Farmers Suicide: రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అవుతున్నాయని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు అయినా లేదని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే.. సీఎం సొంత జిల్లాలోనే నిన్న ఓ యువరైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడరని చెప్పారు. ఈ ఘటనలు మరువకముందే ఈ రోజు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం, ఆలియా తండాలో మరో రైతు పురుగల మందు తాగి ప్రాణాలు వదలడానికి సిద్ధమయ్యాడని వివరించారు.
రైతుల ఆత్మహత్యలను అడ్డుకోవడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరమని హరీశ్ రావు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదని ఎద్దేవా చేశారు. నేడు పురుగుల మందే రైతన్నలకు పెరుగన్నమైన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని, ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో ఈ పరిస్థితులు మళ్లీ వచ్చాయని విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతు సమస్యలను పరిష్ఖరించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుననదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయిందని, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వారానికి రెండు సార్లు ఢిల్లీకి వెళ్లివస్తూ గాల్లోనే చక్కర్లు కొడుతున్నారని ఎమ్మెల్సీ తాత మధు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నదని, అనేక ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేస్తూ.. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని, మరణ వాంగ్మూలంలో హస్తం గుర్తుకు ఓటేశానని పేర్కొన్నట్టు వివరించారు. వాస్తవం ఇలా ఉండగా.. కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి మాత్రం రైతు ప్రభాకర్ చావుకు బీఆర్ఎస్ కారణం అని అర్థంలేని ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు. కోదండరెడ్డికి వయసు పెరిగిందని, గానీ ఆలోచన లేదని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ శిష్యుడైన కిషోర్ వల్లే రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఆయన కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని సూచించారు. ఒక వైపు రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే ప్రశ్నించే గొంతుకలమని చెప్పుకునే ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్నలు ఎక్కడ పోయారని విమర్శించారు. ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురుచూస్తున్నాడని, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైందని ఆరోపించారు.