– కేరళ తరహా పాలసీ తెస్తున్నాం
– గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల సాయం
– ప్రజాభవన్‌లో గల్ఫ్ కార్మికులకై ప్రత్యేక సెల్
– గల్ఫ్ భాధితుల సమావేశంలో సీఎం రేవంత్
– చిన్న ఎన్నికలో ఓడితేనే పెద్ద పదవులొస్తాయ్
– జీవన్ రెడ్డి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి అవుతారు
– నేతలతో సీఎం సరదా సంభాషణ
Gulf And Overseas Workers Welfare Board Soon CM Revanth Reddy: తెలంగాణ నుంచి గల్ఫ్ వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం గల్ఫ్ బాధితులతో హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయించుకున్న ఏజెంట్ల ద్వారానే కార్మికులు విదేశాలకు వెళ్లాలన్నారు. తాము వెళ్లే దేశం పరిస్థితులు, చట్టాలు, పని వివరాల వంటి అంశాల మీద కార్మికులకు వారం రోజుల పాటు ఇక్కడే శిక్షణ ఇచ్చే వ్యవస్థకు రూపకల్పన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని వెల్లడించారు.ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల్లో తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను బాధితుల తరపు ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
వాటిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ కార్మికుల మీద ఆధారపడి ఉన్నాయనీ, వారిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ గల్ఫ్, ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. గల్ఫ్ కార్మికుల సహాయార్థం ప్రజాభవన్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామనీ, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని దీని పర్యవేక్షణకు నియమిస్తామని హామీ ఇచ్చారు. కేరళ తరహా పాలసీని తేవటం ద్వారా ఎప్పటికప్పడు గల్ఫ్ కార్మికుల వేతనాలు, ఉపాధి ఎలా ఉందో పర్యవేక్షిస్తామని, చనిపోయిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్లు వెల్లడించారు.
జీవన్ రెడ్డికి కేంద్రమంత్రి..
ఈ కార్యక్రమం అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులు, నేతలతో కాసేపు సంభాషించారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల గురించి మాట్లాడుతూ, ప్రతి ఆటలోనూ గెలుపు ఓటమి ఉంటాయనీ, ఓడిపోయామని ఎవరూ కుంగిపోవాల్సిన పనిలేదన్నారు. ఇందుకు తానే ఒక ఉదాహరణ అంటూ 2018లో ఓడినా ఆరునెలల్లో వచ్చిన ఎంపీ ఎన్నికల్లో లోక్‌సభకు వెళ్లాననీ, అదే ఊపులో సీఎం పదవి వరకు చేరానన్నారు. జీవన్ రెడ్డి కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా రేపు నిజామాబాద్ ఎంపీ కాబోతున్నారని, అన్నీ కలిసొస్తే కేంద్రమంత్రి కూడా కావొచ్చని జోస్యం చెప్పారు. చిన్న పదవులను ఓడితేనే, పెద్ద పదవులు వస్తాయన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.