Harish Rao latest comments(TS today news): బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేటలో మాట్లాడారు. 2002 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని జలదృశ్యంలో ఉద్యమ పార్టీ మొదలైందని గుర్తు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ దేశానికే ఆదర్శంగా ఎదిగిందని కొనియాడారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించేది కాదని అన్నారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని చెబుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతమైన పాలనను అందించిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన దేశానికి ఆదర్శంగా మారిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని అన్నారు. రైతు బంధు పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపీ కొట్టిందని, దాన్నే కిసాన్ సమ్మాన్ నిధిగా అమలు చేస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీశ్ రావు మరోసారి రాజీనామా అంశాన్ని లేవనెత్తారు. ఆనాడు తెలంగాణ కోసం తాను రాజీనామా చేశానని, రాజీనామా చేయకుండా తప్పించుకుని తిరిగిన వ్యక్తి కిషన్ రెడ్డి అని విమర్శించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధం అని, స్పీకర్ ఫార్మాట్‌లో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి ఆ లేఖను పంపిస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కూడా పంపించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తనకు ఉన్నదని, ప్రతిపక్ష నేతగా తాను పోరాటం చేస్తూనే ఉంటానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను తగ్గించే ఆలోచనలు చేస్తున్నదని, సిద్ధిపేట జిల్లాను ఊడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ జిల్లాలు ఇలాగే కొనసాగాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటేసి ఎక్కువ మంది అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Also Read: ఎలగందుల ఎటువైపో?.. దిగ్గజాల కోటలో త్రిముఖ పోరు
గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు రాజీనామా లేఖతో వచ్చి శుక్రవారం హల్ చల్ చేశారు. రెండు పేజీల నిండా ఆయన డిమాండ్లు పేర్కొంటూ రాజీనామా చేస్తానని అందులో పేర్కొన్నారు. అయితే.. అది స్పీకర్ ఫార్మాట్‌లో లేదని, కేవలం ఎలక్షన్ స్టంట్ కోసమే హరీశ్ రావు ఆ లేఖ రాసుకొచ్చారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చేసింది. హరీశ్ రావు చాలెంజ్‌ను స్వీకరిస్తున్నామని, పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి, హరీశ్ రావు తన రాజీనామా లేఖను సిద్ధంగా ఉంచుకోవాలని, అప్పుడు కూడా మాట తప్పొద్దని చురకలంటించారు.