాదకులుగా, సంపన్నుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే వారిగా పరిగణించటం ఏమాత్రం తగదు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే మన పాలకులు సామ్యవాద భావాలకు ప్రాధాన్యత నిచ్చారు. పన్నుల ద్వారా చేకూరిన సొమ్ముతో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించి, సమాజపు ఆస్తులను ఏర్పరచారు. కానీ, నేడు కార్పొరేట్ల పెత్తనమే ప్రతి రంగంలోనూ సాగుతోంది. చివరికి ప్రజల ధనంతో నడిచే ప్రభుత్వ బ్యాంకు రుణాల్లోనూ మెజారిటీ వాటా కార్పొరేట్లకే దక్కుతోంది. దీంతో సంపన్నులు మరింత సంపన్నులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో మరి దేశంలో ఉన్న పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది గాక మరొకరిది కాదు. అయితే, రాజకీయ అధికారం కోసం పార్టీలు అడ్డగోలుగా హామీలను ప్రకటించటం మాత్రం ఆక్షేపణీయమే. సంక్షేమం మీద అతిగా దృష్టి పెట్టటం వల్ల అభివృద్ధికి నిధులు లేక మొత్తం ఆర్థిక పరిస్థితి మొత్తానికే తలకిందులైన దేశాల విషాద అనుభవాలనూ పాలకులు పట్టించుకోవాలి.
Also Read: గులాబీల్లో ‘లోకల్’ గుబులు
తెలుగునేల మీద ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా చెప్పినా, నిజానికి అంతకు మందున్న కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే ఏదో ఒక స్థాయిలో పేదలకు సంక్షేమ పథకాలు అందుతూ వచ్చాయి. 80 వ దశకం తొలి నాళ్లలో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్.. అప్పటికి మార్కెట్లో 4 రూపాయలుగా ఉన్న బియ్యాన్ని 2 రూపాయలకే అందించి ప్రజలకు ఆహారభద్రతను చేకూర్చారు. అంటే, ప్రజలకు బియ్యాన్ని ఉచితంగా ఇచ్చే సామర్ద్యం ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ, పూర్తి ఉచితంగా ఇస్తే ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్లవుతుందనే భావనతో బాటు ఉచితంగా ఇస్తే దానిని దుర్వినియోగం చేస్తారనే భావనతో నాడు ఆ ప్రభుత్వం సబ్సిడీ మీద బియ్యాన్ని అందించింది. అలాగే చేనేతల్ని ఆదుకునేందుకు పేదలకు తక్కువ ధరలో జనతా వస్త్రాలు అందించటం, రూ. 10కే చీర రేషన్ షాపుల ద్వారా అందించటం చేశారు. తర్వాతి రోజుల్లో పార్టీలకు అతీతంగా ఈ సంక్షేమ పథకాలు పెరుగుతూ వచ్చాయి. తెలంగాణలో నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ సైతం మనది ధనిక రాష్ట్రం అంటూ దళిత బంధు, బీసీ బంధు వంటి అనేక పథకాలను ప్రకటించింది. వాటిలో ఎన్ని అమలయ్యాయో కూడా అందరికీ తెలిసిన సంగతే.
మరోవైపు ఉచిత పథకాలతో దేశం దివాలా తీస్తుందని ప్రధాని మోదీ తన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సెలవిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉచిత పథకాలు మానుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఏవి ఉచితాలో, వేటిని ఉపసంహరించుకోవాలో మాత్రం మోదీ స్పష్టంగా చెప్పలేదు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఆహార సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ, గ్యాస్, పెట్రోల్ సబ్సిడీతో బాటు పేద రైతు కుటుంబాలకి కిసాన్ సమ్మాన్ నిధి, వడ్డీమాఫీ పథకం, పంట బీమా వంటివి అందిస్తోంది. ఇవిగాక, దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ కార్పొరేషన్లు, ఆయా వర్గాలకు 20 శాతం సీడ్‌మనీ పేర సబ్సిడీలు ఇచ్చి బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నారు. దీనికి తోడు దేశంలోని 80 కోట్ల మంది పేదలకు …
మద్దూరి వెంకటేశ్వర రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్