Home Minister Anitha
ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నం

పిల్లలపై రాజకీయమా? హోంమంత్రి అనిత ఫైర్

విశాఖపట్నం, స్వేచ్ఛ: ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదన్ ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దురదృష్టకరమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విశాఖపట్నంలోని జువైనల్‌ హోంను అనిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ పిల్లలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే. దీన్ని ఎవరో గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నేను నా బాధ్యతగా ఇక్కడికి వచ్చాను. వైసీపీ సోషల్ మీడియా పేజీల్లో 80 శాతం పోస్టులు ఫేక్. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. గత 3 రోజులుగా బాలిక సదన్‌లో అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. లోపల ఏం జరుగుతోంది? అనేది ఎమ్మార్వో, ఒక మహిళా పోలీసును పంపించి తెలుసుకున్నాం. 13 జిల్లాల నుంచి పలు పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. బాలికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకున్నాం. బాలికలు వసతి గృహం గోడదూకి బయటకు వచ్చిన నేపథ్యంలో పటిష్ట రక్షణ ఏర్పాట్లు చేశాం’ అని అనిత వెల్లడించారు.