Cinema Stars: ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రచారం పీక్స్‌కు చేరుకుంది. నాయకులు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తమ బంధువులైన సినిమా స్టార్లను కూడా క్యాంపెయినింగ్‌లో దింపుతున్నారు. సినీ తారలు కూడా తమ బంధువులను ఈ ఎన్నికల పరీక్షలో గట్టెక్కించడానికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇందుకు తాజాగా విక్టరీ వెంకటేశ్ సిద్ధం అయ్యారు.
తీవ్ర ఉత్కంఠ నడుమ ఖమ్మం కాంగ్రెస్ టికెట్ సాధించిన రామసహాయం రఘురాం రెడ్డి తరఫున ప్రచారం చేయడానికి దగ్గుబాటి వెంకటేశ్ సిద్ధమైనట్టు తెలిసింది. ఖమ్మం టౌన్‌లో వచ్చే నెల 7వ తేదీన రామసహాయం రఘురాం రెడ్డి తరఫున రోడ్ షోలో పాల్గొని ఓటర్లను అలరించబోతున్నట్టు సమాచారం. రామసహాయం రఘురాం రెడ్డి, వెంకటేశ్ వియ్యంకులు. రఘురాం కొడుకు వెంకటేశ్‌తో వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రితకు పెళ్లి చేశారు. రఘురాం రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వియ్యంకుడే.
దీంతో వియ్యంకుడి గెలుపు కోసం సినిమా స్టార్ వెంకటేశ్ మండే ఎండల్లోనూ రోడ్ షోకు అంగీకరించినట్టు తెలిసింది. ఆ తర్వాత కైకలూరులోనూ వెంకీ ప్రచారం చేసే చాన్స్ ఉన్నదని చెబుతున్నారు. తమ బంధువు బీజేపీ తరఫున బరిలో ఉన్న కామినేని శ్రీనివాసరావు తరఫున క్యాంపెయిన్ చేసే అవకాశాలున్నట్టు తెలిసింది. ఎన్నికల క్యాంపెయిన్ వెంకటేశ్‌కే పరిమితం కాలేదు.
Also Read: టీ20 వరల్డ్ కప్‌కు భారత టీం ఇదే.. చాహల్, పంత్ కమ్‌బ్యాక్
పవన్ కళ్యాణ్ స్వయంగా సినిమా హీరో. ఆయన ఇప్పుడు పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు. పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. బాబాయ్ కోసం వరుణ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం చేశారు. హీరో నిఖిల్ కూడా ఏపీలో తళుక్కుమన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య పోటీ చేస్తున్నారు. ఆయన నామినేషన్ ర్యాలీలో హీరో నిఖిల్ పాల్గొన్నారు. టీడీపీకి ఓటు వేసి మాలకొండయ్యను గెలిపించాలని నిఖిల్ ఈ సందర్భంగా కోరారు.
ఇక చిరుత సినిమా హీరోయిన నేహా శర్మ తన తండ్రి కోసం యూపీలో ప్రచారం చేస్తున్న వార్తలు వైరలయ్యాయి. సాంప్రదాయ దుస్తుల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తండ్రి కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. క్యాంపెయిన్ వీడియోలు, ఫొటోలు ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి.