– ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
– ఈడీ ఎంట్రీకి పెరుగుతున్న డిమాండ్
– మొన్న రఘునందన్ రావు ఫిర్యాదు
– కొత్తగా రంగంలోకి హైకోర్టు లాయర్
– నిజానిజాలు నిగ్గు తేల్చాలని రిక్వెస్ట్
– పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు కోసం ఫిర్యాదు
Highcourt Advocate Letter To ED Over Phone Tapping Case : ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రస్తుతం ఏ స్టేజ్‌లో ఉందో చూస్తున్నాం. బడా లీడర్లు కటకటాల పాలయ్యారు. ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని కేంద్ర దర్యాప్తు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇదే టైమ్‌లో తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఎంట్రీ కోసం డిమాండ్ పెరుగుతోంది. లిక్కర్ స్కాం మాదిరిగా చినికి చినికి గాలి వానలా మారినట్టు ఈ కేసు కూడా బడా లీడర్ల మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసును ఈడీ టేకప్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
హైకోర్టు లాయర్ ఫిర్యాదు
ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఈడీకి ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది సురేష్. కేసులోని నిందితులు వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఓ పార్టీ డబ్బులను పోలీసు వాహనాల్లో తరలించామని వాళ్లు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు లాయర్ సురేష్. ఈ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని, ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న రాజకీయ నాయకులు బయటికి వస్తారని అన్నారు.
ఇప్పటికే ఈడీకి రఘునందన్ కంప్లయింట్
ఈ కేసు విషయంలో మొదట్నుంచి బీఆర్ఎస్ లింక్స్‌ను బయటపెడుతున్న బీజేపీ నేత రఘునందన్ రావు, ఈ మధ్యే ఈడీని కలిశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కింద బీఆర్ఎస్ నేత వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ కేసును ఈడీ టేకప్ చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని అన్నారు. రాధా కిషన్ రావును కస్టడీలోకి తీసుకుంటే, డబ్బుల వివరాలు గుట్టలు గుట్టలుగా బయటకు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. అసలు సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఇంకెంతమందో నిజానిజాలు నిగ్గు తేల్చాలని కోరినట్టు చెప్పారు.
ఈడీ ఎంట్రీపై మొదట్నుంచి ఊహాగానాలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసినప్పటి నుంచి ఈడీ ఈ కేసుపై ప్రత్యేక నిఘా పెట్టిందనే వార్తలు కొద్ది రోజులుగా వస్తున్నాయి. త్వరలోనే ఎంట్రీ ఇస్తుందని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. టాస్క్ ఫోర్స్ ముసుగులో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూళ్లు చేయడం, 2023 అసెంబ్లీ, అంతకుముందు ఉప ఎన్నికల్లో డబ్బులు తరలించడం వంటివన్నీ బయటకు పొక్కడంతో ఈడీ నజర్ పెట్టిందని అంటున్నారు. రాధా కిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా రంగంలోకి దిగబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఈడీకి వరుసగా ఫిర్యాదులు అందుతుండడంతో ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.