How Can Telangana Universities Succeed : కోటి ఆకాంక్షలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం వడివడిగా అడుగులు వేయగలదని రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో అందరూ భావించారు. దీనికి తోడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన ‘కేజీ టు పీజీ’ విధానం తమ పిల్లలకు మంచి విద్యను అందిస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ.. పదేళ్ల కాలంలో అంతా తలకిందులై పోయింది. ఉమ్మడి పాలనలో విద్యారంగానికి ఇచ్చిన కేటాయింపులు.. పదేళ్లలో సగానికి పడిపోగా యువత ఉపాధిలో కీలకమైన యూనివర్సిటీ విద్య పూర్తిగా పడకేసింది. తెలంగాణ ఉద్యమకాలంలో ఉస్మానియాను ఆక్స్‌ఫర్డ్, కాకతీయను కేంబ్రిడ్జ్ రేంజ్‌కు తీసుకొస్తానన్న కేసీఆర్ మాట అధికారంలోకి రాగానే నీటగలిసి పోయింది. సర్కారు కొలువుతీరిన తర్వాత వీసీలు లేకుండానే ఏండ్ల తరబడి వర్సిటీలు నడిచాయి. నియామకాలు, నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి ఇలా ప్రతిరంగంలోనూ తెలంగాణ విశ్వవిద్యాలయాలు వెనకబడిపోయాయి. పదేళ్ల కాలంలో కనీసం ఒక్కసారి కూడా యూనివర్సిటీ విద్య, సౌకర్యాలపై సమీక్ష చేసే సమయం నాటి సీఎం గారికి లేకపోయింది.
2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటికి ఉన్న వీసీల కాలపరిమితి తీరిన తర్వాత వర్సిటీలన్నీ రెండేళ్ల పాటు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో సాగాయి. దీంతో అవి క్రమంగా తమ పూర్వ వైభవాన్ని కోల్పోతూ వచ్చాయి. 2016లో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వీసీల నియామకాలు జరిగిన తర్వాత పరిస్థితి కాస్త గాడిన పడుతుందేమోననే ఆశ కలిగింది. కానీ.. 2019లో తర్వాత అవి ఇన్‌చార్జిల పాలన కిందికి పోవటంతో పరిస్థితి మొదటికి వచ్చినట్లయింది. వర్సిటీల విషయంలో గత ప్రభుత్వం అవలంబించిన విధానాలను పరిశీలిస్తే, గత పాలకులు వీటిని విద్యాకేంద్రాలుగా గాక రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పునరావాస కేంద్రాలుగా భావించారనే సంగతి అర్థమవుతుంది. పదిహేనేండ్లుగా అధ్యాపక నియామకాలు లేకపోవటం, రీసెర్చ్ గ్రాంట్స్ విడుదల చేయకపోవడంతో తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన అనే మాటే లేకుండా పోయింది.
Read More: బిగుస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు..!
తెలంగాణ వర్సిటీల్లో 2013లో చివరిసారి రెగ్యులర్ సిబ్బంది నియామకాలు జరిగాయి. బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి నియామకాలు జరగలేదు. పైగా, తమకు తెలియకుండా యూనివర్సిటీలు ఎలాంటి నియామకాలు చేపట్టరాదంటూ ఏకంగా ఓ ఓవోను తెచ్చింది. రాష్ట్రంలోని మొత్తం వర్సిటీల్లో కేవలం 24 శాతం మంది మాత్రమే రెగ్యులర్ బోధనా సిబ్బంది ఉన్నారు. మిగిలిన 76 శాతం పోస్టులు ఖాళీయే. సెంట్రల్ యూనివర్సిటీల తరహా పదవీ విరమణ చేసే వారి స్థానాల్లో వెంటనే సిబ్బంది భర్తీ జరగటం లేదు. రెగ్యులర్ పోస్టుల భర్తీని పక్కనబెట్టిన గత ప్రభుత్వం 1365 మంది కాంట్రాక్టు, 700 మంది పార్టు టైమ్ అధ్యాపకులను నియమించింది. కానీ వారికీ జీతాలిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. రెగ్యులర్ అధ్యాపకులు లేరని కోర్సులు మూసివేసిన ఉదంతాలూ ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 2828 పోస్టులు మంజూరు కాగా 1869 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో 238 ప్రొఫెసర్, 781అసోసియేట్ ఫ్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ఆశ్చర్యం కాదు. దేశంలోనే తొలి భాషా వర్సిటీగా పేరున్న తెలుగు యూనివర్సిటీలో కేవలం మూడు రెగ్యులర్ పోస్టులున్నాయి. ఇంకా విషాదం ఏమిటంటే తెలుగు యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉండటం. తెలంగాణ యూనివర్సిటీలో 152 రెగ్యులర్ పోస్టులకు గానూ 69 మందే రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు.
గతంలో వీసీల నియామకాలు వివాదాలకు దారితీశాయి. అనర్హులను, తమ పార్టీకి జైకొట్టిన వారినే వీసీలుగా నియమించారంటూ కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. యూజీసీ నిబంధనలను ఉల్లంఘించి, కొందరు సీనియర్ బోధనా సిబ్బంది అనుభవాన్ని లెక్కలోకి తీసుకోకుండా నియామకాలు చేయటం వల్లనే ఈ పరిణామాలు సంభవించాయి. ఖాళీగా ఉన్న వీసీల భర్తీ కోసం ఇప్పటికే కొన్నిచోట్ల సెర్చ్ కమిటీల ఏర్పాటు, పాలక మండలి సభ్యుల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో నామిని ప్రతిపాదనలపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. సెర్చ్ కమిటీలో నామినీల ప్రతిపాదనలు కోసం ఉన్నత విద్యా శాఖ అన్ని యూనివర్సిటీల పాలకమండళ్లతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించింది. మరోవైపు, కొన్ని వర్సిటీల రేసులో మళ్లీ పాత వీసీలు కూడా ఉండటంపైనా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
నూటికి 90 మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఇంతటి దుస్థితి నెలకొన్నా, తొమ్మిదేళ్ల కాలంలో గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.
Read More: శనీశ్వరంగా మారిన కాళేశ్వరం..!
ప్రపంచీకరణ జరిగిన తర్వాత మానవ వనరుల బదిలీలు, టెక్నాలజీ, అనేక విప్లవాత్మకమైన మార్పులు చేసుకున్నాయి. మారుతున్న మార్కెట్ ఇండస్ట్రీ అవసరాలకు సరిపోయే విధంగా గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను, వివిధ కోర్సులను ఆధునికీకరణ చేయలేక పోయింది. పదేళ్ల కాలంలో పరిశోధనా సంస్థలను బలోపేతం చేయకపోవటంతో ఎంతో చరిత్ర గల మన వర్సిటీలకు ఒక్కటైనా చెప్పుకోదగ్గ జాతీయ, అంతర్జాతీయ పరిశోధన ప్రాజెక్టు రాలేదు. తెలంగాణ విశ్వవిద్యాలయాల దుస్థితిని గమనించిన కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో ఈ పరిస్థితిని మార్చే ప్రయత్నం చేస్తామంటూ హామీ ఇచ్చింది. కనుక ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ వర్సిటీల వర్తమాన పరిస్థితి మీద సమగ్రమైన సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. వర్సిటీల పరిస్థితి మెరుగుపడే వరకు ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష చేయటం వల్ల వీసీలు, ఇతర బాధ్యుల పనితీరులో మరింత సానుకూలమైన మార్పు వస్తుంది. విశ్వవిద్యాలయాల పెండింగ్ రీసెర్చి ఫండ్‌ను ప్రభుత్వం విడుదల చేయటం, నూతన హాస్టల్స్ నిర్మాణం, మోడ్రన్ లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, రిసెర్చ్ సెంటర్స్, స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్ వంటి ఏర్పాటు మీద నూతన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. విద్యార్ధినులపై వేధింపులు నిరోధించడానికి సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ అమలు, పరీక్షల కేలండర్ విడుదల, ప్రైవేటు సంస్థలు ఇక్కడి విద్యార్థులను ఎంపిక చేసుకుని, తగిన శిక్షణనిచ్చేలా ప్రభుత్వం చొరవ చూపితేనే ఉన్నత విద్యా ప్రమాణాలు మెరుగుపడి యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
– పడమటింటి రవి కుమార్ (సీనియర్ జర్నలిస్ట్)