Gutha amith reddy: కీలక నేతల జంపింగ్‌లతో బీఆర్ఎస్ సతమతం అవుతోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం ఇబ్బందికరంగా మారింది. అయినా, తమ ఉనికిని కాపాడుకునేందుకు కేసీఆర్ తెగ తాపత్రయపడుతున్నారు. అయితే, షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి హస్తం గూటికి చేరారు. చేరిక అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అమిత్. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నల్గొండ లేదా భువనగిరి నుంచి పోటీ చేయాలని అమిత్ రెడ్డి ప్రయత్నించారు. కానీ, జిల్లా నేతల నుంచి అభ్యంతరం వ్యక్తం అయింది. ఈ క్రమంలోనే పార్టీ మారినట్టు తెలుస్తోంది. మరోవైపు, బీజేపీ ఎన్నారై సెల్ జాయింట్ కన్వీనర్ నంగి దేవేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీపాదాస్ మున్షీ ఆయనకు కండువా కప్పి స్వాగతం చెప్పారు.