Gutta Sukender Reddy: ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంతో తలనొప్పులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్.. ఇప్పుడు సీనియర్ల అసంతృప్తి సెగలకూ లోనవుతున్నది. అదీ లోక్ సభ ఎన్నికల ముందే విమర్శలు చేస్తుండటంతో మరింత ఒత్తిడికి గురవుతున్నది. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, ఓటమిని సమీక్షించుకునే విధానమూ లేదని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ తాజాగా తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ నిర్మాణమే లోపభూయిష్టమైందని ఆరోపించారు. కేసీఆర్ కొందరు లిల్లిపుట్‌లను తయారు చేశారని విమర్శించారు. ఆయన చుట్టూ ఉన్న కోటరీతోనే పెద్ద నష్టం వచ్చిందని వివరించారు. వారి వల్లే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు దూరమైందని చెప్పారు.
కేసీఆర్ 16 సార్లు విజ్ఞప్తి చేస్తే.. తెలంగాణవాదిగా, ఎంపీగా ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యమైన నాయకులతో బీఆర్ఎస్‌లో చేరానని గుత్తా సుఖేందర్ తెలిపారు. ముందస్తుగానే క్యాబినెట్ బెర్త్ హామీ తీసుకున్నానని వివరంచారు. తనకు ఎమ్మెల్సీ పదవి రాకుండా కొందరు కుట్రలు పన్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా ఉద్యమకారుల పేరుతో కొందరు బీఆర్ఎస్‌లో గల్లాలు ఎగరేసుకు తిరుగుతున్నారని అన్నారు. అదే ట్యాగ్‌తో అధికారంలోకి వచ్చి కోట్లకు పడగలెత్తారని చెప్పారు. పప్పు బఠాణీలు అమ్ముకునేవాళ్లు కోటీశ్వరులయ్యారని తెలిపారు.
Also Read: మొన్న కేసీఆర్‌ను గద్దె దింపాం.. ఇక మోడీ వంతు
బీఆర్ఎస్ నాయకులు తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని, విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని గుత్తా సూచించారు. తాను రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్నారని, ఏ పార్టీతో సంబంధం లేదని తెలిపారు. ఒక వేళ అబద్ధపు ఆరోపణలు, బురద జల్లే ప్రయత్నం చేస్తే.. వారి బండారాన్ని అవసరమైనప్పుడు బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు.
పార్టీలో పరిస్థితులను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని తాను ప్రయత్నించినట్టు గుత్తా చెప్పారు. కానీ, తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ఆయన ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అన్నారు. తాను చెప్పిన విషయాలను కేసీఆర్ ఖాతరు చేయలేదని తెలిపారు. ఆయన కేవలం తన చుట్టూ ఉన్న కోటరీ మాటలనే విన్నారని, అందుకే పార్టీ ప్రస్తుతం ఈ దుస్థితికి వచ్చిందని ఆరోపించారు. నల్లగొండలో ఆ స్థాయిలో సీట్లు కోల్పోవడంపై ఇప్పటికీ సమీక్ష చేసుకోనేలేదని అన్నారు. బీఆర్ఎస్ కూడా బీఎస్పీలాగే తయారైందని, ఎమ్మెల్యే కేంద్రంగా చేసిన రాజకీయాలే నష్టం చేకూర్చాయని వివరించారు. ఎమ్మెల్యేల మాటలతోపాటు ఇతర సీనియర్ నాయకుల అభిప్రాయాలను తీసుకోలేదని ఆరోపించారు.