– పెన్ లేదని డ్రామాలు ఆడొద్దు
– ఆగస్టు 15న రుణమాఫీ ఖాయం
– సొంత పార్టీలో ఉనికి కోసమే హడావుడి: ఆది శ్రీనివాస్
Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. హరీశ్ రావుకు పనీ పాట లేదని, సొంత పార్టీలో ఉనికి కోసమే గాయ్ గాయ్ చేస్తున్నాడన్నారు. ప్రజల్లో సానుభూతి, పదవి రెండూ కావాలని అనుకుంటున్నాడని, అందుకే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజీనామా డ్రామా కూడా అందులో భాగమేనని చెప్పారు. ఆగస్టు 15న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి తీరుతుందని, కాబట్టి, హరీశ్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని, ఆగస్టు 15వ తేదీ తర్వాత మాజీ ఎమ్మెల్యే కావడానికి రెడీ అవ్వాలని పేర్కొన్నారు. అప్పుడు మళ్లీ పెన్ లేదని, కాగితం లేదని డ్రామాలు ఆడొద్దని విమర్శించారు. ఉద్యమ సమయంలో పెట్రోల్ మీద పోసుకుని అగ్గిపుల్ల దొరకలేదని డ్రామాలు ఆడినట్టు ఇప్పుడు కూడా నాటకాలు ఆడితే కుదరదన్నారు.
ఆది శ్రీనివాస్ అసెంబ్లీ మీడియా హాల్‌లో మాట్లాడుతూ.. హరీశ్ రావు గాయిగాయి చేయడం మానుకోవాలని, అసలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంతలా దిగజారిందో హరీశ్ రావు ఆలోచించుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. అంతేకాదు, హరీశ్ రావు తన మామను ఈ పరిస్థితికి కారణమేంటని నిలదీయాలని చెప్పారు. పనికి మాలిన విషయాలు మానేసి లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి డిపాజిట్లు ఎందుకు రాలేవో ఆలోచించాలని, కేటీఆర్, హరీశ్ రావులు చర్చించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో లబ్ది కోసమే హరీశ్ రావు రాజీనామా డ్రామా చేశాడని, కానీ, ప్రజలు అది వట్టిడ్రామానే అని గ్రహించారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు మానుకోవాలని ఆది శ్రీనివాస్ హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వేయనేలేదని ఆరోపణలు చేయడం సరికాదని, 69 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చామని వివరించారు. తన మామ సీఎంగా ఉన్నప్పుడు రైతు బంధు ఎప్పుడు ఇచ్చారో హరీశ్ రావు చెప్పాలని నిలదీశారు. తన మామ రియల్ ఎస్టేట్ వెంచర్లు, కొండలు, గుట్టలకు కూడా రైతుబంధు ఇచ్చాడని విమర్శించారు. తమ ప్రభుత్వంలో అలాంటి పొరపాట్లకు వీల్లేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రికార్డు సాధించిందని, ఎక్కువ కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వివరించారు. ఆగస్టు 15న మాజీ ఎమ్మెల్యే కావడానికి హరీశ్ రావు మానసికంగా సిద్ధంగా ఉండాలని చెప్పారు. తమ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిన తర్వాత పెన్ దొరకలేదని, సంతకం పెట్టలేదని, మరోటని చెప్పి డ్రామాలు చేయవద్దని హరీశ్ రావుకు సూచనలు చేశారు.